Simplicity
-
‘బీఎండబ్ల్యూ ప్రధాని కోసం.. నా కారు మారుతి 800’
ఈ మాటలన్నది మాజీ ప్రధాని మన్మోహన్సింగ్. ఆయన నిరాడంబరతను ప్రస్తుత యూపీ మంత్రి, ఒకప్పుడు మన్మోహన్సింగ్ బాడీగార్డ్‌గా పనిచేసిన ఐపీఎస్ ఆఫీసర్ అసిమ్ అరుణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘2004 నుంచి దాదాపు మూడేళ్ల పాటు మన్మోహన్‌కు బాడీగార్డుగా పనిచేశాను. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) ప్రధానికి భద్రత కలి్పస్తుంది. క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్‌కు నాయకత్వం వహించే అవకాశం నాకు లభించింది. క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్‌గా నేను ప్రధానికి దగ్గరగా ఉండాల్సి వచ్చేది. ఏదైనా కారణాలవల్ల ఆయన వెంట ఒక అంగరక్షకుడు మాత్రమే ఉండాల్సి వస్తే.. నేనే ఉండేవాడిని. నీడలా ఆయనతో ఉండటమే నా బాధ్యత. డాక్టర్ సింగ్ వద్ద కేవలం ఒక కారు ఉండేది. అది మారుతి 800. ప్రధానమంత్రి కాన్వాయ్‌లోని నల్ల బీఎండబ్ల్యూ కార్ల వెనుక అది పార్క్ చేసి ఉండేది. కాన్వాయ్ తీసే ప్రతీసారి ఆయన ఆ కారువైపు ఆతీ్మయంగా చూసేవారు. ఎందుకని అడిగితే.. ‘ఈ బీఎండబ్ల్యూ కారులో ప్రయాణించడం నాకు ఇష్టం లేదు అసిమ్. నా వాహనం అదే(మారుతి)’ అనేవారు. ఈ కారు మీ లగ్జరీ కోసం కాదు.. సెక్యూరిటీ ఫీచర్లున్నాయి కాబట్టి మీరు ఇదే వాడాలి’ అని వివరించేవాడిని’’ అంటూ గుర్తు చేసుకున్నారు. 2004లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) బ్లాక్ క్యాట్ కమాండోగా శిక్షణ పొందిన తొలి ఐపీఎస్ అధికారి అసిమ్ అరుణ్. -
క్యూలైన్లో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య!
పాల్వంచ: ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నిరాడంబర జీవనం గడిపే ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఏళ్లు గడుస్తున్నా అదే ఒరవడి సాగిస్తున్నారు. సైకిల్‌పై వెళ్లడం, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం వంటివి ఆయన విషయంలో సర్వసాధారణంగా కనిపిస్తాయి. ఇదే క్రమాన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటి పరీక్షల కోసం బుధవారం ఆయన వచ్చారు. అక్కడ అందరితోపాటే ఓపీ చీటీ తీసుకుని వైద్యుల గది ముందు క్యూలో వేచి ఉండి తన వంతు వచ్చాక పరీక్ష చేయించుకున్నారు. వార్డుమెంబర్, ఎంపీటీసీలే హంగూ ఆర్భాటాలతో జీవిస్తుండగా 25 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగిన గుమ్మడి నర్సయ్య అందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని పలువురు అభినందించారు.చదవండి: హీరో ప్రభాస్ హెయిర్ స్టైల్ కావాలి.. ఫ్లాట్ హెయిర్ కట్ వద్దు -
మీరు సూపర్ మేడం.. ఐఏఎస్ అధికారిణిపై నెటిజన్ల ప్రశంసల వర్షం..
