బ్రౌన్ షుగర్ ముఠా అరెస్ట్
పులివెందుల టౌన్: పులివెందుల పట్టణంలో బ్రౌన్ షుగర్ సరఫరా చేస్తున్న నలుగురు సభ్యులు గల ముఠాను అరెస్టు చేసి వారివద్ద నుంచి 1.5 కిలోల బ్రౌన్ షుగర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. కడప రింగ్‌రోడ్డు వద్ద ఆదివారం ఎస్ఐ అనిల్‌కుమార్, కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, అంజి, రాజేశ్వరరెడ్డి, హయాత్, సుబ్బరాయుడు, ధనుంజయలు వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఇండికా వాహనాన్ని తనిఖీ చేస్తుండగా అందులో ఉన్న శివయ్య అనే వ్యక్తి అనుమానాస్పదంగా ఉండటంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు.
వల్లూరు పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రాంకుమార్, కడప చిన్నచౌకుకు చెందిన శివ, ముస్తఫాలు కలిసి బ్రౌన్ షుగర్‌ను బెంగళూరుకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. దీంతో వాహనంలో ఉన్న నలుగురినీ అరెస్టు చేశారు. మరో ఇద్దరిపై కూడా అనుమానాలు ఉన్నాయని.. త్వరలోనే వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తామని ఏఎస్పీ తెలిపారు.
ఇందుకు బాధ్యులు ఎంతటివారైనా సరే ఉపేక్షించేది లేదన్నారు. ఈ బ్రౌన్ షుగర్‌ను ఇక్కడికి ఎందుకు తెచ్చారు.. ఎవరెవరికి విక్రయించారు అనే కోణంలో కూడా విచారణ చేపట్టినట్లు ఆయన తెలిపారు. వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బ్రౌన్ షుగర్ విలువ దాదాపు రూ.35లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందివ్వాలని.. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చె ప్పారు. నిందితులను అరెస్టు చేసే విషయంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందికి రివార్డులు అందేలా ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామన్నారు. కార్యక్రమంలో పులివెందుల రూరల్ సీఐ మహేశ్వరరెడ్డి, ఎస్ఐలు అనిల్‌కుమార్, వెంకటనాయుడు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.