singles title
-
గుడ్‌ఫెలో క్లాసిక్ స్క్వాష్ టోర్నీ విజేత అభయ్
భారత స్టార్ ప్లేయర్ అభయ్ సింగ్ తన కెరీర్లో ఎనిమిదో ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఎ) సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. కెనడాలోని టొరంటోలో జరిగిన గుడ్‌ఫెలో క్లాసిక్ టోర్నీలో అభయ్ సింగ్ విజేతగా నిలిచాడు. 40 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో 25 ఏళ్ల అభయ్ 11–7, 11–9, 11–9తో మోరిస్ డేవ్రెడ్ (వేల్స్)పై విజయం సాధించాడు. ఈ ఏడాది అభయ్కిది రెండో టైటిల్. గత నెలలో ముంబైలో జరిగిన జేఎస్‌డబ్ల్యూ విల్లింగ్డన్ టోర్నీలోనూ అభయ్ టైటిల్ గెలిచాడు. -
2017 తర్వాత మళ్లీ టైటిల్...
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ బల్గేరియా టెన్నిస్ స్టార్ దిమిత్రోవ్ తన కెరీర్లో తొమ్మిదో సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన బ్రిస్బేన్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో 32 ఏళ్ల దిమిత్రోవ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో 14వ ర్యాంకర్ దిమిత్రోవ్ 7–6 (7/5), 6–4తో 8వ ర్యాంకర్ హోల్గర్ రూనె (డెన్మార్క్)పై గెలిచి 95,340 డాలర్ల (రూ. 79 లక్షల 30 వేలు) ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడు. దిమిత్రోవ్ చివరిసారి 2017 నవంబర్ 17న ఏటీపీ ఫైనల్స్ టోర్నీ టైటిల్ నెగ్గాడు. -
చాంపియన్ శ్రీవల్లి రష్మిక
సాక్షి, హైదరాబాద్: టోర్నీ టోర్నీకీ తన ఆటతీరును మెరుగుపర్చుకుంటున్న హైదరాబాద్ టెన్నిస్ యువతార భమిడిపాటి శ్రీవల్లి రష్మిక కెరీర్లో తొలి అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. బెంగళూరులో ఆదివారం ముగిసిన మహిళల వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నీలో 21 ఏళ్ల రష్మికచాంపియన్గా అవతరించింది. గంటా 59 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో రష్మిక6–0, 4–6, 6–3తో భారత్‌కే చెందిన జీల్ దేశాయ్‌ను ఓడించింది. ప్రస్తుత జాతీయ చాంపియన్ రష్మికఈ మ్యాచ్‌లో 11 ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. విజేతగా నిలిచిన రష్మికకు 3,935 డాలర్ల ప్రైజ్‌మనీతోపాటు 50 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఫలితంగా నేడు విడుదల చేసే మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో రష్మిక 181 స్థానాలు పురోగతి సాధించి 706వ ర్యాంక్ నుంచి 525వ ర్యాంక్‌కు చేరుకుంటుంది. -
కిరణ్ జార్జికి సింగిల్స్ టైటిల్
భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ కిరణ్ జార్జి తన కెరీర్లో రెండో అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాడు. జకార్తాలో ఆదివారం ముగిసిన ఇండోనేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 టోరీ్నలో 23 ఏళ్ల కిరణ్ జార్జి విజేతగా నిలిచాడు. కేరళకు చెందిన కిరణ్ జార్జి ఫైనల్లో 21–19, 22–20తో జపాన్‌కు చెందిన ప్రపంచ 82వ ర్యాంకర్ కూ తకహాíÙపై గెలుపొందాడు. కిరణ్ జార్జికు 7,500 డాలర్ల (రూ. 6 లక్షల 22 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
జొకోవిచ్ ఖాతాలో 89వ సింగిల్స్ టైటిల్
సెర్బియా టెన్నిస్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ జొకోవిచ్ తన కెరీర్లో 89వ సింగిల్స్ టైటిల్ సాధించాడు. టెల్ అవీవ్ ఓపెన్ టోర్నీలో జొకోవిచ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–4తో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ మారిన్ సిలిచ్ (క్రొయేíÙయా)పై గెలుపొందాడు. చాంపియన్‌గా నిలిచిన జొకోవిచ్‌కు 1,44,415 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. కోటీ 17 లక్షలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
‘దశ ధీర’ నాదల్
