జూలై 10న గోల్డ్ బాండ్స్ కొత్త ఇష్యూ
న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జీబీ) స్కీము కింద ప్రభుత్వం జూలై 10న మలివిడత గోల్డ్ బాండ్ల ఇష్యూను ప్రారంభించనుంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఇదే తొలి గోల్డ్ బాండ్ల ఇష్యూ. ఈ ఇష్యూకు దరఖాస్తులు జూలై10–14 తేదీల మధ్య స్వీకరిస్తామని, బాండ్లను జూలై 28న జారీచేస్తామని గురువారం విడుదలైన ఆర్థిక శాఖ ప్రకటన పేర్కొంది.
ఒక గ్రాము బంగారానికి సమానంగా ఒక బాండు జారీఅవుతుంది. ఈ బాండ్లలో కనీస పెట్టుబడి ఒక గ్రాముకాగా, ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 500 గ్రాములకు సమానమైన బాండ్ల కొనుగోలుకు అనుమతిస్తారు. 8 సంవత్సరాల కాలపరిమితితో జారీచేసే ఈ బాండ్లపై 2.5 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది.2015 నవంబర్‌లో ఈ స్కీమును ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకూ 8 దఫాలు పుత్తడి బాండ్లను జారీచేసి, రూ. 5,400 కోట్లు సమీకరించారు.