ఎగిరి..పడ్డ 'కింగ్'
♦2005లో ఆరంభమైన కింగ్ ఫిషర్
♦ ఆరేళ్లు తిరక్కుండానే కష్టాలు; భారీ అప్పులు
♦ ఏడేళ్లకే మూత; అప్పులు రూ.10వేల కోట్లపైనే
♦ దేశంలో విజయ్ మాల్యా ఆస్తులు రూ.5వేల కోట్లు!
♦ విదేశాల్లో సైతం విలువైన ఆస్తులు
అలా చేసి ఉండకపోతే...!
జీవితంలో ఈ మాట చాలామంది అనుకుంటుంటారు. విజయ్ మాల్యా ఇలా అనుకున్నారో లేదో గానీ... ఆయన గురించి తెలిసిన వారు మాత్రం ‘‘ఆయన విమానయాన రంగంలోకి వెళ్లి ఉండకపోతే!!’’ అని అనుకోకుండా ఉండలేరు. ఎందుకంటే... 22 ఏళ్ల పాటు తెలివిగా ఎత్తుగడలు వేస్తూ యూబీ గ్రూప్‌ను మహా సామ్రాజ్యంగా మార్చారు మాల్యా. విదేశీ కంపెనీల్ని చేజిక్కించుకుని విజయ బావుటా ఎగరెయ్యటమే కాదు. విదేశాల్లో వేలానికి పెట్టిన మనదేశ పరువు ప్రతిష్టల్నీ ఒకరకంగా కాపాడారు. భారీ మొత్తాలు వెచ్చించి టిప్పు సుల్తాన్ ఖడ్గాన్ని, మహాత్ముడి వస్తువుల్ని తిరిగి దేశానికి తెచ్చారు. శెహబాశ్ అనిపించుకున్నారు. కానీ 2005లో ఆరంభించిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్... మాల్యా పేరు మార్చేసింది. పరువు ప్రతిష్టల్ని దిగజార్చింది. విమానయాన రంగంలో అతివేగంగా డబ్బులు పోగొట్టి... ఆరేళ్లు తిరక్కుండానే అప్పుల పాలయ్యారు. అవి తీర్చకుండా ఎగవేసి ఎగవేతదారుగా మిగిలారు. పులి మీద పుట్రలా... అదే సమయంలో మిగిలిన కంపెనీల్లోనూ మెజారిటీ వాటా పోగొట్టుకున్నారు. సొంత యూబీ గ్రూప్ చైర్మన్ పదవినీ వదులుకున్నారు. తండ్రి సుదీర్ఘకాలం శ్రమించి ఏర్పాటు చేసిన సామ్రాజ్యాన్ని 28 ఏళ్ల వయసులో భుజానికెత్తుకున్న మాల్యా... ‘కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్’ అనే తన యూబీ గ్రూపు నినాదానికి తానే బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారు. ఇపుడు రాజ్యాధికారాన్ని పోగొట్టుకుని... వేరొకచోట శరణార్థిగా మిగిలిపోయారు.
తండ్రి మరణించటంతో....
మాల్యా పుట్టింది 1955 డిసెంబరు 18న. తండ్రి విఠల్ మాల్యా యూబీ గ్రూపు వ్యవస్థాపకుడు. 1983లో తండ్రి మరణించటంతో మాల్యా యూబీ గ్రూపు బాధ్యతలు చేపట్టారు.
సమీరతో పరిచయం; వివాహం
ఎయిరిండియాలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసే సమీరా త్యాబ్జీతో మాల్యాకు పరిచయం ఏర్పడింది. సమీర పుట్టింది 1970లో. ఆమెను మాల్యా 1986లో వివాహం చేసుకున్నారు. ఏడాది గడిచాక వీరికి సిద్ధార్థ్ మాల్యా పుట్టారు. యూబీ గ్రూపు వారసుడు కూడా సిద్దార్థ్ మాల్యానే. వివిధ కారణాలతో కొన్నాళ్లకు ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.