రోమ్: మట్టికోర్టులపై తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంటూ స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ తన కెరీర్లో 88వ సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో నాదల్ చాంపియన్‌గా నిలిచాడు. 2 గంటల 49 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ నాదల్ 7–5, 1–6, 6–3తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)పై గెలుపొందాడు. 34 ఏళ్ల నాదల్ రోమ్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గడం ఇది పదోసారి కావడం విశేషం. ఈ స్పెయిన్ స్టార్ 2005, 2006, 2007, 2009, 2010, 2012, 2013, 2018, 2019లలో కూడా ఇక్కడ టైటిల్ సాధించాడు. తద్వారా ఒకే టోర్నమెంట్‌ను నాలుగుసార్లు కనీసం 10 లేదా అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన ప్లేయర్‌గా తన రికార్డును మెరుగుపర్చుకున్నాడు. నాదల్ 13 సార్లు ఫ్రెంచ్ ఓపెన్‌ను... బార్సిలోనా ఓపెన్‌ను 12 సార్లు... మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీని 11 సార్లు గెలిచాడు. ఈ విజయంతో అత్యధిక మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా జొకోవిచ్ (36 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును నాదల్ (36 టైటిల్స్) సమం చేశాడు. అంతేకాకుండా జొకోవిచ్‌తో ముఖాముఖి రికార్డులో ఆధిక్యాన్ని 28–29కి తగ్గించాడు. రోమ్ ఓపెన్ విజేత హోదాలో నాదల్కు 2,45,085 యూరోల (రూ. 2 కోట్ల 18 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రన్నరప్ జొకోవిచ్ ఖాతాలో 1,45,000 యూరోల ప్రైజ్‌మనీ (రూ. కోటీ 29 లక్షలు)తోపాటు 600 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. రోమ్ ఓపెన్‌లో జొకోవిచ్ ఐదుసార్లు విజేతగా నిలిచి, ఆరుసార్లు రన్నరప్‌తో సంతృప్తి పడ్డాడు. జొకోవిచ్‌తో జరిగిన ఫైనల్లో తొలి సెట్ హోరాహోరీగా జరిగింది. 75 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్లోని 12వ గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి నాదల్ సెట్ సొంతం చేసుకున్నాడు. అయితే రెండో సెట్లో జొకోవిచ్ దూకుడుకు నాదల్ తడబడ్డాడు. అనవసర తప్పిదాలు చేసి కేవలం ఒక గేమ్ మాత్రమే గెలిచి సెట్‌ను కోల్పోయాడు. అయితే నిర్ణాయక మూడో సెట్లో నాదల్ మళ్లీ లయలోకి వచ్చాడు. ఆరో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ ఏడో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 5–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత జొకోవిచ్ ఎనిమిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకున్నాడు. తొమ్మిదో గేమ్‌లో నాదల్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ‘ఈ టోర్నీలో నాకు అదృష్టం కూడా కలిసొచ్చింది. ముఖ్యంగా షపవలోవ్తో జరిగిన మ్యాచ్‌లో రెండుసార్లు మ్యాచ్ పాయింట్లను కాచుకొని గట్టెక్కాను. ఓవరాల్‌గా ఈ టోర్నీలో బాగా ఆడాను.’ –రాఫెల్ నాదల్ -
లక్ష్య సేన్ హ్యాట్రిక్
న్యూఢిల్లీ: ఈ సీజన్లో తన అద్భుత ఫామ్ కొనసాగిస్తూ భారత యువ షట్లర్ లక్ష్య సేన్ ‘హ్యాట్రిక్’ సాధించాడు. వరుసగా మూడో అంతర్జాతీయ టోర్నమెంట్లో సింగిల్స్ టైటిల్ గెల్చుకున్నాడు. జర్మనీలోని సార్బ్రాకెన్లో ఆదివారం ముగిసిన సార్లర్లక్స్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 టోర్నీలో ఈ ఉత్తరాఖండ్ షట్లర్ చాంపియన్‌గా నిలిచాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో లక్ష్య సేన్ 17–21, 21–18, 21–16తో వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా)పై గెలిచాడు. విజేత లక్ష్య సేన్‌కు 5,625 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ.3 లక్షల 96 వేలు)తోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టోర్నీకంటే ముందు లక్ష్యసేన్ డచ్ ఓపెన్, బెల్జియం ఓపెన్ టైటిల్స్ సాధించాడు. -
