SGB
-
నక్క తోక తొక్కిన గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లు
-
పెరిగిన బంగారం ధరలు.. లాభపడదామా..?
బంగారం ధరలు గడిచిన ఏడాది కాలంలో 40 శాతానికి పైగా ర్యాలీ చేశాయి. ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో బంగారానికి తప్పకుండా చోటు ఇవ్వాలన్నది నిపుణుల సూచన. ఆ దిశగా బంగారంలో పెట్టుబడులు పెడితే మంచిదే. కానీ, ప్రత్యేక అవసరాల కోసం, స్వల్ప కాల అవసరాల కోసం బంగారంలో ఇన్వెస్ట్ చేసే వారూ ఉన్నారు. ప్రస్తుత విపత్తు సమయంలో ప్రతికూలతలను గట్టెక్కేందుకు... సార్వభౌమ బంగారం బాండ్లలో (గోల్డ్ బాండ్స్/ఎస్జీబీ) పెట్టుబడులను తీసేసుకోవాలని అనుకునే వారు లేకపోలేదు. బంగారం ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేసిన వారు వాటిని విక్రయించుకోవడం ఎంతో సులభం. కానీ, భారత ప్రభుత్వం జారీ చేసే సౌర్వభౌమ బంగారం బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి మాత్రం ఆప్షన్లు పరిమితం. ∙ ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే నిఫ్టీ ప్రధాన సూచీ 21 శాతం మేర నష్టపోతే, ఇదే సమయంలో బంగారం ధరలు 17 శాతం మేర ప్రియంగా మారాయి. దీంతో గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఈ బంగారం, బంగారంలో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్, ఎస్‌జీబీలో పెట్టుబడులపై లాభాల వర్షం కురిసింది. ముఖ్యంగా ఎస్‌జీబీల్లో గడిచిన ఐదేళ్ల కాలంలో ఇన్వెస్ట్ చేసిన వారి పంట పండింది. భౌతిక బంగారంలో పెట్టుబడులను నిరుత్సాహపరచడం, బంగారంలో పెట్టుబడులకు డిజిటల్ దిశగా మళ్లించడమే ఎస్జీబీని తీసుకురావడంలోని ఉద్దేశ్యం. ఈ ప్రయోజనం కొంత వరకు నెరవేరిందనే చెప్పుకోవాలి. భాతిక బంగారంతో పోలిస్తే ఎస్‌జీబీలో పెట్టుబడులపై వార్షికంగా 2.50% వడ్డీ లభిస్తుంది. అదే సమయంలో బంగారం ధరలు పెరిగితే రెండు విధాలుగా ప్రయోజనం కలుగుతుంది. ఎస్జీబీ మొదటి ఇష్యూ 2015 నవంబర్‌లో సిరీస్–1 పేరుతో వచ్చింది. అప్పటి నుంచి చూస్తే బంగారం ధరల్లో ర్యాలీ కారణంగా పెట్టుబడి 84 శాతం వృద్ధి చెందింది. అదే విధంగా 2019–20 ఆర్థిక సంవత్సరం జూన్ మాసంలో ఎస్జీబీ ఇష్యూలో ఇన్వెస్ట్‌మెంట్‌పైనా రాబడి 48 శాతంగా ఉంది. విక్రయించడానికి సరైన సమయమేనా..? చరిత్రను పరిశీలిస్తే.. ప్రతీ మార్కెట్ సైకిల్ (వివిధ సందర్భాలు)లోనూ బంగారం ర్యాలీ చేసినట్టు ఆధారాల్లేవు. బంగారానికి సురక్షిత పెట్టుబడి సాధనమనే ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే ఆర్థిక సంక్షోభాలు, స్టాక్ మార్కెట్ల పతనాల్లో బంగారంలో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు పోటీపడతారు. ఫలితంగా ఆయా సందర్భాల్లో బంగారం ధరల్లో ర్యాలీ నడుస్తుంటుంది. 