బంగారం ధరలు గడిచిన ఏడాది కాలంలో 40 శాతానికి పైగా ర్యాలీ చేశాయి. ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో బంగారానికి తప్పకుండా చోటు ఇవ్వాలన్నది నిపుణుల సూచన. ఆ దిశగా బంగారంలో పెట్టుబడులు పెడితే మంచిదే. కానీ, ప్రత్యేక అవసరాల కోసం, స్వల్ప కాల అవసరాల కోసం బంగారంలో ఇన్వెస్ట్ చేసే వారూ ఉన్నారు. ప్రస్తుత విపత్తు సమయంలో ప్రతికూలతలను గట్టెక్కేందుకు... సార్వభౌమ బంగారం బాండ్లలో (గోల్డ్ బాండ్స్/ఎస్‌జీబీ) పెట్టుబడులను తీసేసుకోవాలని అనుకునే వారు లేకపోలేదు. బంగారం ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేసిన వారు వాటిని విక్రయించుకోవడం ఎంతో సులభం. కానీ, భారత ప్రభుత్వం జారీ చేసే సౌర్వభౌమ బంగారం బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి మాత్రం ఆప్షన్లు పరిమితం.
∙
ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే నిఫ్టీ ప్రధాన సూచీ 21 శాతం మేర నష్టపోతే, ఇదే సమయంలో బంగారం ధరలు 17 శాతం మేర ప్రియంగా మారాయి. దీంతో గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఈ బంగారం, బంగారంలో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్, ఎస్‌జీబీలో పెట్టుబడులపై లాభాల వర్షం కురిసింది. ముఖ్యంగా ఎస్‌జీబీల్లో గడిచిన ఐదేళ్ల కాలంలో ఇన్వెస్ట్ చేసిన వారి పంట పండింది. భౌతిక బంగారంలో పెట్టుబడులను నిరుత్సాహపరచడం, బంగారంలో పెట్టుబడులకు డిజిటల్ దిశగా మళ్లించడమే ఎస్‌జీబీని తీసుకురావడంలోని ఉద్దేశ్యం. ఈ ప్రయోజనం కొంత వరకు నెరవేరిందనే చెప్పుకోవాలి. భాతిక బంగారంతో పోలిస్తే ఎస్‌జీబీలో పెట్టుబడులపై వార్షికంగా 2.50% వడ్డీ లభిస్తుంది. అదే సమయంలో బంగారం ధరలు పెరిగితే రెండు విధాలుగా ప్రయోజనం కలుగుతుంది. ఎస్‌జీబీ మొదటి ఇష్యూ 2015 నవంబర్‌లో సిరీస్–1 పేరుతో వచ్చింది. అప్పటి నుంచి చూస్తే బంగారం ధరల్లో ర్యాలీ కారణంగా పెట్టుబడి 84 శాతం వృద్ధి చెందింది. అదే విధంగా 2019–20 ఆర్థిక సంవత్సరం జూన్ మాసంలో ఎస్‌జీబీ ఇష్యూలో ఇన్వెస్ట్‌మెంట్‌పైనా రాబడి 48 శాతంగా ఉంది.
విక్రయించడానికి సరైన సమయమేనా..?
చరిత్రను పరిశీలిస్తే.. ప్రతీ మార్కెట్ సైకిల్ (వివిధ సందర్భాలు)లోనూ బంగారం ర్యాలీ చేసినట్టు ఆధారాల్లేవు. బంగారానికి సురక్షిత పెట్టుబడి సాధనమనే ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే ఆర్థిక సంక్షోభాలు, స్టాక్ మార్కెట్ల పతనాల్లో బంగారంలో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు పోటీపడతారు. ఫలితంగా ఆయా సందర్భాల్లో బంగారం ధరల్లో ర్యాలీ నడుస్తుంటుంది. 2019 మధ్య భాగం నుంచి బంగారంలో ర్యాలీ రావడానికి తోడ్పడిన పరిణామం.. అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధమనే చెప్పుకోవాలి. దాంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఆ తర్వాత కరోనా వైరస్ ప్రపంచ దేశాలపై పంజా విసరడం, ఆర్థిక వ్యవస్థలు సంక్షోభాల్లోకి జారిపోవడం చూస్తూనే ఉన్నాం.
