సమాజం నా కుటుంబాన్ని వెలి వేసింది...
ముంబై : ‘నేను ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నాను...కానీ కొందరు మాత్రం పదే పదే నా గతాన్ని గుర్తు చేస్తూ వారి నేరాలకు నన్ను బాధ్యుడ్ని చేయాలిని చూస్తున్నారు...ఎందుకంటే ఇదివరకే నేను ‘గ్యాంగ్ రేప్’ కేసులో నేరస్తుడిగా శిక్ష అనుభవించాను కాబట్టి...’అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ‘శక్తి మిల్స్ గ్యాంగ్ రేప్’ నేరస్తుల్లో ఒకడైన ఆకాశ్ జాధవ్. 2013లో శక్తిమిల్స్‌లో జరిగిన గ్యాంగ్ రేప్ నేరంలో మైనర్ కావడంతో జువైనల్ హోంలో మూడు ఏళ్ల శిక్ష అనుభవించాడు ఆకాశ్.
మహాలక్ష్మి ధోబి ఘాట్ ప్రాంతంలో నివసిస్తున్న ఆకాశ్ జాధవ్ 2013, జులై 31న తన స్నేహితులతో కలిసి ఓ పద్దేనిమిదేళ్ల యువతిపై శక్తి మిల్స్ కాంప్లెక్స్ ప్రాంతంలో గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఆ సమయంలో ఆకాశ్ వయసు 17 సంవత్సరాలు. దాంతో ముంబై జువైనల్ జస్టిస్ బోర్డు ఆకాశ్‌తో పాటు గ్యాంగ్ రేప్లో పాల్గొన్న మరో మైనర్ నేరస్తుడిని మూడేళ్ల పాటు ‘నాశిక్ బోర్స్టల్’ పాఠశాలకు పంపించింది. 2017, జులైలో వీరిద్దరు తమ శిక్షాకాలం ముగించుకుని బయటకు వచ్చారు. ఆకాశ్ నేరం చేసేముందు వరకూ అతని కుటుంబం మహలక్ష్మి ధోబి ఘాట్ ప్రాంతంలో నివసిస్తుండేది. కానీ ఆకాశ్ మీదం నేరం రుజువై, అతడు జువైనల్ హోమ్‌కు వెళ్లిన తర్వాత అతని కుటుంబం ఆ ప్రాంతంలో ఉండలేక కనైర్మార్గ్ ప్రాంతానికి వెళ్లారు.
జువైనల్ హోం నుంచి బయటకు వచ్చిన ఆకాశ్ మాత్రం తాను గతంలో నివసించిన మహాలక్ష్మి ప్రాంతంలోని ‘సాత్ రస్తా’లోనే నివాసం ఉండాలని భావించి అక్కడే ఉంటున్నాడు. అక్కడ ఆకాశ్‌కు వ్యతిరేకంగా ఉండే మరి కొందరు ఆకాశ్ గతాన్ని గుర్తు చేస్తూ సూటిపోటి మాటలనడమే కాక...ఆ ప్రాంతంలో ఏ చిన్న నేరం జరిగిన ఆకాశ్‌ను అనుమానిస్తూ అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులు కూడా గతంలో ఆకాశ్ గ్యాంగ్‌రేప్ కేసులో జువైనల్ హోం కు వెళ్లి వచ్చాడు కాబట్టి ఈ నేరాలు కూడా చేసి ఉంటాడనే ఉద్ధేశంతో అతని మీద కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో 2017, జులై నుంచి 2018, మార్చ్ వరకూ ఆకాశ్ మీద హత్యాయత్నం, కిడ్నాప్, వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ వంటి పలు నేరాలతో సంబంధం ఉన్నట్లుగా 5 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
వీటి గురించి ఆకాశ్ ‘నా శత్రువులు కావాలనే నా మీద ఇలాంటి నేరారోపణలు చేస్తున్నారు. వారు పదేపదే నా గతాన్ని గుర్తు చేస్తూ నన్ను గేలి చేస్తున్నారు. నా మీద ఇంతకు ముందే రేప్ కేస్ ఉండటం వల్ల పోలీసులు కూడా వారి మాటలను నమ్ముతున్నార’న్నాడు. అంతేకాక ‘నేను ప్రశాంతంగా జీవించాలనుకుంటుంటే నా శత్రువులు మాత్రం నన్ను బాధపెడుతునే ఉన్నారు. వారు నా మీద అసత్య ఆరోపణలు చేస్తుండటంతో నేను వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలనుకున్నాను. అందుకే ఒకరిని చితకబాదాన’న్నాడు.
‘సమాజం, ఈ ప్రపంచం...నన్నువెలి వేసినా నా కుటుంబం మాత్రం నాకు అండగా ఉంది. నేను చేసిన నేరానికి శిక్ష అనుభవించాను...కాని సమాజం మాత్రం నా కుటుంబాన్ని, నన్ను ఇంకా శిక్షిస్తూనే ఉంది. నా చెల్లికి పెళ్లి కావడంలేదు. సమాజం నా కుటుంబాన్ని వెలివేసిం’దంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.