లక్నో: సామాన్య ప్రజలు తమ సమస్యల గోడు వినిపించేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగుతుంటారు. ఒక్కోసారి వారిని పట్టించుకునేవారే ఉండరు. ఉన్నత అధికారులను నేరుగా కలిసే అవకాశమే తక్కువ. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ దెహత్ జిల్లాలో ఓ ఐఏఎస్ అధికారిణి సౌమ్య పాండే మాత్రం తన సింప్లిసిటీతో నెటిజన్ల మనసులు దోచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పథకం ద్వారా ఎలక్ట్రిక్ బైక్ కొనేందుకు తనకు సాయం చేయాలని వెళ్లిన ఓ పెద్దాయన ధనీరామ్ సమస్యను ఆమె దగ్గరుండి తెలుసుకున్నారు. ఎండలోనూ అతని దగ్గరకు వెళ్లి వివరాలు అడిగి కచ్చితంగా సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. చీఫ్ డెవలెప్మెంట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న సౌమ్య.. ఈ విషయాన్ని అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దివ్యాంగుడైన ధనీరామ్ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేసేందుకు అవసరమైన సాయం అంధించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సౌమ్య పాండే.. ధనీరామ్ దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా మాట్లాడుతున్న ఫొటోలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంత పెద్ద హోదాలో ఉండి సామాన్యుడితో సౌమ్య పాండే ప్రవర్తించిన విధానంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. నవ భారత్‌లో సరికొత్త ఉత్తర్‌ప్రదేశ్ ఇది.. చూడండి ఐఏఎస్ అధికారి సామాన్యుడి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు ఎలా తీసుకుంటున్నారో.. అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. చదవండి: రాహుల్ గాంధీకి నిరాశ.. కోర్టులో దక్కని ఊరట.. ఏప్రిల్ 13 వరకు బెయిల్ -
ప్రవర్తన... పర్యవసానం
ప్రవర్తన, దాని పర్యవసానం మనిషి ప్రగతి, పతనాలకు కారణాలవుతాయి. మనిషి ప్రవర్తన తనకో, తన పక్కనున్న వ్యక్తికో, సమాజానికో పతనకారణం కాకూడదు. ప్రవర్తన కారణంగా మనిషంటే మనిషికి భయంగా ఉంటోంది, మనిషి వల్ల మనిషికి హాని జరుగుతోంది. ఇంతకీ ప్రవర్తన పర్యవసానాలేమిటి? ’నేను సరిగానే ప్రవర్తిస్తున్నానా?’ అని ప్రతి మనిషీ తన ప్రవర్తనను తాను పరిశీలించుకుంటూ ఉండాలి. ఈ అర్థాన్నిస్తూ ‘ప్రత్యహం ప్రత్యవేక్షేత నర శ్చరిత మాత్మనః / కింసు మే పశుభిస్తుల్యం కింసు సత్పురుషై రివ‘ అని కొన్ని శతాబ్దుల క్రితం కాళిదాసు (తన కావ్యం రఘువంశంలో) చెప్పాడు. కాళిదాసు చెప్పినట్టు ప్రతి మనిషికీ తన ప్రవర్తనను తాను పరిశీలించుకుంటూండే అభ్యాసమో, అలవాటో ఆ కాలం నుంచే ఉండుంటే బావుండేది. మన సమాజంలో నేరాలు, ఘోరాలూ, శత్రుత్వం వంటివి లేకుండా పోయేవి. లోకంలో అమానుషత్వం ఇంతలా వ్యాపించి ఉండేది కాదు. మనిషికి మనిషి వల్ల కష్టాలు, నష్టాలు కలుగుతూండకపోయేవి. మన జీవనాలు ప్రశాంతంగా సాగుతూండేవి. ఏ మనిషీ కూడా తాను ’పశువులాగా ప్రవర్తిస్తున్నాడా? లేక సత్పురుషుడిలాగా ప్రవర్తిస్తున్నాడా’ అని నిజాయితీతో పరిశీలించుకోవడం లేదు. చైనా కవి, తాత్త్వికులు లావొచు ఒక సందర్భంలో ఇలా అన్నారు: ‘నేను మూడు విషయాల్ని మాత్రమే బోధిస్తాను... సరళత, ఓర్పు, కనికరం. ఈ మూడూ నీ మహానిధులు. సరళత పనుల్లోనూ, ఆలోచనల్లోనూ ఉంటే నువ్వు నీ ఉనికికి ఆధారమైనదానికి మరలుతావు. ఓర్పుగా మిత్రులతోనూ, శత్రువులతోనూ ఉంటే, నువ్వు విషయాల వాస్తవికతతో కలుస్తావు. కనికరాన్ని నీపైనే చూపించుకుంటే, నువ్వు ప్రపంచంలోని అన్ని ప్రాణులతోనూ పునరైక్యమౌతావు‘. లావొచు