రేఖతో రెండో వివాహం
రేఖ మాల్యా బెంగ ళూరులో మాల్యా ఇంటిపక్కనే ఉండేవారు. రేఖ మొదట కూర్గ్‌లోని కాఫీ తోటల యజమాని ప్రతాప్ చెట్టియప్పను వివాహం చేసుకున్నారు. తరవాత భర్త నుంచి విడాకులు తీసుకుని షాహిద్ మహమూద్‌ను వివాహం చేసుకున్నారు. మహమూద్‌కు- రేఖకు లైలా, కబీర్ అనే ఇద్దరు పిల్లలున్నారు. తరవాత మహమూద్ నుంచి విడాకులు తీసుకున్నాక మూడో వివాహం గురించి ఆలోచిస్తున్న సమయంలో మాల్యా నుంచి ప్రతిపాదన రావటంతో ఆమె అంగీకరించారు. 1993లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వీళ్లకు లీనా, తాన్యా అనే ఇద్దరు అమ్మాయిలున్నారు. రేఖకు మొదటి భర్త ద్వారా కలిగిన లైలాను కూడా మాల్యా దత్తత తీసుకున్నారు. సొంత బిడ్డలానే చూసుకున్నారు. ప్రస్తుతం లీనా, తాన్యా ఇద్దరూ శాన్ఫ్రాన్సిస్కోలో తల్లితోనే ఉంటున్నారు. లైలా మాత్రం యూరప్ నుంచి మహిళల యాక్సెసరీస్‌ను దిగుమతి చేసుకుని విక్రయించే వ్యాపారం చేస్తున్నారు.
కింగ్ ఆఫ్ గుడ్‌టైమ్స్...
మాల్యా జీవనశైలి ఆది నుంచీ సంచలనమే. ఆయన ప్రత్యేక శ్రద్ధపెట్టి తయారు చేసే కింగ్‌ఫిషర్ క్యాలెండర్ ప్రాధాన్యం వేరే చెప్పాల్సిన పనిలేదు. ఒక క్యాలెండర్ కావాలంటూ వీవీఐపీలు కూడా ఎగబడే వారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక ఆయనిచ్చే పార్టీలు దేశమంతా ఫేమస్. ప్రపంచ వ్యాప్తంగా 25కు పైగా విలాసవంతమైన ఇళ్లున్న మాల్యా... ఫ్రాన్స్‌లో ఏకంగా ఓ దీవినే సొంతం చేసుకున్నారు. 250కి పైగా పురాతన కార్లు, ఖరీదైన వింటేజ్ యాచ్‌తో (విలాసవంతమైన పడవ) పాటు... ప్రయివేటు జెట్లు కూడా ఈయన సొంతం. అంతేకాదు! మాల్యాకు దేశంతో పాటు విదేశాల్లో కూడా అత్యంత ప్రముఖులతో సన్నిహిత సంబంధాలున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ వద్ద మాల్యా ఓ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. స్విస్ యువరాజుతో పాటు బోలెడంత మంది హాలీవుడ్ ప్రముఖులు విదేశాల్లో మాల్యా అతిథి గృహాల్లో అతిథులుగా ఉన్నారు.
చేజారిన సామ్రాజ్యం...
2013 జులై: యునెటైడ్ స్పిరిట్స్ లిమిటెడ్‌లో (యూఎస్ఎల్) 27 శాతం వాటాను రూ.6,500 కోట్లకు డియాజియో సంస్థ కొనుగోలు చేసింది. ఈ డబ్బుల్లో పైసా కూడా కింగ్‌ఫిషర్ రుణదాతలకు దక్కలేదు. ప్రస్తుతం యూఎస్‌ఎల్‌లో డియాజియో వాటా... 55 శాతం.
2013 ఆగస్టు: ముంబై విమానాశ్రయానికి అతి సమీపంలో ఉన్న అత్యంత విలువైన ‘కింగ్‌ఫిషర్ హౌస్’ను... రుణం ఎగవేసినందుకు ఎస్బీఐ సొంతం చేసుకుంది.
2013 అక్టోబరు: ఇన్ని రుణాలున్నా... ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో విజయ్ మాల్యా 84వ స్థానంలో నిలిచారు.
2013 డిసెంబరు: మాల్యాకు చెందిన యునెటైడ్ బ్రూవరీస్ లిమిటెడ్‌లో (యూబీఎల్)... ప్రపంచంలో 3వ అతిపెద్ద బ్రూవరీ అయిన డచ్ కంపెనీ ీహ నికెన్ అతిపెద్ద వాటాదారుగా మారింది. ప్రస్తుతం యూబీఎల్‌లో హీనికెన్కు 38.76 శాతం వాటా ఉంది.