ప్రపంచదేశాలు, కేంద్ర బ్యాంకులు అన్ని చేతులతోనూ నిధులను పంప్ చేసే కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ.. సహజ శక్తి తిరిగి ఆర్థిక వ్యవస్థల్లోకి వచ్చి చేరాలంటే అందుకు కొంత కాలం పడుతుందని.. 2021 వరకు ఒత్తిళ్లు కొనసాగుతాయన్న అంచనాలు నిపుణుల నుంచి వస్తున్నాయి. కనుక బంగారంలో ర్యాలీ మరికొంత కాలం పాటు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు పెట్టుబడుల్లో 5–10 శాతాన్ని బంగారానికి కేటాయించుకోవచ్చు. కనుక పెట్టుబడుల కోణంలో ఎస్‌జీబీల్లో ఇన్వెస్ట్ చేసుకుని ఉంటే వాటిని కొనసాగించుకోవచ్చు. ఒకవేళ ప్రస్తుత లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న వారు.. లేదా కొంత మేర పెట్టుబడులను దీర్ఘకాలానికి ఈక్విటీల కోసం కేటాయించుకోవాలనుకుంటే.. ఎస్‌జీబీల నుంచి కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు.
సెకండరీ మార్కెట్...
సార్వభౌమ బంగారం బాండ్ (ఎస్‌జీబీ)లో పెట్టుబడులకు 8 ఏళ్ల కాలవ్యవధి. కాకపోతే 5వ ఏట చివరి నుంచి వైదొలిగేందుకు అవకాశం ఉంటుంది. కానీ, ఆ లోపు విక్రయించాలంటే అందుకు సెకండరీ మార్కెట్ ఒక్కటే అవకాశం. 2015 నవంబర్ నుంచి ఇప్పటి వరకు 37 సిరీస్‌ల ఎస్‌జీబీ ఇష్యూలు ముగిశాయి. ఇవన్నీ కూడా బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో క్యాష్ విభాగంలో ట్రేడవుతున్నాయి. కాకపోతే సెకండరీ మార్కెట్‌లో ఎస్‌జీబీలను విక్రయించాలన్నా లేదా ఇన్వెస్ట్ చేయాలన్నా అందుకు ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు ఉండడం అవసరం.
అదే విధంగా ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల్లో తగినంత లిక్విడిటీ (ట్రేడింగ్ పరిమాణం) ఉంటేనే వీటిని సరైన ధరలకు విక్రయించుకోవడం వీలవుతుంది. కానీ, చాలా వరకు ఎస్‌జీబీ ఇష్యూలకు ట్రేడింగ్ వ్యాల్యూమ్ చాలా తక్కువగా ఉంటోంది. ఎన్‌ఎస్‌ఈలో గడిచిన ఏడాది కాలంలో సగటు రోజువారీ ట్రేడింగ్ విలువ రూ.1.2 కోట్లుగానే ఉండడం గమనార్హం. కొన్నింటిలో మాత్రం ఈ ఇబ్బం ది లేదు. మొత్తం 37 సిరీస్‌లలో 12 సిరీస్‌ల్లో.. గడిచిన 3 నెలల్లో చూస్తే రోజువారీ ట్రేడింగ్ 100 యూనిట్లు, అంతకంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి.
ఎస్‌జీబీఏయూజీ27 (ఎన్‌ఎస్‌ఈ కోడ్), ఎస్‌జీబీఎన్‌వోబీ24, ఎస్‌జీబీఏయూజీ24, ఎస్‌జీబీఎంఏవై25, ఎస్‌జీబీఎస్‌ఈపీ24ల్లో రోజువారీ ట్రేడింగ్ వ్యాల్యూమ్ 801–340 యూనిట్ల మధ్య ఉండడాన్ని గమనించాలి. కాకపోతే ప్రతీ రోజూ ఇంతే స్థాయిలో ట్రేడింగ్ పరిమాణం ఉండడం లేదు. ముఖ్యంగా ఎక్కువ మంది బ్రోకర్లు ఎస్‌బీజీల క్రయ విక్రయాలకు అనుమతించడం లేదు. ఎందుకంటే రెండు డిపాజిటరీల మధ్య (ఎన్‌ఎస్‌డీఎల్, సీడీఎస్‌ఎల్) ఈ బాండ్లకు సంబంధించి సెటిల్‌మెంట్ అవకాశం లేదు.
