ఓట్లకు ‘మార్గం’!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రభుత్వం ఎన్నికల వేళ ‘తాయిలాల’ను ప్రకటిస్తోంది. ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు భారీగా నిధుల వరదను పారిస్తోంది. ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని రోడ్ల అభివృద్ధికి నిధులు కుమ్మరిస్తోంది. తాజాగా కేంద్ర రోడ్డు నిధి(సీఆర్ఎఫ్) కింద రాష్ర్టవ్యాప్తంగా రూ.600 కోట్లను విడుదల చేసిన కేంద్ర సర్కారు.. దాంట్లో రూ.101 కోట్లను జిల్లాకు కేటాయించింది. దీంతో 116.72 కిలోమీటర్ల మేర రహదారులకు మహర్దశ పట్టనుంది. కేంద్ర రహదారి, రవాణా మంత్రిత్వశాఖ మార్గదర్శకాల మేరకు వీటిని 24 నెలల్లో నిర్మించాలని పేర్కొంటూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శాంబాబ్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో అత్యధికంగా మేడ్చల్ నియోజకవర్గంలో ఆరు ప్రధాన మార్గాలకు మోక్షం కలుగనుంది.
సుమారు 52 కిలోమీటర్ల పొడవు గల ఈ రోడ్లను రూ.71 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయాలని ఆర్అండ్బీ శాఖ నిర్ణయించింది. మెదక్ జిల్లాను తాండూరుతో అనుసంధానంచేసే తాండూరు- కోట్‌పల్లి మార్గానికి రూ.10 కోట్లు మంజూరయ్యాయి. గతుకులమయమైన ఈ రహదారిని మరమ్మతు చేయాలని కొన్నేళ్లుగా స్థానికులు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోలేదు. చివరకు జిల్లా మంత్రి ప్రసాద్‌కుమార్ చొరవతో ఈ రోడ్డుకు గ్రహణం వీడింది.