చెప్పిన సరళత, ఓర్పు, కనికరం ఈ మూడూ మనిషి ప్రవర్తనలో నిండి ఉండాలి. అప్పుడే మనిషి పశువులాగా ప్రవర్తిస్తున్నాడా? అన్న పరిశీలనకు ‘కాదు‘ అని సత్పురుషుడిలాగా ప్రవర్తిస్తున్నాడా? అన్న పరిశీలనకు ‘అవును‘ అని జవాబులు వస్తాయి. సత్పురుషులు వసంత ఋతువు వంటి వాళ్లనీ, వాళ్లు లోకహితాన్ని చేస్తారనీ, వాళ్లు శాంతం కలవాళ్లనీ, వాళ్లు గొప్పవాళ్లనీ ఆదిశంకరాచార్య ‘శాంతా మహాంతో నివసంతి సంతో వసంతవల్లోక హితం చరంతః‘ అంటూ చెప్పారు. వసంత ఋతువులాగా హితకరంగా ఉండాలంటే ప్రతి మనిషికీ ప్రవర్తన పునాది. ‘నీ నమ్మకాలు నిన్ను మేలైన వ్యక్తిని చెయ్యవు నీ ప్రవర్తన చేస్తుంది‘ అని అంటూ గౌతమ బుద్ధుడు మనిషికి సరైన దిశానిర్దేశం చేశాడు. ప్రతిమనిషీ తన నమ్మకాలకు అతీతంగా ప్రవర్తనను పరిశీలించుకుంటూ ఆ ప్రవర్తనను చక్కగా చెక్కుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ’నేను పశువులాగా ప్రవర్తిస్తున్నానా? లేక సత్పురుషుడిలాగా ప్రవర్తిస్తున్నానా’ అని ప్రతి మనిషీ తన ప్రవర్తనను తాను పరిశీలించుకుంటూ ఉండాలి. ఆ పరిశీలన మనిషిని సత్పురుషుణ్ణి చెయ్యగలిగితే అప్పుడది సమాజానికి హితం ఔతుంది. ఆ పరిశీలనతో మనిషి సత్పురుషత్వాన్ని పొందగలిగితే గొప్ప. అలా కాని పక్షంలో పశుత్వాన్నైనా తనంతతాను వదిలించుకోవాలి. అంతటా అందరూ సుఖులై ఉండాలి, అందరూ రోగాలు లేనివాళ్లై ఉండాలి, అందరూ భద్రంగా ఉండాలి, ఏ ఒక్కరూ దుఃఖాన్ని పొందకుండా ఉండాలి అన్న ఆకాంక్ష ఒక పూర్వ శ్లోకం ‘సర్వత్ర సుఖిన స్సంతు సర్వే సంతు నిరామయాః / సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చి ద్దుఃఖభాగ్భవేత్‘ ద్వారా మనలో చాల కాలంగా ఉంది. ఈ ఆకాంక్ష సాకారమవాలంటే ప్రతి మనిషీ తన ప్రవర్తనను తాను పరిశీలించుకుంటూండాలి. రండి, ఒక అభ్యాసంగా, ఒక అలవాటుగా మనం మన ప్రవర్తనను పరిశీలించుకుంటూ ప్రశాంతతను సాధించుకుందాం. జీవితంలో నీవు ఎవరిని కలవాలన్నదికాలం నిర్ణయిస్తుంది. నీకెవరు కావాలన్నది హృదయం నిర్ణయిస్తుంది. కానీ నీ దగ్గర ఎవరుండాలనేది నిర్ణయించేది నీ ప్రవర్తన మాత్రమే. తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తే పిల్లలూ అలాగే ప్రవర్తిస్తారు. తల్లిదండ్రుల ప్రవర్తన బాగుండాలంటే తల్లిదండ్రులు తమ ప్రవర్తన గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. – రోచిష్మాన్ -
హైవే పక్కన భోజనం చేసిన జగపతి బాబు..ఫోటో వైరల్
చెన్నై : ఒకప్పుడు స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న జగపతి బాబు ప్రస్తుతం విలన్ పాత్రలతో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ర్టీల నుంచి జగ్గూబాయ్‌కి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇదిలా ఉండగా జగపతి బాబు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇక ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినా సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడుతుంటారాయన. తాజాగా తమిళనాడులోని ఓ హైవే పక్కన ధాబాలో తన అసిస్టెంట్, డ్రైవర్‌తో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా అక్కడ తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'చాలా రోజుల తర్వాత ఇలా హైవే పక్కన నా డ్రైవర్ రాజు, అసిస్టెంట్ చిరూతో ఫుడ్‌ని ఆరగించాను' అంటూ జగపతి బాబు షేర్చేసిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మీ సంప్లిసిటీకి హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Jaggu Bhai (@iamjaggubhai_) -
అమలా ఏమిటీ వైరాగ్యం!