2014 సెప్టెంబరు: మాల్యాను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా (విల్‌ఫుల్ డి ఫాల్టర్) యుైనె టెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
2015 సెప్టెంబరు: యునెటైడ్ స్పిరిట్స్, యునెటైడ్ బ్రూవరీస్ తరవాత... మంగళూరు కెమికల్స్‌పై మాల్యా నియంత్రణ కోల్పోయారు. మెజారిటీ వాటా జువారీ గ్రూప్ చేతికి వెళ్లింది.
2015 నవంబరు: బ్యాంకుల ఒత్తిడి పెరిగింది. ఎట్టకేలకు... అప్పులిచ్చిన బ్యాంకులకు లీడర్‌గా వ్యవహరించిన ఎస్బీఐ... మాల్యాను, ఆయనకు చెందిన రెండు కంపెనీలను ఉద్దేశపూర్వక ఎగవేతదార్లుగా ప్రకటించింది.
2015 డిసెంబరు: మాల్యా తన 60వ జన్మదినాన్ని మూడు రోజుల పాటు అట్టహాసంగా జరుపుకున్నారు. బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్‌తో పాటు లాటిన్ పాప్‌స్టార్ ఎన్రిక్ కూడా అతిథుల్ని అలరించారు.
2016 ఫిబ్రవరి: కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ బార్బడోస్‌ను రూ.13 కోట్లకు కొనుగోలు చేశారు. ఇది.. ఐపీఎల్ తరవాత క్రికెట్లో మాల్యా రెండో పెట్టుబడి.
ఫిబ్రవరి 17: యూబీ హోల్డింగ్స్ లిమిటెడ్‌ను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రకటించింది.
ఫిబ్రవరి 26: డియాజియోతో ఒప్పందం మేరకు యూఎస్ఎల్ చైర్మన్ పదవి నుంచి మాల్యా తప్పుకున్నారు. ఇందుకు ఆయనకు ఐదేళ్లలో రూ.500 కోట్ల వరకూ అందుతాయి.
మార్చి 4: ఈ 500 కోట్లూ తనకే దక్కాలంటూ రుణ రికవరీ ట్రిబ్యునల్‌ను ఎస్బీఐ ఆశ్రయించింది.
మార్చి 9: మాల్యా రెండో తేదీనే దేశం విడిచి వెళ్లిపోయినట్లు సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు! డియాజియో చెల్లించాల్సిన దాంట్లో అప్పటికే రూ.270 కోట్లు ఆయనకు చెల్లించినట్లు కూడా కోర్టుకు ప్రభుత్వం వెల్లడించింది.
అప్పుల కుప్ప...
బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, వడ్డీ కలిపితే... మాల్యా అప్పులు రూ.10వేల కోట్లకన్నా ఎక్కువే. కింగ్ ఫిషర్ ఉద్యోగులు అడుగుతున్న ఎరియర్స్ బకాయిలు దీనికి అదనం.
ఇవి కాక కొన్ని ప్రధానమైన ఢిల్లీ, ముంబైలలో భవంతులు, మరికొన్ని రియల్ ఎస్టేట్ ఆస్తులు, గుర్రాల ఫాం, ప్రైవేటు జెట్, దాదాపు రెండు వందల వింటేజ్ కార్ల్లు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఆస్తుల విలువ రూ.4,500-రూ.5,000 కోట్ల మధ్య ఉండవచ్చని అంచనా.
దేశంలో ఉన్న ఆస్తుల విలువ మొత్తం కలిపితే దాదాపు రూ.5000 కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా. ఇవి కాక విజయ్ మాల్యాకు పలు దేశాల్లో విలువైన ఆస్తులున్నాయి. వీటిలో బహిరంగంగా బయటకు తెలిసిన ఆస్తులివీ...
