Sean Spicer
-
రిజైన్ చేశారుగా.. ఇక ఆయన లైఫ్ అదుర్స్: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినరోజు నుంచీ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్న డోనాల్డ్ ట్రంప్ మరో వివాదానికి తెరతీశారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ పదవికి రాజీనామా చేసిన సీన్ స్పైసర్ భవిష్యత్తు ఇక వెలిగిపోతుందంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. మీడియాకు సంబంధించిన బాధ్యతల నుంచి తప్పుకున్నందుకే స్పైసర్ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని ట్రంప్ అనడంపై జర్నలిస్టు సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. 'సీన్ స్పైసర్ అద్బుతమైన వ్యక్తి. కానీ ఫేక్ న్యూస్ మీడియా కారణంగా ఆయన అవమానాల పాలయ్యారు. అలాంటి మీడియా స్పైసర్ను దారుణంగా దూషించిందని వ్యాఖ్యానించిన ట్రంప్' అనంతరం ఈ విషయంపై ట్వీట్ చేశారు. న్యూయార్క్ వ్యాపారవేత్త, రాజకీయ మద్ధతుదారుడైన ఆంథోనీ స్కారముక్కీని వైట్‌హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా అధ్యక్షుడు ట్రంప్ నియమించారు. శుక్రవారం ఉదయం వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ బాధ్యల నుంచి తప్పుకుంటూ సీన్ స్పైసర్ రాజీనామా చేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టిన్నప్పటి నుంచీ స్పైసర్ ఆ ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వైట్ కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా తనకే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తారని భావించిన స్పైసర్కే చేదు అనుభవం ఎదురైంది. మరోవైపు మీడియాతో ఎప్పుడు హద్దులుదాటి ప్రవర్తించే వ్యక్తిని సమర్థించడంతో పాటు తమను ఫేక్ న్యూస్ మీడియా అంటూ ట్రంప్ సంబోధించడాన్ని మీడియా ప్రతినిధులు తప్పుపడుతున్నారు. రాజీనామా చేసిన స్పైసర్ అద్బుతమైన వ్యక్తి కానేకాదని, అతనికి కనీసం ఎలా మాట్లాడాలో కూడా తెలియదంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Sean Spicer is a wonderful person who took tremendous abuse from the Fake News Media - but his future is bright! — Donald J. Trump (@realDonaldTrump) 22 July 2017 -
వైట్‌హౌస్‌లో మరో రాజీనామా
న్యూయార్క్: అమెరికా శ్వేతసౌదం మీడియా సెక్రటరీ సియాన్ స్పైసర్ రాజీనామా చేశారు. అతి తక్కువ కాలం మాత్రమే విధులు నిర్వహించిన ఆయన శుక్రవారం తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇటీవల ఇక నుంచి తన మీడియా అధికారిక ప్రతినిధిగా వాల్‌స్ట్రీట్ ఫైనాన్సియర్ అంటోనీ స్క్రాముస్సి ఉండనున్నారని చెప్పిన నేపథ్యంలో స్పైసర్ ఇక రాజీనామా చేశారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ స్పష్టం చేసింది. అయితే, స్పైసర్ అనూహ్యంగా బాధ్యతల నుంచి వెళ్లిపోయిన నేపథ్యంలో ట్రంప్, లీగల్, కమ్యునికేషన్ బృందాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి సంబంధించిన దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో సియాన్ రాజీనామా వారిలో కొంత ఆందోళన కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టాక ఆయన టీంలో సియాన్ కీలక సభ్యుడిగా వ్యవహరించారు. -
మరో ఎటాక్‌కు ప్లాన్: అగ్రరాజ్యం సీరియస్