అహో అమలాపాల్ ఏమీ ఈ వైరాగ్యం? ఆశలు ఆవిరయ్యాయా? లేక ఆడంబర జీవితంపై విరక్తి కలిగిందా? లేక ఇంకేమైనా కారణం ఉందా? ఇవి నెటిజన్లు ఆమె భావాలను చూసి ఆశ్చర్యపోతూ అడుగుతున్న ప్రశ్నలు. ఏమిటీ అమలాపాల్ ఏ మంటోంది అనేగా మీ ఉత్సుకత. దక్షిణాది సినిమాలో తనకంటూ ఒక స్థానాన్ని అందుకున్న నటి అమలాపాల్. ఈ మలయాళీ బ్యూటీ నటిగా పరిచయమై ఎంత వేగంగా ఎదిగిందో, అంతే అంత కంటే వేగంగా ప్రేమలో పడిపోయింది. దైవ తిరుమగళ్, తలైవా చిత్రాల్లో నటిస్తున్న సమయంలో ఆ చిత్రాల దర్శకుడు విజయ్‌తో పరిచయం ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే వారి పెళ్లి జస్ట్ రెండేళ్లు మాత్రమే సాఫీగా సాగింది. మనస్పర్థలతో విడిపోయి, విడాకులు కూడా తీసుకున్నారు. అనంతరం మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయింది. సక్సెస్‌లను అందుకోవడంతో పాటు, వివాదాస్పద కథా చిత్రాల్లోనూ నటిస్తూ సంచలన నటిగా పేరు తెచ్చుకుంది. ఇటీవల ఆడై చిత్రంలో నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది. దీంతో దర్శకులిప్పడు క«థలను పట్టుకుని ఆమెచుట్టూ తిరుగుతున్నారు. అలాంటిది ఇప్పుడు చాలా నిరాడంబరగా జీవించడాన్ని కోరుకుంటోంది. ఆ మధ్య హిమాలయాలకు వెళ్లొచ్చింది. ఇటీవల తరచూ పాండిచ్చేరిలో గడపడానికి ఇష్టపడుతోంది. అంతే కాదు పాండిచ్చేరిలోని అరవిందర్ ఆశ్రమంలో తనకు ఎంతో మనశ్శాంతి లభిస్తోందని, ఇక్కడ తనకోసం కొత్త జీవితం ఎదురుచూస్తున్న భావన కలుగుతోందని పేర్కొంటోంది. ఇప్పుడు తనకు ఆడంబర జీవితాన్ని అనుభవించడం నచ్చడంలేదని అంటోంది. సహజమైన ప్రకృతి మధ్య జీవించాలనిపిస్తోందని చెప్పింది. అన్నట్టు ఆ మధ్య విదేశాల నుంచి కొనుగోలు చేసి వివాదాల పాలైన ఖరీదైన కారును కూడా అమలాపాల్ ఇటీవల విక్రయించేసింది. ఈ మధ్యనే హిమాలయ ప్రాంతాలను చుట్టేసి వచ్చిన అమలాపాల్ ప్రకృతిలోని సహజమైన అందాలను ఆస్వాదిస్తూ జీవించడం ఇష్టంగా ఉందని అంది. చిన్న పాటి సంచిలో కొంచెం బట్టలు తీసుకుని ఒక బృందంగా కలిసి అడవుల్లో వంటావార్పులు చేసుకుంటూ తినడానికి ఇష్టపడుతోందట. దీంతో ఈ వయసులోనే ఈ భామకు ఇంత వైరాగ్యం ఏమీటి అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. -
కోట్లున్నా.. సెకండ్ హ్యాండ్ బెంజే
