తప్పులో కాలేసిన ‘ట్రంప్’ సెక్రటరీ.. సారీ
వాషింగ్టన్: సిరియా ప్రభుత్వం తమ సొంత ప్రజలపై కెమికల్ దాడులు చేయడాన్ని విమర్శించే క్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు, శ్వేతసౌదం మీడియా కార్యదర్శి సియాన్ స్పైసర్ నాలుకకరుచుకున్నాడు. కనీసం నాటి జర్మనీ నియంత హిట్లర్ కూడా విష రసాయనాలను తన సొంత ప్రజలపై ఇలా ప్రయోగించలేదన, ఇలాంటి యుద్ధ విధానాలు అనుసరించలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే తాను అన్నమాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. సిరియా ప్రజలపై విషరసాయనాల దాడులు జరిగి దాదాపు 100మంది అమాయకపు పౌరులు చనిపోయిన విషయం తెలిసిందే. దాడిని సిరియా ప్రభుత్వమే చేసిందని ఆరోపిస్తూ అమెరికా క్షిపణుల దాడి చేసింది.
ఈ దాడిని సమర్థించుకునే క్రమంలో వైట్ హౌస్ తరపున ప్రకటన చేస్తూ తొలుత ‘సిరియా అధ్యక్షుడు బషర్ అస్సాద్‌లాగా హిట్లర్ కూడా చేయలేదు. సొంత ప్రజలపై ఆయన కూడా ఎన్నడూ విష రసాయనాలు ప్రయోగించలేదు. ఇలాంటి యుద్ధ విధానాలు అనుసరించలేదు’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కొన్ని గంటల్లోనే ధుమారం రేగింది. హిట్లర్ విష వాయువులు ప్రయోగించి మిలియన్లమంది యూదులను, ఇతరులను హత్య చేశాడంటూ ఇప్పటికే వాస్తవాలు ఉన్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు వివాదం అయ్యాయి.
దీంతో మరోసారి ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సియాన్ ‘నిజం చెప్పాలంటే నేను ఆ మాటలు అనుకోకుండా ఉపయోగించాను. అది నా తప్పే. వాస్తవానికి హిట్లర్‌తో పోలిక లేదు. అలా చెప్పినందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను. అలా చేయడం నిజంగానా తప్పే’ అని తిరిగి వివరణ ఇచ్చారు. అయితే, బషర్ ఎంత దారుణ చర్యకు పాల్పడ్డాడో చెప్పడమే తన ఉద్దేశం అని, తన మాటలు విన్నవారు కేవలం బషర్ ప్రవర్తను అర్థం చేసుకోవాలని చెప్పారు.