Shaadi Ke Side Effects
-
నేను స్వార్థపరురాలిని..!
న్యూఢిల్లీ: తాను స్వార్థపరురాలినని పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత అనేక రకాల పాత్రలను పోషించిన విద్యాబాలన్ పేర్కొంది. తన కోసమే తాను పనిచేస్తానంది. బాలీవుడ్లో తారలకు సాధారణంగా మూసపాత్రలే ఎక్కువగా లభిస్తున్న తరుణంలో విద్యాబాలన్ విభిన్న పాత్రలను పోషించింది. ‘పా’, ‘ఇష్కియా’, ‘నో వ న్ కిల్డ్ జెస్సికా, ‘డర్టీ పిక్చర్’, ‘కహానీ’ సినిమాల్లో విభిన ్నపాత్రల్లో నటించడంద్వారా ఈ మలయాళీ మెరుపుచుక్క ప్రేక్షకులతోపాటు విమర్శకుల మెప్పు సైతం పొందింది. ‘నాకేదైనా నచ్చితే దాని గురించి ఇతరులు ఏమంటారనే విషయాన్ని పట్టించుకోను. ఆ కథ విభిన్నంగా ఉందా లేదా అనే విషయాన్ని మాత్రమే పట్టించుకుంటా. నేను బాగా స్వార్థపరురాలిని. దేని గురించీ ఆలోచించను. ఏమిచేయాలనుకుంటానో అదే చేస్తా’ అని అంది. ఇటీవల ఈ వయ్యారి నటించిన హాస్యచిత్రం ‘ఘన్‌చక్కర్’, రొమాంటిక్ సినిమా ‘షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్’ బాక్సాఫీసు వద్ద బోల్తాపడ్డాయి. అయితే ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో విద్యాబాలన్ బాగా ఆసక్తి చూపినప్పటికీ ఆమె ఆకాంక్ష మాత్రం నెరవేరలేదు. ‘ఈ రెండు సినిమాలు ఆడకపోవడం దురదృష్టకరం. షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ సినిమాలో నా పాత్ర విభిన్నమైనదే. అయితే బాగా ఆడకపోవడంతో విభిన్నమైన పాత్రేమీ కాదని అందరూ అనుకుంటున్నారు. అయితే నేను మూసపాత్రలకు పరిమితం కాను’ అంది. ‘ నా ఆనందం ఎవరి చేతుల్లోనూ లేదు. అది కేవలం ఒకే ఒకరి చేతుల్లో ఉంది. అది నేనే. నాకు ఏది ఆనందం కలిగిస్తుందో అందుకు అనుగుణంగానే జీవించడానికి అలవాటుపడ్డా’ అని అంది. -
కాపురంలో కలతలా?
సంసారం అనే నావ సాఫీగా సాగినంతవరకే వైవాహిక జీవితం పసందుగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఏవైనా మనస్పర్ధలు వచ్చాయా.. ఇక అంతే సంగతులు. ఆ సంసారం ఛిన్నాభిన్నం అయిపోతుంది. సిద్ధార్ధ్‌రాయ్‌కపూర్, విద్యాబాలన్‌ల సంసారం అంతవరకూ రాలేదు కానీ.. ఈ ఇద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్ధలు నెలకొన్నాయని బాలీవుడ్ టాక్. ఈ మధ్య విద్యాబాలన్ విదేశాలకు వెళ్లినప్పుడు ఆమె భర్త వేరే నటితో స్నేహం మొదలుపెట్టారనే వార్త హల్చల్ చేస్తోంది. కేవలం స్నేహం మాత్రమే అన్న చందంగా ఈ వ్యవహారం లేకపోవడంతో విద్య కలత చెందారట. ఈ కారణంగానే తన విదేశీ కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకుంటున్నారని సమాచారం. సిద్ధార్ధ్రాయ్కి ఇది మూడో పెళ్లి. ఇద్దరు భార్యలకు దూరమైన సిద్ధార్ధ్‌రాయ్ తన విషయంలో అలా చేయకుండా ఉంటాడా? అనే భయం విద్యను వెంటాడుతుందట. విద్య, సిద్ధార్ధ్‌రాయ్ పెళ్లయ్యి దాదాపు ఏడాదిన్నర అవుతోంది. పెళ్లయిన తర్వాత పలు సందర్భాల్లో అత్తవారిల్లు తనకు పుట్టిల్లులాంటిదని, వైవాహిక జీవితం చాలా బాగుందని చెప్పారు విద్య. ఒకవేళ సిద్ధార్ధ్‌రాయ్ కనుక ఆమెను నిర్లక్ష్యం చేస్తే... పరిస్థితిని చక్కదిద్దుకోగల నేర్పు విద్యాకి ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆ మధ్య విద్యా ‘షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్’ అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో ఆమె భర్తతనని నిర్లక్ష్యం చేస్తాడు. చివరకు తప్పు తెలుసుకుంటాడు. మరి... సిద్ధార్ధ్‌రాయ్ కనుక విద్యని అలానే చేస్తే, ‘షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్’లా వీరి వైవాహిక జీవితానికి శుభం కార్డు పడాలని కోరుకోనివారు ఉండరు. -
సినిమా రివ్యూ: షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్
పాజిటివ్ పాయింట్స్: చిత్ర తొలి భాగం కామెడీ, ఎమోషన్స్ క్లైమాక్స్ నెగిటివ్ పాయింట్స్: రెండవ భాగంలో కథనం మందగించడం రొటీన్ సీన్లు నటీనటులు: ఫరాన్ అక్తర్, విద్యాబాలన్, ఇలా అరుణ్ తదితరులు సంగీతం: ప్రీతమ్ నిర్మాతలు: ప్రీతిష్ నందీ, ఏక్తా, శోభా కపూర్ దర్శకత్వం: సాకేత్ చౌదరీ ఆనందంగా జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించే ప్రేమికుల్లాంటి దంపతులు. కెరీర్ లో ఇంకా పూర్తిగా స్థిర పడని పరిస్థితులు. జీవితంలో ఏదో సాధించాలనే వర్కింగ్ కపుల్స్ తాపత్రయం. ప్రతి రోజు దంపతుల మధ్య ఏదో విషయంపై వాగ్యుద్దం జరగడం.. అభిప్రాయబేధాలు చోటు చేసుకోవడం..మాట్లాడుకోవడం ఆపివేయడం ఇవన్ని మన జీవితంలో చోటుచేసుకోవడం వారి జీవితంలో కనిపించే సర్వసాధారణమైన అంశాలు. జీవితం ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆనందంగా సాగాలంటే ఆమె తప్పైనా అతను సారీ చెప్పడం, తనది తప్పైనా అతనే సారీ చెప్పడం తప్పనిసరవుతాయి. సారీతో మళ్లీ మామూలు పరిస్థితి ఏర్పడటం. ఆతర్వాత మళ్లీ ఏదో గొడవ ప్రారంభం కావడం ప్రతి ఒక్కరి దాంపత్య జీవితంలో చోటు చేసుకునే అంశాలు కొనసాగుతునే కనిపిస్తాయి, మనకు కూడా ఎదురవుతాయి. నిత్య జీవితంలో ఒక విషయాన్ని దాచి పెట్టడానికి ఓ అబద్ధం. ఆ అబద్దాన్ని దాచడానికి మరో అబద్ధం ఆడటం దంపతుల మధ్య కామన్. అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితంలో అనుకొని సంఘటన వారి మధ్య ఎడబాటుకు గురి చేస్తే ఎమిటనేది.. ఒకరికొకరు దగ్గరకు కావడానికి దంపతులు ఎలాంటి మార్గాలను అన్వేషించారనే ఇతివృత్తానికి, హాస్యం, ఎమోషన్స్ జోడించి 'షాదీ కే సైడ్ ఎఫ్టెక్ట్స్' చిత్రానికి దర్శకుడు సాకేత్ చౌదరీ తెరరూపం కలిగించాడు. కథ: సిద్ (ఫరాన్ అక్తర్), త్రిష(విద్యబాలన్) దంపతులు. సిద్ కెరీర్ లో పూర్తిగా స్థిరపడని సంగీత కళాకారుడు. త్రిష