ఐ హేట్ మై మదర్.. విరక్తి పుడుతోంది!
''డిప్రెషన్ చుట్టేస్తోంది.. జీవితం చాలా అసహ్యంగా ఉంది.. నా తల్లంటేనే విరక్తి పుడుతోంది.. ఆమె ఓ బ్లడీ ....'' ఇవీ మూడేళ్ల క్రితం హత్యకు గురైన షీనా బోరా మనసులోని విషయాలు. ఈ కేసులో సరికొత్త విషయాలు తాజాగా వెలుగుచూశాయి. పోలీసుల విచారణలో షీనా బోరా స్వయంగా రాసుకున్న డైరీ బయట పడింది. ముత్యాల్లాంటి అక్షరాలతో ఒకే విషయాన్ని డైరీలో షీనా మళ్లీ మళ్లీ రాసుకుంది. ''అన్ని వైపుల నుంచీ డిప్రెషన్ నన్ను చుట్టేస్తోంది. జీవితం ఎంత అసహ్యకరంగా ఉంది, నా తల్లంటే నాకు విరక్తి పుడుతోంది. ఐ హేట్ మై మదర్.. ఆమె.. ఓ '' బ్లడీ బి...'' . ఆమె తల్లి కాదు మాంత్రికురాలు అంటూ తన ఆవేదనంతా అక్షరాల్లో వెలిబుచ్చింది.
షీనా తన తల్లిపట్ల ఉన్న ఏహ్యభావంతోనే ఆమెరికాలో ఉండేదని, ఇక్కడకు వచ్చేందుకు ఇష్టపడేది కాదని డైరీలో ఆమె రాసుకున్న విషయాలను బట్టి తెలుస్తోంది. ఆమె ఏప్రిల్ 24, 2012 న చనిపోయే సమయానికి షీనాకు 24 సంవత్సరాలు వయసు ఉందని, ఆ సాయంత్రమే షీనాను ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియాతోపాటు, ఆమె డ్రైవర్ కారులో షీనాను గొంతు నులిమి చంపేశారని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం దొరికిన పదేళ్ల కిందటి డైరీ ముఖ్యంగా షీనాకు, ఆమె తల్లి ముఖర్జియాకు మధ్య కుటుంబ సంబంధాలను తెలియజేస్తోందని, షీనాను ముఖర్జియా అందరికీ తన సోదరిగా పరిచయం చేసేదని పోలీసులు అంటున్నారు. 2003 ఫిబ్రవరి 11 తేదీన డైరీలో ''ఓహ్ నాకు హ్యాపీ బర్త్ డే నా! కానీ నేను హ్యాపీగా లేను'' అని షీనా రాయడం ఆమె ఎంత మాత్రం తన తల్లితో సంతోషంగా లేదన్న విషయాన్ని సూచిస్తోంది.
షీనా బోరా... పీటర్ ముఖర్జియా కొడుకు రాహుల్ ముఖర్జియా దగ్గర ఉండేది. ఇంద్రాణి ముఖర్జియాను పీటర్ 2002 లో వివాహం చేసుకున్నాడు. పీటర్‌ను పోలీసులు బుధవారం నాడు 12 గంటల పాటు ప్రశ్నించారు. ఇందులో పోలీసులకు పీటర్ ముఖర్జియా తమ మధ్య ఉన్న ఆర్థిక పరమైన గొడవల గురించి వివరించారు. అంతేకాదు సంజయ్ ఖన్నా, ఇంద్రాణిల కుమార్తె 'విధి' విషయంలో తమ మధ్య గొడవలు మొదలయ్యాయని, షీనా బోరా, ఆమె సోదరుడు మిఖైల్ ఇద్దరూ కలిసి విధిని చంపేందుకు ప్రయత్నించారని చెప్పారు. కాగా తాను కూడా షీనా హత్యకు సహాయపడినట్లు ఆయన ఒప్పుకున్నారు.