షార్క్‌కన్నా షార్ప్!
పార్కుకెళితే... చిన్నచిన్న బోట్లు.. వాటిల్లో లాహిరి లాహిరి లాహిరి అంటూ షికార్లు మామూలే. కానీ ఫొటోలో కనిపిస్తున్న సీబ్రీచర్ మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. ఎందుకంటారా? ఇది నీటిపైనే కాదు.. అడుగున కూడా దూసుకెళ్లగలదు. ఓ డాల్ఫిన్‌లా, ఓ తిమింగలంలా గాల్లోకి జంప్ చేయగలదు కూడా. అంతేనా...? చిన్నసైజు జలాంతర్గామిలా నీటిలోపల రయ్యి రయ్యి మని దూసుకెళ్లేటప్పుడు మీరు గిర్రున తిరగవచ్చు కూడా! యుద్ధవిమానం గాల్లో గిరికీలు కొట్టేలా అన్నమాట! అలాగనీ మరీ లోతులకు వెళ్లలేదు గానీ... దాదాపు 5 అడుగుల లోతుకు వెళ్లి పైకి రాగలదు.
పైగా దీన్ని నడపడం చాలా సులువు కూడా. చేతులతో పట్టుకునే కంట్రోల్స్ ద్వారా దీన్ని నడుపుతారు. కంట్రోల్స్ రెండింటినీ ముందుకు తోస్తే రెక్కలు కూడా ముందుకు వంగిపోయి పడవ ముందుకు కదిలి నీటిలోపలికి వెళుతుంది. కంట్రోల్స్‌ను వెనక్కు లాగితే పడవ నీటి నుంచి పైకి లేస్తుంది. ఒకదాన్ని ముందుకు, రెండోదాన్ని వెనక్కు కదిపితే పడవ ఒకవైపునకు తిరుగుతుంది. అలాగే పట్టి ఉంచితే 360 డిగ్రీల కోణంలో గిర్రున తిరుగుతుందన్నమాట. సీబ్రీచర్ నీటిపై గంటకు దాదాపు 90 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలుగుతుంది. నీటిలోపలైతే ఈ వేగం 40 కిలోమీటర్లకు పడిపోతుంది. న్యూజీలాండ్‌కు చెందిన రామ్ ఇన్నిస్, అమెరికన్ డాన్ పియాజ్జాలు డిజైన్ చేసిన ఈ వినూత్న జలచర వాహనం వినోద కార్యకలాపాల కోసం ఇప్పటికే అందుబాటులో ఉంది. మూడు మోడళ్లలో అందుబాటులో ఉన్న ఈ సూపర్ వాటర్ క్రాఫ్ట్ ధర డిజైన్‌ను బట్టి రూ.56 లక్షల నుంచి రూ.70 లక్షల వరకూ ఉంటుంది.