ఓ కంపెనీలో ఉద్యోగిని. జీవితంలో పూర్తి స్థాయిలో స్థిరపడటానికి, తమ కలలకు వాస్తవ రూపం ఇవ్వడానికి సగటు కుటుంబంలానే పోరాటం చేస్తుంటారు. అయితే సరైన జాగ్రత్త పాటించకపోవడంతో త్రిష ప్రెగ్నెంట్ అవుతుంది. అయితే సిద్ కెరీర్ అంతంత మాత్రంగా ఉండటంతో త్రిష ఇష్టం లేకున్నాఅబార్షన్ కు ప్లాన్ చేస్తాడు. కాని ఓ సంఘటన సిద్ అబార్షన్ ఆలోచనకు బ్రేక్ వేస్తుంది. అయితే వారి జీవితంలో మిలీ అనే బుల్లి పాప ప్రవేశిస్తుంది. ఆతర్వాత వారి వ్యక్తిగత, వైవాహిక జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలు ఎలాంటి పరిస్థితులకు దారి తీశాయి? చివరికి ఎలా పరిష్కరించుకున్నారనే ప్రశ్నలకు తెర రూపం 'షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్' చిత్రం. ఇప్పటి వరకు విభిన్నమైన పాత్రలో సినీ ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకున్న ఫరాన్ ఈ చిత్రంలో సిద్ పాత్రతో మరోసారి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో వచ్చిన భాగ్ మిల్కా భాగ్ చిత్రంలోని మిల్కా పాత్రతో జాతీయ అంతర్జాతీయ సినీ విమర్శకులను మెప్పించిన ఫరాన్ సిద్ పాత్రతో మరోసారి విజృంభించాడు. ఈ చిత్రంలో ఓ మధ్య వయస్కుడైన వివాహితుడుగా కనిపించి తన నటనతో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రపంచంలోనే 'బెస్ట్ ఫాదర్'గా ప్రూవ్ చేసుకోవడానికి, ఓ మంచి భర్త అనే నమ్మకం కలిగించే, ఓ మ్యూజిక్ కంపోజర్ గా స్థిర పడటమే లక్ష్యంగా శ్రమించే సిద్ పాత్రను పోషించి నూరు మార్కులు కొట్టేశాడు. త్రిష పాత్రలో నటించిన విద్యబాలన్ తో నువ్వా నేనా అనే రీతిలో ఫెర్మార్మెన్స్ తో అదరగొట్టేశాడు. ఇక త్రిష పాత్రలో ఓ గృహిణి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి. ఎలా ఆలోచిస్తారు. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఓ తల్లి ఎమోషన్స్ ఎలా ఉంటాయి. ఓ బిడ్డకు తల్లిగా, భార్యగా రెండు కోణాలున్న పాత్ర మధ్య జరిగే మానసిక సంఘర్షణను విద్యాబాలన్ చక్కగా పలికించారు. కహానీ, డర్టీ పిక్చర్ తర్వాత మరోసారి త్రిష పాత్రలో విద్యబాలన్ తన ప్రతిభా పాటవాలతో ప్రేక్షకులను ఆలరించారు. ఈ చిత్రంలో ఫరాన్, విద్యబాలన్ లు సగం బలంగా మారితే.. సాకేత్ చౌదరీ స్క్రీన్ ప్లే, దర్శకత్వ ప్రతిభతో క్రెడిట్ కొట్టేసి తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి చిత్రం 'ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్' చిత్రం ద్వారా ప్రేక్షకులు, విమర్శకుల దృష్టిని తనపైకి తిప్పుకున్న సాకేత్ .. రెండవ చిత్రంతో తనపై నెలకొన్నఅంచనాలను పూర్తిగా అధిగమించాడు. ఫరాన్, విద్యబాలన్ ల మధ్య చక్కటి కెమిస్ట్రీని డిజైన్ చేయడంలో, ఈ చిత్రాన్ని రొమాంటిక్ కామెడీగా రూపొందించడంలో దర్శకుడిగా సాకేత్ సఫలమయ్యాడు. భార్య, భర్తల మధ్య రిలేషన్స్ చాలా సహజంగా చిత్రీకరించి తన సత్తాను చాటుకున్నాడు. 