సాసాలిటొ: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఈ ఇల్లు... అక్కడ చాలా ఫేమస్. ఈ ఇంట్లోంచి బెల్వెడర్ సిటీతో పాటు శాన్ ఫ్రాన్సిస్కో-ఓక్లాండ్ బే బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. 2003లో ‘శాన్ఫ్రాన్సిస్కో గేట్’ తెలిపిన వివరాల మేరకు... 6-బల్కీ అవెన్యూలో ఉన్న సాసాలిటో ప్రాపర్టీని 1987లో మాల్యా కొన్నారు. మాల్యా భార్య రేఖ గర్భిణిగా ఉండగా... ప్రసవం కష్టం కావటంతో అక్కడకు వెళ్ళారు. కొన్నాళ్లు అక్కడే ఉండాలని వైద్యులు చెప్పటంతో... 11వేల చదరపు అడుగుల ఈ భవంతిని 12 లక్షల డాలర్లకు మాల్యా కొన్నారు. పలు మార్లు ఈ భవంతిలోకి నీరు ప్రవేశించి మునిగిపోయే పరిస్థితి ఏర్పడగా... మాల్యా మరమ్మతులు చేయిస్తూ వచ్చారు.
క్లిఫ్టన్ ఎస్టేట్: దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ బీచ్ ఒడ్డునున్న క్లిఫ్టన్లో 84 లక్షల డాలర్లు వెచ్చించి 2010లో మాల్యా ఓ ఎస్టేట్‌ను కొన్నారు. దీన్ని కేప్‌టౌన్‌లోనే అత్యుత్తమ ఎస్టేట్‌గా సండే టైమ్స్ (దక్షిణాఫ్రికా) వర్ణించింది. ఈ భవంతిలో సానాతో పాటు వాకింగ్ ట్రాక్, జిమ్, నాలుగు కార్ల గ్యారేజ్ ఉన్నాయి. 2010 ప్రపంచ కప్ సమయంలో స్వీడన్ యువరాజు కార్ల్ఫిలిప్ ఇక్కడే బసచేశారు. సింగర్ జార్జ్ మైఖేల్‌తో పాటు లార్డ్ ఆఫ్ వార్ సినిమా షూటింగ్ సమయంలో హాలీవుడ్ స్టార్ నికొలస్ కేజ్ దాదాపు రెండు నెలలకు పైగా ఇదే ఇంట్లో బస చేశారు. 2014 మార్చిలో మాల్యా ఈ ప్రాపర్టీని విక్రయించారు.
ట్రంప్ ప్లాజా: 2011 సెప్టెంబర్‌లో మాల్యా న్యూయార్క్‌లోని ట్రంప్ ప్లాజాలో 24 లక్షల డాలర్లు వెచ్చించి ఓ పెంట్‌హౌస్‌ను కొనుగోలు చేశారు. ఈ ట్రంప్ ప్లాజా వేరెవరిదో కాదు. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌ది. న్యూయార్క్‌లో అత్యంత ఖరీదైన టవర్ కూడా ఇదే. 37 అంతస్తుల ఈ రెసిడెన్షియల్ టవర్‌లో... డొనాల్డ్ ట్రంప్‌తో పాటు సెలబ్రిటీలు బియాన్స్ నోల్స్, బ్రూస్ విల్లీస్, టోనీ ఎంబ్రీ ఇళ్లు కూడా ఉన్నాయి.
ద గ్రాండ్ గార్డెన్ (ఫ్రాన్స్): ‘లె గ్రాండె జార్డిన్’ పేరిట పిలిచే ఈ దీవిని... సెలబ్రిటీలు, రష్యన్ బిలియనీర్లతో పోటీపడి మరీ 2008 మార్చిలో మాల్యా కొనుగోలు చేశారు. లెరిన్స్లోని 4 దీవుల్లో రెండే నివాస యోగ్యమైనవి. వీటిలో పెద్దది సెయింట్ మార్గరెట్. దీన్లోనే ‘లె గ్రాండ్’ ఉంది. మాల్యా కొన్నపుడు దీని ధర 7.6 కోట్ల నుంచి 8.8 కోట్ల డాలర్ల మధ్య ఉన్నట్లు సమాచారం.