2019 మధ్య భాగం నుంచి బంగారంలో ర్యాలీ రావడానికి తోడ్పడిన పరిణామం.. అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధమనే చెప్పుకోవాలి. దాంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఆ తర్వాత కరోనా వైరస్ ప్రపంచ దేశాలపై పంజా విసరడం, ఆర్థిక వ్యవస్థలు సంక్షోభాల్లోకి జారిపోవడం చూస్తూనే ఉన్నాం. ప్రపంచదేశాలు, కేంద్ర బ్యాంకులు అన్ని చేతులతోనూ నిధులను పంప్ చేసే కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ.. సహజ శక్తి తిరిగి ఆర్థిక వ్యవస్థల్లోకి వచ్చి చేరాలంటే అందుకు కొంత కాలం పడుతుందని.. 2021 వరకు ఒత్తిళ్లు కొనసాగుతాయన్న అంచనాలు నిపుణుల నుంచి వస్తున్నాయి. కనుక బంగారంలో ర్యాలీ మరికొంత కాలం పాటు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు పెట్టుబడుల్లో 5–10 శాతాన్ని బంగారానికి కేటాయించుకోవచ్చు. కనుక పెట్టుబడుల కోణంలో ఎస్‌జీబీల్లో ఇన్వెస్ట్ చేసుకుని ఉంటే వాటిని కొనసాగించుకోవచ్చు. ఒకవేళ ప్రస్తుత లాక్డౌన్ కారణంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న వారు.. లేదా కొంత మేర పెట్టుబడులను దీర్ఘకాలానికి ఈక్విటీల కోసం కేటాయించుకోవాలనుకుంటే.. ఎస్‌జీబీల నుంచి కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. సెకండరీ మార్కెట్... సార్వభౌమ బంగారం బాండ్ (ఎస్జీబీ)లో పెట్టుబడులకు 8 ఏళ్ల కాలవ్యవధి. కాకపోతే 5వ ఏట చివరి నుంచి వైదొలిగేందుకు అవకాశం ఉంటుంది. కానీ, ఆ లోపు విక్రయించాలంటే అందుకు సెకండరీ మార్కెట్ ఒక్కటే అవకాశం. 2015 నవంబర్ నుంచి ఇప్పటి వరకు 37 సిరీస్‌ల ఎస్జీబీ ఇష్యూలు ముగిశాయి. ఇవన్నీ కూడా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో క్యాష్ విభాగంలో ట్రేడవుతున్నాయి. కాకపోతే సెకండరీ మార్కెట్లో ఎస్జీబీలను విక్రయించాలన్నా లేదా ఇన్వెస్ట్ చేయాలన్నా అందుకు ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు ఉండడం అవసరం. అదే విధంగా ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో తగినంత లిక్విడిటీ (ట్రేడింగ్ పరిమాణం) ఉంటేనే వీటిని సరైన ధరలకు విక్రయించుకోవడం వీలవుతుంది. కానీ, చాలా వరకు ఎస్జీబీ ఇష్యూలకు ట్రేడింగ్ వ్యాల్యూమ్ చాలా తక్కువగా ఉంటోంది. ఎన్ఎస్ఈలో గడిచిన ఏడాది కాలంలో సగటు రోజువారీ ట్రేడింగ్ విలువ రూ.1.2 కోట్లుగానే ఉండడం గమనార్హం. కొన్నింటిలో మాత్రం ఈ ఇబ్బం ది లేదు. మొత్తం 37 సిరీస్‌లలో 12 సిరీస్‌ల్లో.. గడిచిన 3 నెలల్లో చూస్తే రోజువారీ ట్రేడింగ్ 100 యూనిట్లు, అంతకంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఎస్జీబీఏయూజీ27 (ఎన్ఎస్ఈ కోడ్), ఎస్జీబీఎన్వోబీ24, ఎస్జీబీఏయూజీ24, ఎస్జీబీఎంఏవై25, ఎస్జీబీఎస్ఈపీ24ల్లో రోజువారీ ట్రేడింగ్ వ్యాల్యూమ్ 801–340 యూనిట్ల మధ్య ఉండడాన్ని గమనించాలి. కాకపోతే