‘శివ వేద’ మూవీ రివ్యూ
టైటిల్: శివ వేద
నటీనటులు: శివ రాజ్ కుమార్, గానవి లక్ష్మణ్, భరత్ సాగర్, శ్వేతా చంగప్ప, ఉమాశ్రీ, అదితి సాగర్, తదితరులు
నిర్మాత : గీతాశివరాజ్‌కుమార్
తెలుగు విడుదల: ఎంవీఆర్ కృష్ణ
దర్శకత్వం : హర్ష
సంగీతం: అర్జున్‌జన్య
సినిమాటోగ్రఫీ : స్వామి జె గౌడ్
ఎడిటర్: దీపు ఎస్ కుమార్
విడుదల తేది: ఫిబ్రవరి 9, 2023
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన 125వ చిత్రం శివ వేద. ఇటీవలే కన్నడలో విడుదలై మంచి విజయం సాధించిన ఈ సినిమాను అదే పేరుతో ఫిబ్రవరి 9న తెలుగులో విడుదల చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేటంటే..
ఈ సినిమా కథంతా 1985, 1965 ప్రాంతాల కాలంలో జరుగుతుంది. 1985లో వేద(శివరాజ్ కుమార్) కూతురు కనక(అదితి సాగర్) జైలు నుంచి విడుదలవుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి చంద్రగిరి వెళ్తారు. అక్కడ పోలీసు అధికార రుద్ర(భరత్ సాగర్)ని కొట్టి చంపుతారు. ఆ తర్వాత మరో ఊరు వెళ్తారు.. అక్కడ ఒకరిని చంపుతారు. ఇలా ఊరు ఊరు తిరుగుతూ నలుగురిని చంపేస్తారు. రౌడీగా చలమణీ అవుతున్న గిరయ్యను చంపాలన్నదే వాళ్ల లక్ష్యం. అసలు తండ్రి కూతురు కలిసి ఈ మారణ హోమం ఎందుకు కొనసాగిస్తున్నారు? వేద గతం ఏంటి? అతని భార్య పుష్ప(గానవి లక్ష్మణ్) ఎలా చనిపోయింది? వరుస హత్యలు చేస్తున్నప్పటికీ మహిళా పోలీసు అధికారిణి రమా( వీణా పొన్నప్ప) ఎందుకు అడ్డుకోలేదు? కనకకు జరిగిన అన్యాయం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో శివ వేద చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
కేజీయఫ్ సినిమా ప్రభావం చిత్రపరిశ్రమపై బాగా పడింది. ఈ మధ్య కాలంలో వచ్చే వాటిలో ఎక్కువ చిత్రాలు కేజీయఫ్ తరహాలోనే ఉంటున్నాయి. కథను ఎవరో ఒకరు నేరేట్ చేయడం.. పీరియాడిక్ డ్రామా, ప్లాష్‌బ్యాక్‌ని అక్కడక్కడ చూపించడం.. ఇవన్నీ కేజీయఫ్ తర్వాతే మొదలయ్యాయి. శివవేద కూడా అలానే ఉంటుంది.ఈ సినిమా కథను ఓ బామ్మ తన మనవరాలికి చెబుతుంది.
బస్సులో ఆఫీస్‌కు వెళ్లే ఓ యువతిని ఓ పోకిరి ఇబ్బంది పెడతాడు. ఇంటికొచ్చిన ఆ యువతి ఇకపై ఆఫీస్‌కు వెళ్లను అని బామ్మకి చెబుతుంది. మరుసటి రోజు ఇంట్లోనే ఉంటే.. పాత పుస్తకాలు చదవమని చెప్పడం.. నేను చదవను కానీ అందులో ఏం ఉందో చదివి చెప్పు అని ఆ యువతి బామ్మని అడగడంతో కథ మొదలవుతుంది. కథా నేపథ్యం అంతా 1985, 1965లలో ఉంటుంది.
ఓ యాక్షన్ డ్రామాను ఎంచుకున్న దర్శకుడు హర్ష.. అందులో అంతర్లీనంగా ఒక చిన్న సందేశం కూడా పెట్టాడు. ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న ఓ సమస్యను బలంగా చెప్పారు. అమ్మాయిలు బయటకు వెళ్తే భయపడకూడదని, ధైర్యంగా ఉండాలనే సందేశాన్ని ఇచ్చారు. కథనం అంతా యాక్షన్ నేపథ్యంలో సాగడం.. తండ్రి కూతుళ్లు కలిసి కొంతమందిని ఎందుకు చంపుతున్నారనే విషయం చివరి వరకు చెప్పకపోవడంతో.. సినిమాపై ఆసక్తి పెరుగుతుంది.
అయితే వేద పెళ్లి ఎపిసోడ్... ఆ తర్వాత వచ్చే కామెడీ సీన్స్ తెలుగు ఆడియన్స్‌కి అంతగా ఎక్కకపోవచ్చు. కామెడీలో కన్నడ వాసనలే కనిపిస్తాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగుంటుంది. సెకండాఫ్‌లో ఎక్కువగా ప్లాష్బ్యాక్నే చూపించారు. వేద భార్య పుష్పగా గానవి లక్ష్మణ్ చేసే ఫైట్ సీన్స్ అయితే అదిరిపోతుంది. క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. సినిమాలో హింస ఎక్కువైనప్పటికీ.. మంచి సందేశాన్ని ఇచ్చారు.
ఎవరెలా చేశారంటే..
వేద పాత్రలో శివరాజ్ కుమార్ ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్‌తో పాటు యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేశాడు. అలా అని కథ మొత్తం ఆయన పాత్ర చుట్టే నడవదు. స్టార్‌డమ్‌ని పక్కనబెట్టి హీరోయిన్ పాత్రకు ప్రాధన్యత ఇచ్చారు. మహిళల పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న ఇలాంటి సినిమాలను ఒప్పుకొని నటించినందుకు నిజంగా శివరాజ్ కుమార్‌ని అభినందించాల్సిందే. వేద భార్య పుప్పగా గానవి లక్ష్మణ్ చక్కగా నటించారు. ఆమె చేసే పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి.
అలాగే వేద కూతురు కనకగా అదితి సాగర్ అద్భుతమైన నటనను కనబరిచారు. క్లైమాక్స్‌లో యాక్షన్స్ సీన్స్ ఇరగదీసింది. పోలీసు అధికారిణి రమా పాత్ర పోషించిన వీణా పొన్నప్ప తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. అర్జున్‌జన్య నేపథ్య సంగీతం చాలా బాగుంది. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు తెలుగు ప్రేక్షకులను అలరించలేలా ఉండవు. సినిమాటోగ్రపీ, ఎడిటింగ్ బాగుంది. గీతా శివరాజ్ కుమార్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.