shanker naik
-
ముందు నేనే మాట్లాడతా...
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ గ్రూపుల లొల్లి మరోసారి బయటపడింది. పార్టీ అధినాయకత్వం పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో శుక్రవారం నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత మైకు పట్టుకొని కార్యక్రమాన్ని ప్రారంభించే ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ‘నేనే మాట్లాడతా’ అంటూ ఆమె చేతిలో మైకును లాక్కున్నారు. దీంతో కవిత వెంటనే.. పక్కనే ఉన్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావుకు చెప్పి అసహనం వ్యక్తం చేశారు. అనంతరం.. దీక్షలో కూర్చున్న డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ ప్రొటోకాల్ ప్రకారం జిల్లా అధ్యక్షురాలి చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుందని మంత్రి సత్యవతి రాథోడ్‌తో ప్రస్తావించారు. చదవండి: గవర్నర్‌తో వివాదంపై స్పందించిన కేటీఆర్.. ఏమన్నారంటే! -
హోలీ వేడుకల్లో బీర్ బాటిళ్లతో హల్చల్.. వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాక్షి, మహబూబాబాద్: వరంగల్ ఉమ్మడి జిల్లాలో హోలీ సంబరాలు ఫుల్ జోష్ మధ్య జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా, రంగు రంగుల కలర్స్, డాజే పాటలతో హోళీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ ఏడాది కరోనా ఆంక్షలు లేకపోవడం తో యువత పెద్ద ఎత్తున సంబరాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. హోలీ వేడుకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మందు బాటిళ్లతో హల్చల్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో హోళీ వేడుకల్లో భాగంగా బీర్ల వర్షం కురిపించారు. మందు బాటిల్‌తో స్టెప్పులు వేసి కార్యకర్తల్లో జోష్ నింపారు. కార్యకర్తలకు స్వయంగా మందు బాటిల్ నోట్లో పెట్టి ఎమ్మెల్యే మందు పోసి హంగామా సృష్టించారు. కార్యకర్తలు కూడా మద్యం కొట్టి ఎమ్మెల్యేతో సందడిగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. హోలీ వేడుకలతో ప్రజాప్రతినిధులతో పాటు కార్యకర్తలు మద్యంతో హల్చల్ చేయడం స్థానికులను విస్మయానికి గురి చేసింది. చదవండి: హోలీ వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్ డీజే స్టెప్పులు -
ఎమ్మెల్యే శంకర్‌కు మెగాస్టార్ చిరంజీవి ఫోన్
మహబూబాబాద్: ‘హలో.. శంకర్ ఎలా ఉన్నారు, కుటుంబసభ్యులు బాగున్నా రా.. ప్రజల్లో బాగా తిరుగుతారు. పరిస్థితులు బాగాలేవు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి’’ అని మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో ఫోన్లో మాట్లాడారు. ‘మానుకోట నా అభిమాన కోట శంకర్, మీ మాట కోసం జిల్లాకు ఆక్సిజన్ బ్యాంక్ ఇచ్చాను’ అని చెప్పినట్లు శంకర్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన ఆక్సిజన్ బ్యాంకు మంజూరు చేయడంపై ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: సీఎం సహాయనిధికి హాస్యనటుడు సూరి విరాళం ‘లూసిఫర్’ రీమేక్‌లో కీలక పాత్రలో వరుణ్ తేజ్!? -
పని చేస్తున్నారా.. ఇంట్లో పడుకుంటున్నారా ?!