ప్రతీ రోజూ ఇంతే స్థాయిలో ట్రేడింగ్ పరిమాణం ఉండడం లేదు. ముఖ్యంగా ఎక్కువ మంది బ్రోకర్లు ఎస్బీజీల క్రయ విక్రయాలకు అనుమతించడం లేదు. ఎందుకంటే రెండు డిపాజిటరీల మధ్య (ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్) ఈ బాండ్లకు సంబంధించి సెటిల్మెంట్ అవకాశం లేదు. అయితే, అటువైపు విక్ర యించేవారు, ఇటు కొనుగోలు చేసే వారు ఒకే డిపాజిటరీ పరిధిలో (అయితే ఎన్ఎస్డీఎల్ లేదా సీడీఎస్ఎల్) ఉంటే క్రయ విక్రయాలకు ఇబ్బంది లేదు. అమ్మే వ్యక్తి, కొనుగోలు చేసే వ్యక్తి డీమ్యాట్ ఖాతాలు వేర్వేరు డిపాజిటరీల్లో ఉంటేనే సమస్య. ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు... హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, జెరోదా ఎస్జీబీ యూనిట్ల కొనుగోలు, అమ్మకాలకు అవకాశం కల్పిస్తున్నాయి. ప్రతీ రూ.100 విలువపై 10 పైసల నుంచి 50 పైసల వరకు బ్రోకరేజీ చార్జీలుగా చెల్లించాలి. ఎస్జీబీ అంటే... ఎనిమిదేళ్ల కాల వ్యవధి కలిగిన బంగారం బాండ్. ఇందులో ఒక ఇన్వెస్టర్ ఒక గ్రాము నుంచి 4 కిలోల వరకు కొనచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, ఆన్లైన్లో చెల్లింపులు చేసిన వారికి రూ.50 డిస్కౌంట్. ఏ ఇష్యూలో అయినా రిటైల్ ఇన్వెస్టర్లు ఆన్లైన్ చెల్లింపులు చేయడం ద్వారా గ్రాముపై రూ.50 డిస్కౌంట్ పొందొచ్చు. గడువు తీరే నాటికి మార్కెట్ రేటు ప్రకారం చెల్లింపులు జరుగుతాయి. అదే విధంగా బాండ్లో పెట్టుబడి విలువపై వార్షికంగా 2.50 శాతం వడ్డీని చెల్లించడం జరుగుతుంది. దీర్ఘకాల లక్ష్యాల కోసం బంగారాన్ని కొద్ది కొద్దిగా సమకూర్చుకోవాలని అనుకునే వారికి, బంగారంలో ఇన్వెస్ట్ చేద్దామనుకునే వారికి అందుబాటులో ఉన్న సాధనాల్లో ఇది మెరుగైనదని నిపుణుల విశ్లేషణ. ఇందులో పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుంది. వడ్డీ ఆదాయం లభిస్తుంది. పూర్తి కాలం ఉంచుకుంటే లాభాలపై పైసా పన్ను కట్టక్కర్లేదు. ఇవన్నీ సానుకూలతలు. ఇన్వెస్ట్ చేసిన ధర కంటే బం గారం ధరలు కిందకు పడిపోయి దీర్ఘకాలం పాటు అదే స్థాయిల్లో కొనసాగితే నష్టాలు ఎదుర్కోవాలి. ఆర్బీఐ విండో.. ఎస్జీబీలకు ఐదేళ్లు లాకిన్. ఐదవ ఏట, ఆరవ ఏట, ఏడవ ఏట చివర్లో ఈ బాండ్లలో పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. ఇందుకోసం 30 రోజుల ముందుగా ఆర్బీఐ బైబ్యాక్ విండో ప్రారంభమవుతుంది. పన్ను బాధ్యత ఎస్‌జీబీల్లో పెట్టుబడులను పూర్తి ఎనిమిదేళ్లు కొనసాగించితే మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపుంటుంది. గడువులోపే సెకండరీ మార్కెట్ లేదా ఆర్బీఐ బైబ్యాక్ విండో ద్వారా విక్రయించినట్టయితే పన్ను చెల్లించాలి. 36 నెలల్లోపు విక్రయించడం వల్ల లాభం సమకూరితే.. ఆ మొత్తాన్ని వ్యక్తిగత వార్షిక ఆదాయంలో చూపించి, నిర్ణీత శ్లా్లబు రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. -
