కోట్లున్నా.. సెకండ్ హ్యాండ్ బెంజే | Millions .. Second Hand benje | Sakshi
Sakshi News home page

కోట్లున్నా.. సెకండ్ హ్యాండ్ బెంజే

Published Fri, Jul 4 2014 10:59 PM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM

కోట్లున్నా.. సెకండ్ హ్యాండ్ బెంజే

కోట్లున్నా.. సెకండ్ హ్యాండ్ బెంజే

ఐటీ దిగ్గజం విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీకి దాదాపు రూ. 90 వేల కోట్ల పైచిలుకు ఆస్తి ఉంది. తల్చుకుంటే కోట్లు ఖరీదు చేసే కార్లను కొనే సత్తా ఉంది. కానీ ఆయన మాత్రం అలా చేయలేదు. చేయరు. పదేళ్ల నాటి కారు మొరాయిస్తోంది .. కొత్తది కొనండి సార్ అంటూ ఇటీవలే సిబ్బంది పోరు పెట్టగా పెట్టగా ప్రేమ్‌జీ ఏం చేశారో తెలుసా? కారు కొన్నారు.. కానీ ఏ కారో తెలుసా? తన ఆఫీసులోనే పనిచేసే మరో ఉద్యోగి దగ్గర్నుంచి ఒక సెకండ్ హ్యాండ్ మెర్సిడెస్ బెంజిని ఏరి కోరి తీసుకున్నారట. ఇదీ.. వేల కోట్ల ఆస్తులున్నా ఏమాత్రం ఆర్భాటాలు ఇష్టపడని ప్రేమ్‌జీ సింప్లిసిటీ.
 
దేశంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన ప్రేమ్‌జీ పొదుపునకు, సింప్లిసిటీకి ఎంతో ప్రాధాన్యతను  ఇస్తారు. ఆయన సాధ్యమైనంత వరకూ విమాన ప్రయాణాల్లో ఎకానమీ తరగతిలోనే ప్రయాణిస్తారు. ఎయిర్‌పోర్టుల్లో కంపెనీ కారు రావడం ఆలస్యమైతే ఏమాత్రం సంకోచించకుండా ఆటోలోనో లేదా బస్సులోనో కూడా వెళ్లిపోతారు. అలాగే, వ్యాపార రీత్యా పర్యటించేటప్పుడు ఫైవ్ స్టార్ హోటల్స్ కన్నా కంపెనీ గెస్ట్ హౌస్‌లలో ఉండటానికి ఇష్టపడతారు. భోజనం కూడా కంపెనీ క్యాంటీన్లోనే చేస్తారు.

క్యాంటీన్లో ఆహారం ఉద్యోగులకు మంచిదైనప్పుడు.. తనకు కూడా మంచిదే కదా అని లాజిక్ తీస్తారు. ఆఖరికి కుమారుడి వివాహంలో కూడా లంచ్‌ను పేపర్ ప్లేట్లలో అందించారట. పొదుపు విషయానికొస్తే.. ఆయన అల్టిమేట్. అవసరం లేనప్పుడు లైట్లను ఆర్పేయించడం మొదలు టాయ్‌లెట్ రోల్స్ దాకా అన్నింటి విషయంలోనూ ప్రేమ్‌జీ జాగ్రత్తగా వ్యవహరిస్తారు.
 
పెట్టుబడుల్లోనూ మేటి..
 
పొదుపే కాదు పెట్టుబడి విషయాల్లోనూ ప్రేమ్‌జీ ఘనాపాటి. ఇప్పటిదాకా ఆయన సుమారు 60 పైగా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు. రియల్టీ పెట్టుబడులు మొదలుకుని లిస్టెడ్ కంపెనీల దాకా అనేకం ఆయన పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి.  స్నాప్‌డీల్, మింత్రా, సూపర్ బజార్ల చైన్ సుభిక్ష (ప్రస్తుతం మూతబడింది) లాంటి వాటిల్లో ప్రేమ్‌జీ పెట్టుబడులు పెట్టారు. ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం ఆయన ప్రత్యేకంగా ఫ్యామిలీ ఆఫీస్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇది దాదాపు రూ. 10,000 కోట్ల నిధులను మేనేజ్ చేస్తుంది. అవకాశాలను బట్టి పెట్టుబడులు పెడుతుంటుంది. దేశీయంగానే కాకుండా ఈ మధ్యే అమెరికా, చైనాలోని టెక్నాలజీ కంపెనీల్లోనూ ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది.
 
ఖర్చుల విషయంలో పీనాసితనంగా కనిపించినప్పటికీ.. డబ్బు తీయాల్సిన చోట తీయడానికి వెనుకాడరు ప్రేమ్‌జీ. అందుకే, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ఏకంగా రూ. 10,000 కోట్లు విలువ చేసే షేర్లను తన పేరిట ఏర్పాటు చేసిన ట్రస్టుకు బదలాయించారు. సేవా కార్యక్రమాల కోసం ఇంత పెద్ద మొత్తాన్ని అందించిన వితరణశీలురుల్లో ఆయన అగ్రస్థానంలో నిల్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement