ఏఐసీసీ కార్యదర్శులకు పని విభజన
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో 2019 ఎన్నికలను దీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి కార్యదర్శులుగా నియమితులైన ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులకు శనివారం ఢిల్లీలోని పార్టీ వార్‌రూమ్‌లో జరిగిన సమావేశంలో పని విభజన చేశారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి అశోక్ గెహ్లాట్, తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుం తియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై నాలుగున్నర గంటలపాటు చర్చించారు. కొత్తగా నియమితులైన ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులకు 40 నియోజకవర్గాల చొప్పున పని విభజన చేశారు. ఈ నెల 25న హైదరాబాద్‌లో పీసీసీ కార్యవర్గ సభ్యులు, డీసీసీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 26 నుంచి 90 రోజులపాటు కార్యదర్శులు వారికి కేటాయించిన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తారు. జిల్లా, బ్లాక్, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తారు.
ఎన్నికలు డిసెంబర్లో వచ్చినా ఓకే...
పార్లమెంటు, శాసనసభ ఎన్నికలు డిసెంబర్లో వచ్చినా దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, పార్టీని బలోపేతం చేయడమే తమ కర్తవ్యమని ఆర్సీ కుంతియా పేర్కొన్నారు. వార్‌రూమ్ సమావేశం అనంతరం ఉత్తమ్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పీసీసీ అధ్యక్ష పదవిలో మార్పులు ఉంటాయన్న వార్తలు అవాస్తవం. ఉత్తమ్ నేతృత్వంలో పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నాం. పార్టీలో అంతర్గత విభేదాలు ఉంటే అధిష్టానానికి చెప్పుకోవచ్చు. నేరుగా రాహుల్‌గాంధీకి చెప్పినా అభ్యంతరం లేదు. కానీ మీడియాలో ప్రకటనలు చేస్తే కఠిన చర్యలుంటాయి’’అని హెచ్చరించారు. ‘‘పార్టీని వీడేవారు వీడుతుంటారు. ఆ ఆలోచన ఉన్నవారిని ఎలా ఆపగలం? 2014తో పోలిస్తే మా ఓటు బ్యాంకు 10 శాతం పెరిగింది. సర్వేలు మాకు అనుకూలంగా ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ మారినా మా ఓటు బ్యాంకు పెరిగింది’’ అని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
ఇన్చార్జులకు విస్తృత అధికారాలు...
‘‘నూతన ఏఐసీసీ కార్యదర్శులకు విస్తృత అధికారా లుంటాయి. అభ్యర్థుల ఎంపిక సహా పలు అధికారాలు వారికి అప్పగించారు. డిసెంబర్లో ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేలా పార్టీని సిద్ధం చేస్తున్నాం. ఈ ఏడాది ఎన్నికలున్న రాష్ట్రాలకే ఎన్నికల కమిటీలను నియమించారు. తెలంగాణ సహా మిగిలిన రాష్ట్రాలకు నియమించలేదు’’అని ఉత్తమ్ అన్నారు.