మబూలా గేమ్లాడ్జ్ (జొహన్నెస్‌బర్గ్): దక్షిణాఫ్రికాలోని అత్యుత్తమ గేమ్ రిజర్వ్‌లలో మబూలా ఒకటి. గేమ్ రిజర్వ్ అంటే... వన్యప్రాణులతో నిండిన ప్రయివేటు అరణ్యం. 25,000 ఎకరాల్లో విస్తరించిన ఈ గేమ్ రిజర్వ్‌లో 99.5 శాతం వాటా మాల్యాదే. 1990లలో 60 లక్షల డాలర్లు వెచ్చించి మాల్యా ఈ గేమ్ లాడ్జ్‌ను కొనుగోలు చేశారు.
టెవిన్ విలేజ్; హెర్ట్‌ఫోర్డ్‌షైర్ (ఇంగ్లాండ్): తాజాగా టెవిన్ దగ్గర్లో ఓ పెద్ద ఇంటిని మాల్యా కొన్నారు. హెర్బర్ట్షైర్లోని వెల్విన్ గార్డెన్ సిటీకి వెలుపల టెవిన్ విలేజ్ ఉంటుందని ఫార్ములా వన్ బ్లాగర్ జో సవార్డ్ తెలియజేశారు.
కీలూర్ కేజిల్, పెర్త్షైర్: స్కాట్లాండ్లోని పెర్త్షైర్లో ఉంది కీలూర్ కేజిల్. 2007లో స్కాటిష్ బ్రాండ్ వైట్ అండ్ మెకేను కొనుగోలు చేసే సమయంలో ఆయా కార్యకలాపాల్ని పర్యవేక్షించడానికి మాల్యా అక్కడ ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో మాల్యా ఈ ఇంటిని కొనుగోలు చేశారు.
కలిసొచ్చిన కాలం...
1983: మాల్యా వయసు 28 ఏళ్లు. తండ్రి విఠల్ మాల్యా మరణించటంతో యునెటైడ్ బ్రూవరీస్ గ్రూప్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటికే ఈ గ్రూపు ఇతర రంగాలతో పాటు ప్రధానంగా లిక్కర్, ఫార్మా, ఆగ్రో కెమికల్స్, పెయింట్ల రంగాల్లో విస్తరించి ఉంది.
1986: మరో లిక్కర్ కంపెనీ ‘షా వాలెస్’ను కొనుగోలు చేయడానికి దాని యజమాని మనూ ఛాబ్రియాతో అప్పటికే కొన్నాళ్లుగా పోరాడుతున్నారు మాల్యా. ఆ సమయంలో ఫారెక్స్ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో మాల్యా కొన్నాళ్లపాటు అరెస్టయ్యారు.
1990: కర్ణాటక ప్రభుత్వం మంగళూరు కెమికల్స్, ఫెర్టిలైజర్స్‌ను ఖాయిలా సంస్థగా ప్రకటించింది. దాన్ని కొని, తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు మాల్యా.
1991: బెర్జర్ పెయింట్స్‌లో మెజారిటీ వాటాను 66 మిలియన్ డాలర్లకు విక్రయించారు. ఆ నిధుల్ని లిక్కర్ వ్యాపారంలో ఇన్వెస్ట్ చేశారు.
1993: ‘కిసాన్’ బ్రాండ్‌ను హిందుస్తాన్ యూనిలీవర్‌కు భారీ మొత్తానికి విక్రయించారు.
1994: రామస్వామి వడయార్ నుంచి గోల్డెన్ ఈగిల్ కమ్యూనికేషన్స్‌ను కొనుగోలు చేశారు. దాన్ని విజయ టీవీగా పేరు మార్చారు.
1996: బెర్జర్ పెయింట్స్ అంతర్జాతీయ వ్యాపారాన్ని మలేసియా కంపెనీకి విక్రయించారు.
1998: కోల్‌కతాకు చెందిన ఈస్ట్‌బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్లో యూబీ గ్రూప్ తరఫున వాటా కొన్నారు. దాని ప్రత్యర్థి మోహన్ బగాన్లోనూ వాటా తీసుకున్నారు.
1999: యూబీ గ్రూపు ‘కింగ్ ఫిషర్’ స్ట్రాంగ్ బీర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. దేశంలో ఇప్పటికీ అత్యధికంగా అమ్ముడవుతున్న బీర్ బ్రాండ్ ఇదే.