రసాయనిక దాడులతో సిరియాను రక్తసిక్తం చేస్తున్నారు. మరోమారు మరో ఘోర రసానియ దాడికి సిరియన్ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ సిద్ధమవుతున్నట్టు వైట్ హౌజ్ పేర్కొంది. ఒకవేళ ఆయన ఈ దాడికి పాల్పడితే భారీ మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. సోమవారం రాత్రి విడుదల చేసిన వైట్ హౌజ్ ప్రకటనలో సిరియా అధ్యక్షుడికి అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఏప్రిల్ లో రసాయనిక దాడికి పాల్పడే ముందు చేపట్టిన సన్నాహాలు మాదిరే, సిరియాలో ప్రస్తుతం మరో కెమికల్ దాడికి ప్రయత్నాలు జరుగుతున్నాయని గుర్తించినట్టు వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ చెప్పారు. అసద్ పరిపాలనలో మరో భారీ రసాయనిక వాయువుల దాడి జరుగబోతుందని, ఇది భారీ మొత్తంలో ప్రజలను బలితీసుకోనుందని తెలిపారు. ఇదే రకమైన కార్యకలాపాలు 2017 ఏప్రిల్ 4 కు ముందు కూడా చేపట్టారని పేర్కొన్నారు. ఒకవేళ రసాయనిక ఆయుధాలతో ప్రజల ప్రాణాలను బలిగొనే ఎటాక్ ను చేపడితే, ఆయన, ఆయన సైన్యం భారీ మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పైసర్ హెచ్చరించారు. ఏప్రిల్ లో జరిగిన ఎటాక్ కు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ గా స్పందించారు. వెంటనే అసల్ కంట్రోల్ లో ఉన్న ఎయిర్ ఫీల్డ్ పై దాడులు చేపట్టారు. ఏప్రిల్ లో జరిగిన రసాయనిక దాడిలో ముక్కుపచ్చరాలని పసిపిల్లల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో ఎక్కువగా ఏ పాపం తెలియని చిన్నారులే ఉన్నారు. -
తప్పులో కాలేసిన ‘ట్రంప్’ సెక్రటరీ.. సారీ
వాషింగ్టన్: సిరియా ప్రభుత్వం తమ సొంత ప్రజలపై కెమికల్ దాడులు చేయడాన్ని విమర్శించే క్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు, శ్వేతసౌదం మీడియా కార్యదర్శి సియాన్ స్పైసర్ నాలుకకరుచుకున్నాడు. కనీసం నాటి జర్మనీ నియంత హిట్లర్ కూడా విష రసాయనాలను తన సొంత ప్రజలపై ఇలా ప్రయోగించలేదన, ఇలాంటి యుద్ధ విధానాలు అనుసరించలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే తాను అన్నమాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. సిరియా ప్రజలపై విషరసాయనాల దాడులు జరిగి దాదాపు 100మంది అమాయకపు పౌరులు చనిపోయిన విషయం తెలిసిందే. దాడిని సిరియా ప్రభుత్వమే చేసిందని ఆరోపిస్తూ అమెరికా క్షిపణుల దాడి చేసింది. ఈ దాడిని సమర్థించుకునే క్రమంలో వైట్ హౌస్ తరపున ప్రకటన చేస్తూ తొలుత ‘సిరియా అధ్యక్షుడు బషర్ అస్సాద్లాగా హిట్లర్ కూడా చేయలేదు. సొంత ప్రజలపై ఆయన కూడా ఎన్నడూ విష రసాయనాలు ప్రయోగించలేదు. ఇలాంటి యుద్ధ విధానాలు అనుసరించలేదు’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కొన్ని గంటల్లోనే ధుమారం రేగింది. హిట్లర్ విష వాయువులు ప్రయోగించి మిలియన్లమంది యూదులను, ఇతరులను హత్య చేశాడంటూ ఇప్పటికే వాస్తవాలు ఉన్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు వివాదం అయ్యాయి. దీంతో మరోసారి ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సియాన్ ‘నిజం చెప్పాలంటే నేను ఆ మాటలు అనుకోకుండా ఉపయోగించాను. అది నా తప్పే. వాస్తవానికి హిట్లర్‌తో పోలిక లేదు. అలా చెప్పినందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను. అలా చేయడం నిజంగానా తప్పే’ అని తిరిగి వివరణ ఇచ్చారు. అయితే, బషర్ ఎంత దారుణ చర్యకు పాల్పడ్డాడో చెప్పడమే తన ఉద్దేశం అని, తన మాటలు విన్నవారు కేవలం బషర్ ప్రవర్తను అర్థం చేసుకోవాలని చెప్పారు. -
ట్రంప్‌కు వినిపించలేదేమో...
మెర్కెల్‌కు షేక్‌హ్యాండ్ తిరస్కరణపై వైట్‌హౌస్ ప్రతినిధి వివరణ బెర్లిన్: గతవారం శ్వేతసౌధంలో మీడియా సమావేశం సందర్భంగా జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా మెర్కెల్‌తో కరచాలనం చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించలేదని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి సీన్ స్పైసర్ తెలిపారు. షేక్‌హ్యాండ్ కోసం మెర్కెల్ చేసిన సూచనను ట్రంప్ వినకపోయి ఉండొచ్చని ఆయన ఆదివారం ఓ జర్మనీ పత్రికతో చెప్పారు. శుక్రవారం మెర్కెల్ అమెరికా పర్యటన సుహృద్భావ వాతావరణంలో ప్రారంభమైంది. శ్వేతసౌధం ప్రవేశం వద్ద ఇద్దరు నేతలు కరచాలనం చేసుకున్నారు. అయితే ఓవల్ కార్యాలయంలో మీడియా ముందు మరోసారి కరచాలనం చేయాలన్న మెర్కెల్ సూచనను ట్రంప్ పట్టించుకోకపోవడం చర్చనీయాంశమైంది. దాదాపు 30 నిమిషాలు జరిగిన ఆ మీడియా సమావేశంలో వారిరువురు నాటో, రక్షణ వ్యయం, స్వేచ్ఛా వాణిజ్యం గురించి మాట్లాడినా ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది తక్కువే. వైట్‌హౌస్‌లో మెర్కెల్‌తో చర్చల సందర్భంగా ట్రంప్ ఒక్కసారి కూడా ఆమె కళ్లలోకి చూసి మాట్లడలేదని జర్మన్ పత్రిక బిల్డ్ తెలిపింది. -
చైనాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్
వాషింగ్టన్: దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. వివాదాస్పద ఈ సముద్రంలో తమ ప్రయోజనాలను తాము కాపాడుకుంటామని స్పష్టం చేసింది. అంతేకాకుండా అంతర్జాతీయ ప్రాదేశిక ప్రాంతాలను 'ఒక దేశం' స్వాధీనం చేసుకోకుండా అడ్డుకుంటామని కూడా తెలిపింది. 'దక్షిణ చైనా సముద్రంలో పలు ప్రాంతాలు అంతర్జాతీయ జలాలు, అంతర్జాతీయ కార్యకలాపాల కిందకు వస్తాయి. అక్కడి మా ప్రయోజనాలను కాపాడుకుంటామని అమెరికా కచ్చితంగా చాటిచెప్పగలదు' అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసెర్ తన మొదటి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. 'దక్షిణ చైనా సముద్రంలోని దీవులు అంతర్జాతీయ జలాలోనివే. అవి చైనాకు చెందినవి కావు. అంతర్జాతీయ ప్రాదేశిక ప్రాంతాలను ఒక దేశం స్వాధీనం చేసుకోకుండా మేం అండగా నిలబడతాం అన్నది చాటుతాం' అని స్పైసర్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ జలాల్లో ఉన్న ఈ దీవుల్లోకి చైనా ప్రవేశాన్ని నిరాకరిస్తామని ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రిగా ఎంపికైన టెక్స్ టిల్లర్సన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నలకు స్పైసర్ ఈ విధంగా బదులిచ్చారు. అమెరికా ఉత్పత్తులకు, సేవలకు ఇప్పటికీ చైనానే అతిపెద్ద మార్కెట్ అని, అదేవిధంగా చైనా వ్యాపారవేత్తలు, వ్యక్తులకు అమెరికాలో స్వేచ్ఛగా తమ ఉత్పత్తులు అమ్ముకునే అవకాశముందని చెప్పారు.