సాక్షి, వరంగల్: రూ.కోట్ల కొద్ది నిధులతో నిర్మిస్తున్న చెక్ డ్యాం పనులును పరిశీలించకుండా ఇరిగేషన్ అధికారులు ఇంట్లో పడుకుంటున్నారా అని ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు సమీప పాకాలవాగుపై నిర్మిస్తున్న చెక్ డ్యాం పనులను బుధవారం ఎమ్మెల్యే పరిశీలించారు. అంతకుముందు వడ్డెరగూడెం సమీపంలోని చెక్ డ్యాం నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఖంగుతిన్నారు. ఇవేం పనులు.. అంటూ ఇరిగేషన్ డీఈ ఉపేందర్, ఏఈలు నిహారిక, శేఖర్‌ను పిలిచి ఆరా తీశారు. ‘అసలు మీరేం చేస్తున్నారు? మొత్తం మట్టి కనిపిస్తుంది. సిమెంట్‌తో కడుతున్నారా.. మట్టితోనా’ అని ప్రశ్నించారు. ‘మీరసలు పనుల వద్దకు వస్తున్నారా.. కమీషన్లు తీసుకొని ఇంటి వద్దనే ఉంటున్నారా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో డీఈ ఉపేందర్ కలగచేసుకుని ఇంతకాలం మరో డీఈ ఉండేవారని, తాను కొత్తగా వచ్చినట్లు చెప్పగా ఏఈలపై ఆగ్రహం చేశారు. మరో రెండు వారాల్లో డ్యాం చుట్టూ కట్టే రాతి కట్టడాలలో సిమెంట్ నింపి కట్టాలని, ఇలా మట్టితో కాదని సూచించారు. మళ్లీ వచ్చి చూసే వరకు నాణ్యత లేకుంటే బిల్లులు ఆపిస్తానని హెచ్ఛరించారు. చదవండి: భిక్కనూరులో పాజిటివ్.. నిజామాబాద్‌లో నెగెటివ్ -
మునిసిపల్ బడ్జెట్‌కు ఆమోదం
► ఇంటి పన్నులు, ఇతరాత్ర ఆదాయ వనరులపై చర్చ ► మునిసిపాలిటీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా ► ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ మహబూబాబాద్ : మానుకోట మునిసిపాలిటీ 2016–17 సంవత్సర నికర బడ్జెట్, 2017–18 అంచనా బడ్జెట్‌కు స్వల్ప మార్పులతో పాలకమండలి సోమవారం ఆమోదం తెలిపింది. 88 కోట్ల 89 లక్షల అంచనా ఆదాయం, 86.6 లక్షల వ్యయం, 2 కోట్ల 82 లక్షల 52 వేల మిగులు బడ్జెట్‌పై అకౌంటెంట్ సరిత చదివి వినిపించారు. కాగా కార్యక్రమానికి ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ కూడా హాజరయ్యారు. తొలుత ఆయన మాట్లాడుతూ త్వరలో మానుకోటకు సీఎం వస్తున్నారని, ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులకు సంబంధించిన డీపీఆర్‌ను తయారు చేయాలన్నారు. మునిసిపాలిటీ సమస్యలన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. నిజాం చెరువును మినీట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు రూ.7 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. బతుకమ్మ ఆడేందుకు స్థలం, ఇతరాత్ర నిర్మాణాలతోపాటు రింగురోడ్డుతో మానుకోట రూపురేఖలు మారుతాయన్నారు. టీఆర్ఎస్ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ మార్నేని వెంకన్న మాట్లాడుతూ.. వృత్తిపన్నును బడ్జెట్లో చేర్చాలన్నారు. ఖాళీ స్థలాలకు కూడా పన్నులు విధించి ఆ ప్రాం త అభివృద్ధికి ఉపయోగించాలన్నారు. సీపీఐ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ బి.అజయ్ మాట్లాడుతూ.. 88.89 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు ప్రతిపాదనలు తయారు చేశారని, కానీ దానిలో ఎక్కువగా పింఛన్లకు సంబంధించినవి, డబుల్ బెడ్రూమ్కు సంబంధించినవే ఉన్నాయన్నారు. చూసే వారికి బడ్జెట్ పెద్దగా కనిపించినప్పటికీ దాని మిగులు బడ్జెట్ మాత్రం తక్కువగా ఉందన్నారు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ ద్వారా ఆదాయ వనరులు పెంచుకోవాలన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి ఎక్కువ మొత్తంలో నిధుల కోసం ప్రజాప్రతినిధులు పాటుపడాలన్నారు. బడ్జెట్ రూపకల్పన సక్రమంగా లేదన్నారు. కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ పుచ్చకాయల కృష్ణ మాట్లాడుతూ.. ప్రజలపై భారం పడకుండా పన్నులు వసూలు చేసి ఆదాయం పెంచుకోవాలన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ సూర్నపు సోమయ్య మాట్లాడుతూ.. వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సెల్ టవర్లపై కూడా పన్ను వసూలు చేయాలన్నారు. ఈ సందర్భంగా మునిసిపల్ చైర్పర్సన్ డాక్టర్ భూక్య ఉమ మాట్లాడుతూ అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. సమావేశంలో కమిషనర్ జి.రాజేంద్రకుమార్, డీఈ కృష్ణాలాల్, మేనేజర్ రాజన్న, వర్క్ ఇన్స్పెక్టర్ సాబీర్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.