ట్రంప్‌కు వినిపించలేదేమో...
మెర్కెల్‌కు షేక్‌హ్యాండ్ తిరస్కరణపై వైట్‌హౌస్ ప్రతినిధి వివరణ
బెర్లిన్: గతవారం శ్వేతసౌధంలో మీడియా సమావేశం సందర్భంగా జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా మెర్కెల్‌తో కరచాలనం చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించలేదని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి సీన్ స్పైసర్ తెలిపారు. షేక్‌హ్యాండ్ కోసం మెర్కెల్ చేసిన సూచనను ట్రంప్ వినకపోయి ఉండొచ్చని ఆయన ఆదివారం ఓ జర్మనీ పత్రికతో చెప్పారు. శుక్రవారం మెర్కెల్ అమెరికా పర్యటన సుహృద్భావ వాతావరణంలో ప్రారంభమైంది. శ్వేతసౌధం ప్రవేశం వద్ద ఇద్దరు నేతలు కరచాలనం చేసుకున్నారు.
అయితే ఓవల్ కార్యాలయంలో మీడియా ముందు మరోసారి కరచాలనం చేయాలన్న మెర్కెల్ సూచనను ట్రంప్ పట్టించుకోకపోవడం చర్చనీయాంశమైంది. దాదాపు 30 నిమిషాలు జరిగిన ఆ మీడియా సమావేశంలో వారిరువురు నాటో, రక్షణ వ్యయం, స్వేచ్ఛా వాణిజ్యం గురించి మాట్లాడినా ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది తక్కువే. వైట్‌హౌస్‌లో మెర్కెల్‌తో చర్చల సందర్భంగా ట్రంప్ ఒక్కసారి కూడా ఆమె కళ్లలోకి చూసి మాట్లడలేదని జర్మన్ పత్రిక బిల్డ్ తెలిపింది.