బంగారం పెట్టుబడులపై కీలక నిర్ణయం
♦ పరిమితిని భారీగా పెంచిన ప్రభుత్వం ♦ ప్రస్తుతం 500 గ్రాములకే అనుమతి ♦ మరింత ఆకర్షణీయంగా మర్చే యత్నం న్యూఢిల్లీ: బంగారం బాండ్లలోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించేలా కేంద్ర క్యాబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. సావరిన్ గోల్డ్ బాండ్లలో(ఎస్జీబీ) వార్షిక పెట్టుబడుల పరిమితిని భారీగా పెంచింది. ప్రస్తుతం 500 గ్రాముల మేరకు మాత్రమే పెట్టుబడి పెట్టే వీలుండగా... దీన్ని ఏకంగా 4 కిలోలకు పెంచింది. ఒక ఆర్థిక సంవత్సరం ప్రాతిపదికన కొనుగోలు పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటామని క్యాబినెట్ భేటీ అనంతరం అధికారిక ప్రకటనలో తెలియజేశారు. తాజా నిర్ణయం ప్రకారం, ఒక వ్యక్తి లేదా హిందూ అవిభక్త కుటుంబం వార్షికంగా 4 కేజీల వరకూ గోల్డ్ బాండ్‌పై పెట్టుబడిపెట్టే వీలుంది. ట్రస్టులు, ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి పొందిన సంస్థలకు ఈ పరిమితి 20 కేజీలుగా ఉంది. విభిన్న రేట్లకు వివిధ రకాల సావరిన్ గోల్డ్ బాండ్లను రూపొందించడం, ప్రవేశపెట్టడం వంటి వెసులుబాటును కూడా ఆర్థికశాఖకు కల్పించడం తాజా నిర్ణయంలో ప్రధానాంశం. అవసరమైతే ఏజెంట్ల కమీషన్ పెంచే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తుందన్నారు. 2015 నవంబర్ 5న గోల్డ్ బాండ్ పథకాన్ని కేంద్రం నోటిఫై చేసింది. ఈ పథకం ద్వారా 2015–16, 2016–17లో రూ.25,000 కోట్లు సమీకరించాలన్నది లక్ష్యమైనా, రూ.4,769 కోట్లే ప్రభుత్వ ఖాతాలోకి వచ్చాయి. -
జూలై 10న గోల్డ్ బాండ్స్ కొత్త ఇష్యూ
న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) స్కీము కింద ప్రభుత్వం జూలై 10న మలివిడత గోల్డ్ బాండ్ల ఇష్యూను ప్రారంభించనుంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఇదే తొలి గోల్డ్ బాండ్ల ఇష్యూ. ఈ ఇష్యూకు దరఖాస్తులు జూలై10–14 తేదీల మధ్య స్వీకరిస్తామని, బాండ్లను జూలై 28న జారీచేస్తామని గురువారం విడుదలైన ఆర్థిక శాఖ ప్రకటన పేర్కొంది. ఒక గ్రాము బంగారానికి సమానంగా ఒక బాండు జారీఅవుతుంది. ఈ బాండ్లలో కనీస పెట్టుబడి ఒక గ్రాముకాగా, ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 500 గ్రాములకు సమానమైన బాండ్ల కొనుగోలుకు అనుమతిస్తారు. 8 సంవత్సరాల కాలపరిమితితో జారీచేసే ఈ బాండ్లపై 2.5 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది.2015 నవంబర్‌లో ఈ స్కీమును ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకూ 8 దఫాలు పుత్తడి బాండ్లను జారీచేసి, రూ. 5,400 కోట్లు సమీకరించారు. -
గోల్డ్ బాండ్లను బహుమతిగా ఇవ్వవచ్చా?