2001: బాలీవుడ్ సినీ గాసిప్ మ్యాగజైన్ ‘సినీ బ్లిట్జ్’ను ప్రచురించే రిఫా పబ్లికేషన్స్‌ను కొనుగోలు చేశారు.
2004: యూకేలో జరిగిన వేలంలో రూ.1.75 కోట్లు వెచ్చించి టిప్పుసుల్తాన్ ఖడ్గాన్ని సొంతం చేసుకున్నారు.
2005: షా వాలెస్‌ను పూర్తిగా హస్తగతం చేసుకుని.. విస్కీ బ్రాండ్ రాయల్ చాలెంజ్‌పై తన పట్టు పెంచుకున్నారు.
కలసిరాని కాలం...
2005 మే: ఏవియేషన్ రంగంలోకి ప్రవేశించారు. తొలి కింగ్ ఫిషర్ విమానం ఎగిరింది. ఎయిర్‌బస్ ఏ-380 విమానం కొనుగోలుకు ఆర్డరిచ్చారు. దీనికి ఆర్డరిచ్చిన తొలి దేశీ కంపెనీ కింగ్ఫిషరే. తరువాత ఇది రద్దయింది.
2006: బ్యాగ్‌పైపర్, రొమనోవ్ వోడ్కా వంటి బ్రాండ్లను తయారు చేసే హెర్బర్స్టోన్స్ను కొనుగోలు చేశారు.
2007: ప్రపంచంలో స్కాచ్ తయారీలో 4వ స్థానంలో ఉన్న వైట్ అండ్ మెకేను దాదాపు రూ.5,950 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. యూరోపియన్ విస్కీ మార్కెట్లో గట్టి పట్టు సంపాదించారు.
2007 జూన్: విదేశాలకు విమానాలు నడపాలంటే ఐదేళ్ల అనుభవం తప్పనిసరి కావటంతో... కింగ్‌ఫిషర్ సంస్థ ఎయిర్ డెక్కన్ కొనుగోలు చేసింది.
2008: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంఛైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును 11.16 కోట్ల డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు మాల్యా.
2009: న్యూయార్క్‌లో జరిగిన వేలంలో 18 లక్షల డాలర్లు వెచ్చించి మహాత్మా గాంధీకి చెందిన వస్తువుల్ని కొనుగోలు చేశారు.
2010 మార్చి: కింగ్‌ఫిషర్ సంస్థ తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ఆరంభించింది.
2010 నవంబర్: కింగ్‌ఫిషర్ అప్పులు రూ.6,000 కోట్లకు చేరాయి. బోర్డు సమావేశమై వీటి పునర్వ్యవస్థీకరణకు సిఫారసు చేసింది.
2011 సెప్టెంబర్: ఆరేళ్లు గడిచాయో లేదో... చౌక విమానయాన సర్వీసుల నుంచి కింగ్‌ఫిషర్ నిష్ర్కమించింది. ‘కింగ్‌ఫిషర్ రెడ్’ను మూసేసింది.
2011 డిసెంబర్: కష్టాలు షురూ... సర్వీస్ ట్యాక్స్ రూపంలో రూ.70 కోట్లు బకాయి పడటంతో కింగ్ఫిషర్కు చెందిన 11 బ్యాంకు ఖాతాలను ప్రభుత్వం స్తంభింపజేసింది.
2012 మార్చి: కింగ్ఫిషర్లో టికెట్లు బుక్ చేసుకుంటే ప్రయాణానికి గ్యారంటీ ఉండదని ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ హెచ్చరించింది.
2012 జూలై: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవటానికి కేంద్ర పౌరవిమానయాన శాఖ నో చెప్పింది.
2012 సెప్టెంబర్: నిర్వహణ ఖర్చులకు రూ.200 కోట్లు రుణం కావాలని చేసిన దరఖాస్తును ఎస్బీఐ తిరస్కరించింది.
2012 అక్టోబర్: కింగ్‌ఫిషర్ పర్మిట్‌ను... విమానయాన నియంత్రణ సంస్థ రద్దు చేసింది. విమానాలు నిలిచిపోయాయి. సిబ్బంది సమ్మెకు దిగారు.
2012 డిసెంబర్: కింగ్‌ఫిషర్ ఎయిర్ ఆపరేషన్స్ పర్మిట్ కూడా రద్దయింది.