నేను స్వార్థపరురాలిని..!
న్యూఢిల్లీ: తాను స్వార్థపరురాలినని పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత అనేక రకాల పాత్రలను పోషించిన విద్యాబాలన్ పేర్కొంది. తన కోసమే తాను పనిచేస్తానంది. బాలీవుడ్‌లో తారలకు సాధారణంగా మూసపాత్రలే ఎక్కువగా లభిస్తున్న తరుణంలో విద్యాబాలన్ విభిన్న పాత్రలను పోషించింది. ‘పా’, ‘ఇష్కియా’, ‘నో వ న్ కిల్డ్ జెస్సికా, ‘డర్టీ పిక్చర్’, ‘కహానీ’ సినిమాల్లో విభిన ్నపాత్రల్లో నటించడంద్వారా ఈ మలయాళీ మెరుపుచుక్క ప్రేక్షకులతోపాటు విమర్శకుల మెప్పు సైతం పొందింది. ‘నాకేదైనా నచ్చితే దాని గురించి ఇతరులు ఏమంటారనే విషయాన్ని పట్టించుకోను. ఆ కథ విభిన్నంగా ఉందా లేదా అనే విషయాన్ని మాత్రమే పట్టించుకుంటా. నేను బాగా స్వార్థపరురాలిని. దేని గురించీ ఆలోచించను. ఏమిచేయాలనుకుంటానో అదే చేస్తా’ అని అంది.
ఇటీవల ఈ వయ్యారి నటించిన హాస్యచిత్రం ‘ఘన్‌చక్కర్’, రొమాంటిక్ సినిమా ‘షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్’ బాక్సాఫీసు వద్ద బోల్తాపడ్డాయి. అయితే ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో విద్యాబాలన్ బాగా ఆసక్తి చూపినప్పటికీ ఆమె ఆకాంక్ష మాత్రం నెరవేరలేదు. ‘ఈ రెండు సినిమాలు ఆడకపోవడం దురదృష్టకరం. షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ సినిమాలో నా పాత్ర విభిన్నమైనదే. అయితే బాగా ఆడకపోవడంతో విభిన్నమైన పాత్రేమీ కాదని అందరూ అనుకుంటున్నారు. అయితే నేను మూసపాత్రలకు పరిమితం కాను’ అంది. ‘ నా ఆనందం ఎవరి చేతుల్లోనూ లేదు. అది కేవలం ఒకే ఒకరి చేతుల్లో ఉంది. అది నేనే. నాకు ఏది ఆనందం కలిగిస్తుందో అందుకు అనుగుణంగానే జీవించడానికి అలవాటుపడ్డా’ అని అంది.