నా వయస్సు 43 సంవత్సరాలు. నేనొక బ్యాంక్ నుంచి గృహ రుణం తీసుకున్నాను. నాకు ఒక మంచి బీమా పాలసీ సూచించండి. –రంజిత్, హైదరాబాద్ బీమా కోసమైతే, ఆన్లైన్ టర్మ్ బీమా పాలసీ తీసుకోవడం మంచిది. బీమా రక్షణ అధికంగానూ, ప్రీమియమ్‌లు తక్కువగా ఉంటాయి.సాంప్రదాయ బీమా పాలసీల్లో అయితే వ్యయాలు అధికంగా ఉంటాయి. దీంతో మీరు చెల్లించాల్సిన ప్రీమియమ్ అధికంగా ఉంటుంది. పైగా తగిన బీమా రక్షణ ఇవ్వలేవు. కానీ టర్మ్ బీమా పాలసీలు దీనికి భిన్నం. వీటిల్లో అనవసర వ్యయాలేమీ ఉండవు. మీ ఉద్యోగం లేదా వృత్తి, సంపాదన తదితర వివరాలు వెల్లడించలేదు. అందుకని 43 సంవత్సరాల సగటు వ్యక్తికి సరిపడే బీమా పాలసీలను సూచిస్తున్నాం. రూ. కోటి బీమా కవర్‌కు మీరు చెల్లించాల్సిన వార్షిక ప్రీమియమ్ వివరాలను కూడా అందిస్తున్నాం. . మీకు 60 ఏళ్లు వచ్చే వరకూ అంటే 17 సంవత్సరాల పాటు ప్రీమియమ్‌లు చెల్లించాల్సి ఉంటుంది. మీ కోసం మూడు బీమా పాలసీలను, వాటి వార్షిక వివరాలు, ఆయా సంస్థల క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి వివరాలను పొందుపరుస్తున్నాం. ఏగాన్ ఐ టెర్మ్ ప్లాన్– ఈప్లాన్‌లో మీరు ఏడాదికి రూ.13,394 ప్రీమియమ్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ సంస్థ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 98.63 శాతంగా ఉంది. మ్యాక్స్ ఆన్లైన్ టర్మ్ ప్లాన్‌లో అయితే వార్షిక ప్రీమియమ్ రూ.13,995గా ఉంటుంది. ఈ కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి కూడా 98.63 శాతంగా ఉంది. ఇక హెచ్డీఎఫ్సీ క్లిక్2 ప్రొటెక్ట్ ప్లస్ ప్లాన్‌కు ఏడాది ప్రీమియమ్ రూ.16,861గా ఉంది. ఈ సంస్థ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 95.06 శాతంగాఉంది. బీమా పాలసీ తీసుకునేటప్పుడు, మీకు సంబంధించిన అన్ని వ్యక్తిగత వివరాలు, ఆరోగ్య పరిస్థితులను వెల్లడించండి. ఇలా చేయడం వల్ల బీమా పాలసీ క్లెయిమ్ చేసుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. నేను సావరిన్ గోల్డ్ బాండ్స్‌లో రూ.50,000 వరకూ ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఈ రూ.50,000 సావరిన్ గోల్డ్ బాండ్‌ను నా మనవరాలికి బహు మతిగా ఇవ్వాలనుకుంటున్నాను. అది సాధ్యమేనా ? వివరాలు తెలపండి. –జానకీ రామ్, విశాఖపట్టణం మీరు ఇన్వెస్ట్ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్(ఎస్జీబీ)ను ఎవరికైనా బహుమతిగా ఇవ్వవచ్చు. లేదా బదిలీ చేయవచ్చు. మైనర్లకు బహుమతిగా ఇవ్వాలనుకుంటే, వారి తల్లిదండ్రులు కానీ, సంరక్షకులు కానీ మైనర్ల తరపున ఆ బాండ్లను హోల్డ్ చేస్తారు. బహుమతిగా ఇవ్వడానికి లేదా బాండ్లను బదిలీ చేయడానికి సంబంధించిన విధి, విధానాలు చాలా సులభం. ఈ ప్రక్రియను మీరు ఎక్కడైతే ఆ బాండ్లను కొనుగోలు చేశారో. ఆ బ్యాంక్/ఏజెంట్/పోస్ట్ ఆఫీస్ పూర్తి చేస్తుంది. పూర్తి వివరాలకు మీరు ఈ గోల్డ్ బాండ్లను ఎక్కడ కొనుగోలు చేశారో, అక్కడ సంప్రదించండి. నేను ఎల్ఐసీ న్యూ జీవన్ సురక్ష పాలసీ తీసుకున్నాను. ఈ పాలసీ కోసం ఏడాదికి కొంత మొత్తం ప్రీమియమ్ చెల్లిస్తున్నాను. ఈ ప్రీమియమ్లకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీసీడీ(1బీ) కింద పన్ను మినహాయింపులు పొందవచ్చా? అలా వీలుంటే ఎంత వరకూ మినహాయింపులు పొందవచ్చు. –సురేశ్, తిరుపతి బీమా పాలసీల ప్రీమియమ్‌లపై పన్ను మినహాయింపులను ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీసీడీ(1బీ) కింద పొందే వీలు లేదు. నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్) టైర్–1 అకౌంట్లో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి మాత్రమే రూ.50,000 వరకూ సెక్షన్80 సీసీడీ(1బీ) కింద పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద లభించే పన్ను మినహాయింపు రూ.లక్షన్నరకు ఇది అదనం. బీమా, పెన్షన్ ప్లాన్లకు చెల్లించే ప్రీమియమ్లకు సెక్షన్ 80సీ నుంచి పన్ను మినహాయింపులు పొందవచ్చు. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
గోల్డ్ బాండ్ స్కీమ్...మళ్లీ ఈ నెల 24 నుంచి
వచ్చే నెల 17న ముగింపు 2.5 శాతం వార్షిక వడ్డీ న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్ బాండ్స్(ఎస్జీబీ) స్కీమ్ ఆరవ అంచె ఈ నెల 24న ప్రారంభం కానున్నది. దీపావళి పండుగకు ముందు ప్రభుత్వం ఈ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను అందుబాటులోకి తెస్తోంది. భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ)తో కలసి భారత ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సావరిన్ గోల్డ్ బాండ్స్, సిరీస్ త్రీని జారీ చేయనున్నది. ఈ నెల 24న ప్రారంభమయ్యే ఈస్కీమ్ వచ్చే నెల 17 వరకూ అందుబాటులో ఉంటుంది. భౌతికంగా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ప్రత్యామ్నాయంగా సావరిన్ గోల్డ్‌బాండ్స్ స్కీమ్‌ను కేంద్రం గత ఏడాది నవంబర్‌లో ప్రారంభించింది. ఈ స్కీమ్‌ను ఇప్పటికే ఐదుసార్లు అందుబాటులోకి తెచ్చింది. ఐదవసారి 2 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకూ గోల్డ్ బాండ్లలో పెట్టుబడులు రూ.3,060 కోట్లకు చేరాయని ఆర్బీఐ ఇటీవలనే తెలిపింది. ఈ బాండ్లను బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, గుర్తింపు పొందిన ఎన్ఎస్ఈ, బీఎస్ఈ వంటి స్టాక్ ఎక్స్చేంజీలు విక్రయిస్తాయి. ఈ గోల్డ్ బాండ్ల పెట్టుబడులపై ఇన్వెస్టర్లు 2.5 శాతం వడ్డీని ప్రతి ఆరు నెలలకొకసారి పొందుతారు. ఈ బాండ్ల కాలపరిమితి 8 సంవత్సరాలు. ఐదేళ్లు దాటిన తర్వాత ఈ స్కీమ్ నుంచి వైదొలగవచ్చు. ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 500 గ్రాముల వరకూ మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఈ గోల్డ్ బాండ్ల ద్వారా రుణాలు కూడా పొందవచ్చు. ఈ గోల్డ్ బాండ్ల రిడంప్షన్పై మూలధన లాభాల పన్ను మినహాయింపును పొందవచ్చు. ఆర్బీఐ నోటిఫై చేసిన తేదీ నుంచి ఈ గోల్డ్ బాండ్లు స్టాక్ ఎక్స్చేంజీల్లో ట్రేడవుతాయి.