అయితే, అటువైపు విక్ర యించేవారు, ఇటు కొనుగోలు చేసే వారు ఒకే డిపాజిటరీ పరిధిలో (అయితే ఎన్‌ఎస్‌డీఎల్ లేదా సీడీఎస్‌ఎల్) ఉంటే క్రయ విక్రయాలకు ఇబ్బంది లేదు. అమ్మే వ్యక్తి, కొనుగోలు చేసే వ్యక్తి డీమ్యాట్ ఖాతాలు వేర్వేరు డిపాజిటరీల్లో ఉంటేనే సమస్య. ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు... హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్, జెరోదా ఎస్‌జీబీ యూనిట్ల కొనుగోలు, అమ్మకాలకు అవకాశం కల్పిస్తున్నాయి. ప్రతీ రూ.100 విలువపై 10 పైసల నుంచి 50 పైసల వరకు బ్రోకరేజీ చార్జీలుగా చెల్లించాలి.
ఎస్‌జీబీ అంటే...
ఎనిమిదేళ్ల కాల వ్యవధి కలిగిన బంగారం బాండ్. ఇందులో ఒక ఇన్వెస్టర్ ఒక గ్రాము నుంచి 4 కిలోల వరకు కొనచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసిన వారికి రూ.50 డిస్కౌంట్. ఏ ఇష్యూలో అయినా రిటైల్ ఇన్వెస్టర్లు ఆన్‌లైన్ చెల్లింపులు చేయడం ద్వారా గ్రాముపై రూ.50 డిస్కౌంట్ పొందొచ్చు. గడువు తీరే నాటికి మార్కెట్ రేటు ప్రకారం చెల్లింపులు జరుగుతాయి. అదే విధంగా బాండ్‌లో పెట్టుబడి విలువపై వార్షికంగా 2.50 శాతం వడ్డీని చెల్లించడం జరుగుతుంది.
దీర్ఘకాల లక్ష్యాల కోసం బంగారాన్ని కొద్ది కొద్దిగా సమకూర్చుకోవాలని అనుకునే వారికి, బంగారంలో ఇన్వెస్ట్ చేద్దామనుకునే వారికి అందుబాటులో ఉన్న సాధనాల్లో ఇది మెరుగైనదని నిపుణుల విశ్లేషణ. ఇందులో పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుంది. వడ్డీ ఆదాయం లభిస్తుంది. పూర్తి కాలం ఉంచుకుంటే లాభాలపై పైసా పన్ను కట్టక్కర్లేదు. ఇవన్నీ సానుకూలతలు. ఇన్వెస్ట్ చేసిన ధర కంటే బం గారం ధరలు కిందకు పడిపోయి దీర్ఘకాలం పాటు అదే స్థాయిల్లో కొనసాగితే నష్టాలు ఎదుర్కోవాలి.
ఆర్‌బీఐ విండో..
ఎస్‌జీబీలకు ఐదేళ్లు లాకిన్. ఐదవ ఏట, ఆరవ ఏట, ఏడవ ఏట చివర్లో ఈ బాండ్లలో పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. ఇందుకోసం 30 రోజుల ముందుగా ఆర్‌బీఐ బైబ్యాక్ విండో ప్రారంభమవుతుంది.
పన్ను బాధ్యత
ఎస్‌జీబీల్లో పెట్టుబడులను పూర్తి ఎనిమిదేళ్లు కొనసాగించితే మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపుంటుంది. గడువులోపే సెకండరీ మార్కెట్ లేదా ఆర్‌బీఐ బైబ్యాక్ విండో ద్వారా విక్రయించినట్టయితే పన్ను చెల్లించాలి. 36 నెలల్లోపు విక్రయించడం వల్ల లాభం సమకూరితే.. ఆ మొత్తాన్ని వ్యక్తిగత వార్షిక ఆదాయంలో చూపించి, నిర్ణీత శ్లా్లబు రేటు ప్రకారం పన్ను చెల్లించాలి.
Comments
Please login to add a commentAdd a comment