'ఎలక్ట్రిఫైయింగ్' ఆరంభాన్ని అందించిన సాకేత్...అదే జోష్ తో హై ఓల్టేజ్ కథనంతో తొలిభాగాన్ని పరుగులెత్తించాడు. అయితే కథలో ఉండే పరిమితుల వల్ల అదే వూపును సాకేత్ రెండవ భాగాన్ని కొనసాగించలేకపోవడం ప్రేక్షకుడ్ని కొంత అసంతృప్తికి గురి చేస్తుంది. కాని ఓ చక్కటి క్లైమాక్స్ తో ముగించడంతో ప్రేక్షకుడిలో కలిగిన అసంతృప్తి దూరం చేయగలిగాడు. దర్శకుడి కథ, కథనాలకు తోడు ప్రీతం సంగీతం, ఫోటోగ్రఫీ అదనపు ఎస్సెట్ గా నిలిచాయి. 'హ్యారీస్ నాట్ ఏ బ్రహ్మచారి', 'యాహా వహా', దేశీ రొమాన్స్, 'తౌబా మే' పాటలు బాగున్నాయి. ప్రీతిష్ నందీ, ఏక్తా, శోభా కపూర్ నిర్మాణాత్మక విలువులు బాగున్నాయి. -రాజబాబు అనుముల -
నన్ను బకరాను చేశాడు
ఫర్హాన్ అఖ్తర్ మంచి సినిమాలు తీయడమే కాదు ఎన్నో జోకులతో సహనటులను నవ్విస్తుంటాడు. షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ షూటింగ్ సందర్భంగా తెలివిగా జోకులు వేస్తూ తనను బకరాను చేశాడ ని ఇందులో హీరోయిన్ విద్యాబాలన్ చెబుతోంది. ‘నవ్వడం నాకిష్టం. ఫర్హాన్ అందరినీ నవ్వించడానికి ఇష్టపడుతాడు. ఇంకేం.. నాలో అతనికి బకరా కనిపించింది. ఫర్హాన్ హాస్యచతురత అద్భుతం. ఎంతో తెలివైనవాడు కూడా. షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ చూశాను. మా ఇద్దరి కామెడీ నిజజీవితంలోని సంఘటనలకు చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది’ అని చెప్పింది. ఫర్హాన్ గతంలో తీసిన లక్ బై చాన్స్, జిందగీ నా మిలే దొబారా వంటి సినిమాలు చాలా ఇష్టమని, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్‌లోనూ చాలా మంచి హాస్యం ఉంటుందని చెప్పింది. సులువుగా హాస్యాన్ని పండించే హీరోల్లో ఫర్హాన్ ఒకడని, పెద్ద కష్టపడకుండానే నటించినా ప్రేక్షకులు విపరీతంగా నవ్వుతారంటూ ప్రశంసలు కురిపించింది. అన్ని రకాల పాత్రల్లోనూ ఒదిగిపోవడం అతని ప్రత్యేకతని విద్య చెప్పింది. ‘మా అందరిలో ఏ ఒక్కరి నటన బాగా లేకున్నా సినిమా ఫలితం దారుణంగా ఉండేది. అయితే ఫర్హాన్, నా జోడీ అద్భుతంగా కుదిరింది’ అని చెప్పిన విద్య యూటీవీ సీఈఓ సిద్ధార్థ్‌రాయ్ కపూర్‌ను 2012లో పెళ్లాడడం తెలిసిందే. వివాహం జరిగిన మూడు నెలలకు షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ ప్రాజెక్టుపై సంతకం చేసింది. వివాహిత అనుభవం కూడా ఈ సినిమాలో పాత్రపై ప్రభావం చూపి ఉండొచ్చని విద్య చెప్పింది. విద్య తొలి కామెడీ సినిమా ఘన్‌చక్కర్ కాగా షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ రెండోది. అయితే ఘన్చక్కర్లో ఎప్పుడూ గడగడా మాట్లాడే గృహిణిగా కనిపిస్తానని, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ పాత్ర మాత్రం విభిన్నంగా ఉంటుందని విద్యాబాలన్ వివరించింది. -
