► ఇంటి పన్నులు, ఇతరాత్ర ఆదాయ వనరులపై చర్చ
► మునిసిపాలిటీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా
► ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్
మహబూబాబాద్ : మానుకోట మునిసిపాలిటీ 2016–17 సంవత్సర నికర బడ్జెట్, 2017–18 అంచనా బడ్జెట్‌కు స్వల్ప మార్పులతో పాలకమండలి సోమవారం ఆమోదం తెలిపింది. 88 కోట్ల 89 లక్షల అంచనా ఆదాయం, 86.6 లక్షల వ్యయం, 2 కోట్ల 82 లక్షల 52 వేల మిగులు బడ్జెట్‌పై అకౌంటెంట్ సరిత చదివి వినిపించారు. కాగా కార్యక్రమానికి ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ కూడా హాజరయ్యారు.
తొలుత ఆయన మాట్లాడుతూ త్వరలో మానుకోటకు సీఎం వస్తున్నారని, ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులకు సంబంధించిన డీపీఆర్‌ను తయారు చేయాలన్నారు. మునిసిపాలిటీ సమస్యలన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. నిజాం చెరువును మినీట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు రూ.7 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. బతుకమ్మ ఆడేందుకు స్థలం, ఇతరాత్ర నిర్మాణాలతోపాటు రింగురోడ్డుతో మానుకోట రూపురేఖలు మారుతాయన్నారు. టీఆర్‌ఎస్ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ మార్నేని వెంకన్న మాట్లాడుతూ.. వృత్తిపన్నును బడ్జెట్‌లో చేర్చాలన్నారు. ఖాళీ స్థలాలకు కూడా పన్నులు విధించి ఆ ప్రాం త అభివృద్ధికి ఉపయోగించాలన్నారు.
సీపీఐ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ బి.అజయ్ మాట్లాడుతూ.. 88.89 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు ప్రతిపాదనలు తయారు చేశారని, కానీ దానిలో ఎక్కువగా పింఛన్లకు సంబంధించినవి, డబుల్ బెడ్‌రూమ్‌కు సంబంధించినవే ఉన్నాయన్నారు. చూసే వారికి బడ్జెట్ పెద్దగా కనిపించినప్పటికీ దాని మిగులు బడ్జెట్ మాత్రం తక్కువగా ఉందన్నారు. ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ ద్వారా ఆదాయ వనరులు పెంచుకోవాలన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి ఎక్కువ మొత్తంలో నిధుల కోసం ప్రజాప్రతినిధులు పాటుపడాలన్నారు.
బడ్జెట్ రూపకల్పన సక్రమంగా లేదన్నారు. కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ పుచ్చకాయల కృష్ణ మాట్లాడుతూ.. ప్రజలపై భారం పడకుండా పన్నులు వసూలు చేసి ఆదాయం పెంచుకోవాలన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ సూర్నపు సోమయ్య మాట్లాడుతూ.. వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సెల్ టవర్లపై కూడా పన్ను వసూలు చేయాలన్నారు. ఈ సందర్భంగా మునిసిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ భూక్య ఉమ మాట్లాడుతూ అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. సమావేశంలో కమిషనర్ జి.రాజేంద్రకుమార్, డీఈ కృష్ణాలాల్, మేనేజర్ రాజన్న, వర్క్ ఇన్‌స్పెక్టర్ సాబీర్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.