ఐటీ దిగ్గజం విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీకి దాదాపు రూ. 90 వేల కోట్ల పైచిలుకు ఆస్తి ఉంది. తల్చుకుంటే కోట్లు ఖరీదు చేసే కార్లను కొనే సత్తా ఉంది. కానీ ఆయన మాత్రం అలా చేయలేదు. చేయరు. పదేళ్ల నాటి కారు మొరాయిస్తోంది .. కొత్తది కొనండి సార్ అంటూ ఇటీవలే సిబ్బంది పోరు పెట్టగా పెట్టగా ప్రేమ్‌జీ ఏం చేశారో తెలుసా? కారు కొన్నారు.. కానీ ఏ కారో తెలుసా? తన ఆఫీసులోనే పనిచేసే మరో ఉద్యోగి దగ్గర్నుంచి ఒక సెకండ్ హ్యాండ్ మెర్సిడెస్ బెంజిని ఏరి కోరి తీసుకున్నారట. ఇదీ.. వేల కోట్ల ఆస్తులున్నా ఏమాత్రం ఆర్భాటాలు ఇష్టపడని ప్రేమ్‌జీ సింప్లిసిటీ. దేశంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన ప్రేమ్‌జీ పొదుపునకు, సింప్లిసిటీకి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. ఆయన సాధ్యమైనంత వరకూ విమాన ప్రయాణాల్లో ఎకానమీ తరగతిలోనే ప్రయాణిస్తారు. ఎయిర్‌పోర్టుల్లో కంపెనీ కారు రావడం ఆలస్యమైతే ఏమాత్రం సంకోచించకుండా ఆటోలోనో లేదా బస్సులోనో కూడా వెళ్లిపోతారు. అలాగే, వ్యాపార రీత్యా పర్యటించేటప్పుడు ఫైవ్ స్టార్ హోటల్స్ కన్నా కంపెనీ గెస్ట్ హౌస్‌లలో ఉండటానికి ఇష్టపడతారు. భోజనం కూడా కంపెనీ క్యాంటీన్లోనే చేస్తారు. క్యాంటీన్లో ఆహారం ఉద్యోగులకు మంచిదైనప్పుడు.. తనకు కూడా మంచిదే కదా అని లాజిక్ తీస్తారు. ఆఖరికి కుమారుడి వివాహంలో కూడా లంచ్‌ను పేపర్ ప్లేట్లలో అందించారట. పొదుపు విషయానికొస్తే.. ఆయన అల్టిమేట్. అవసరం లేనప్పుడు లైట్లను ఆర్పేయించడం మొదలు టాయ్‌లెట్ రోల్స్ దాకా అన్నింటి విషయంలోనూ ప్రేమ్‌జీ జాగ్రత్తగా వ్యవహరిస్తారు. పెట్టుబడుల్లోనూ మేటి.. పొదుపే కాదు పెట్టుబడి విషయాల్లోనూ ప్రేమ్‌జీ ఘనాపాటి. ఇప్పటిదాకా ఆయన సుమారు 60 పైగా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు. రియల్టీ పెట్టుబడులు మొదలుకుని లిస్టెడ్ కంపెనీల దాకా అనేకం ఆయన పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. స్నాప్‌డీల్, మింత్రా, సూపర్ బజార్ల చైన్ సుభిక్ష (ప్రస్తుతం మూతబడింది) లాంటి వాటిల్లో ప్రేమ్‌జీ పెట్టుబడులు పెట్టారు. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఆయన ప్రత్యేకంగా ఫ్యామిలీ ఆఫీస్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇది దాదాపు రూ. 10,000 కోట్ల నిధులను మేనేజ్ చేస్తుంది. అవకాశాలను బట్టి పెట్టుబడులు పెడుతుంటుంది. దేశీయంగానే కాకుండా ఈ మధ్యే అమెరికా, చైనాలోని టెక్నాలజీ కంపెనీల్లోనూ ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఖర్చుల విషయంలో పీనాసితనంగా కనిపించినప్పటికీ.. డబ్బు తీయాల్సిన చోట తీయడానికి వెనుకాడరు ప్రేమ్‌జీ. అందుకే, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ఏకంగా రూ. 10,000 కోట్లు విలువ చేసే షేర్లను తన పేరిట ఏర్పాటు చేసిన ట్రస్టుకు బదలాయించారు. సేవా కార్యక్రమాల కోసం ఇంత పెద్ద మొత్తాన్ని అందించిన వితరణశీలురుల్లో ఆయన అగ్రస్థానంలో నిల్చారు.