'సిక్స్ ప్యాక్ నా పిల్లల్ని ఆకట్టుకోలేదు'
మిల్కా సింగ్ జీవిత కథ నేపథ్యంగా తెరకెక్కిన 'భాగ్ మిల్కా భాగ్' చిత్రం కోసం బాలీవుడ్ నటుడు,దర్శకుడు ఫర్హాన్ అక్తర్ కఠోరంగా శ్రమించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్ బాడీతో అభిమానులను, ప్రేక్షకులను ఫర్హాన్ ఆకట్టుకున్నారు. అయితే తన పిల్లలను తన సిక్స్ ప్యాక్ బాడీ ఆకట్టుకోలేదని ఆయన తెలిపారు. ఆ చిత్రంలో తాను పెరిగెత్తడమే వాళ్లను ఆనందానికి గురి చేసిందన్నారు. ఇటీవల తన కూతురి స్కూల్ లో జరిగిన రేసింగ్ ఈవెంట్ లో ఫర్హాన్ పాల్గొన్నారు. స్కూల్ రేసింగ్ కార్యక్రమంలో తాను ముందుండి పరిగెత్తడం తన కూతుళ్లు షక్యా, అకిరాలకు చెప్పలేనంత ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా చాలా గర్వంగా ఫీల్ అయ్యారని ఫర్హాన్ తెలిపారు. దర్శకుడు సాకెత్ చౌదరీ రూపొందించిన 'షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్' చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో ప్రస్తుతం ఫరాన్ అక్తర్ బిజీగా ఉన్నారు. వైవాహిక బంధాలు, సంబంధాలు నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రం అందర్ని ఆకట్టుకుంటుందనే అభిప్రాయాన్ని ఫర్హాన్ వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్ సరసన విద్యా బాలన్ నటించింది. -
ఫర్హాన్ తెగ నవ్వించేశాడు: విద్యాబాలన్
నటుడు, దర్శకుడు, రచయిత.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఫర్హాన్ అక్తర్ తన జోకులతో సహ నటులను తెగ నవ్విస్తుంటాడు. తనను బకరా చేసి విపరీతంగా నవ్వించేవాడని, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ చిత్రం విషయంలో తనకీ అనుభవం ఎదురైందని పద్మశ్రీ అవార్డు గ్రహిత విద్యాబాలన్ చెప్పింది. తనకు నవ్వడం అంటే ఇష్టమని, ఫర్హాన్‌కు నవ్వించడం అంటే ఇష్టమని ఆమె తెలిపింది. అతడి సెన్సాఫ్ హ్యూమర్ చాలా బాగుంటుందని, బాగా తెలివైన వాడని ప్రశంసలు కురిపించింది. 'భాగ్ మిల్కా భాగ్'లో చాలా సీరియస్‌గా రన్నింగ్ మీదే దృష్టి పెట్టిన అక్తర్, విడిగా చూసినప్పుడు మాత్రం భలే సరదాగా ఉంటాడు. ఈ సినిమాలో కూడా కామెడీ బాగుంటుందని, నిజ జీవితంలో కూడా అది అలాగే ఉందని విద్యాబాలన్ చెప్పింది. గతంలో లక్ బై ఛాన్స్, జిందగీ న మిలేగా దుబారా లాంటి చిత్రాలు చూసి తాను ఫర్హాన్ ఫ్యాన్ అయిపోయానని, సాకేత్ చౌధురి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తామిద్దరికీ బాగా సూటయ్యిందని తెలిపింది. ఈ సినిమాలో తామిద్దరిలో ఎవరు సరిగా లేకపోయినా సినిమా ఫెయిలయ్యేదని, కానీ ఇద్దరం జోకులతో బాగా ఎంజాయ్ చేయడంతో సినిమా కూడా బాగా వచ్చిందని వివరించింది.