విజేత సౌరభ్ వర్మ
సాక్షి, హైదరాబాద్: జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ ఈ ఏడాది రెండో అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఆదివారం ముగిసిన హైదరాబాద్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 టోర్నమెంట్లో సౌరభ్ వర్మ పురుషుల సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. 52 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సౌరభ్ వర్మ 21–13, 14–21, 21–16తో లో కీన్ యె (సింగపూర్)పై విజయం సాధించాడు. మేలో సౌరభ్ వర్మ స్లొవేనియా ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలోనూ విజేతగా నిలిచాడు. ‘ఈ టోర్నీలో నా ప్రదర్శన పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను. పలు హోరాహోరీ మ్యాచ్‌ల్లో విజయాన్ని అందుకున్నాను. ఫైనల్లో తొలి గేమ్ గెలిచాక రెండో గేమ్‌లో ఆధిక్యంలో ఉన్న దశలో ఏకాగ్రత కోల్పోయాను. తొందరగా మ్యాచ్‌ను ముగించాలనే ఉద్దేశంతో అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాను. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో మళ్లీ వ్యూహం మార్చి ప్రత్యర్థిపై పైచేయి సాధించాను’ అని మధ్యప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల సౌరభ్ వర్మ వ్యాఖ్యానించాడు. విజేతగా నిలిచిన సౌరభ్ వర్మకు 5,625 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షల 98 వేలు)తోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మహిళల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంటకు నిరాశ ఎదురైంది. బేక్ హా నా–జుంగ్ క్యుంగ్ యున్ (దక్షిణ కొరియా) జోడీతో జరిగిన ఫైనల్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప ద్వయం 17–21, 17–21తో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. రన్నరప్‌గా నిలిచిన సిక్కి–అశ్విని జోడీకి 2,850 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షలు)తోపాటు 4,680 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
అంకిత రైనాకు సింగిల్స్ టైటిల్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ క్రీడాకారిణి అంకిత రైనా 2019 సీజన్‌కు టైటిల్‌తో శుభారంభం పలికింది. సింగపూర్‌లో జరిగిన టోర్నమెంట్లో ఆమె సింగిల్స్‌లో విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయర్స్‌లో వెనుదిరిగిన ఆమె... వెంటనే సింగపూర్ టోర్నీ బరిలోకి దిగింది. ఫైనల్లో అంకిత 6–3, 6–2తో ప్రపంచ 122 ర్యాంకర్, టాప్ సీడ్ అరంటా రుస్ (నెదర్లాండ్స్)ను కంగుతినిపించింది. ఈ టోర్నీలో భారత క్రీడాకారిణి నలుగురు సీడెడ్ ప్లేయర్లకు షాకిచ్చింది. రెండో రౌండ్లో ఎనిమిదో సీడ్ లెస్లీ కెర్కొవ్ (నెదర్లాండ్స్), ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ సబినా షరిపొవా (ఉజ్బెకిస్తాన్), క్వార్టర్స్‌లో మూడో సీడ్ కాని పెరిన్ (స్విట్జర్లాండ్)లను కంగుతినిపించింది. టైటిల్ విజయంతో 50 రేటింగ్ పాయింట్లు పొందిన 25 ఏళ్ల అంకిత సోమవారం విడుదల చేసే డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో 168వ స్థానానికి ఎగబాకనుంది. -
రోజర్ ఫెడరర్... టైటిల్ నంబర్ 99
స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తన కెరీర్లో 99వ సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన స్విస్ ఓపెన్ టోర్నీలో అతను తొమ్మిదోసారి విజేతగా నిలిచాడు. ఫైనల్లో 37 ఏళ్ల ఫెడరర్ 7–6 (7/5), 6–4తో కోపిల్ (రొమేనియా) పై నెగ్గాడు. గతంలో ఫెడరర్ 2006, 07, 08, 10, 11, 14, 15, 2017లలో ఈ టోర్నీని గెలిచాడు. చాంపియన్ ఫెడరర్‌కు 4,27,765 యూరోలు (రూ. 3 కోట్ల 56 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఫెడరర్ మరో టైటిల్ గెలిస్తే... జిమ్మీ కానర్స్ (109 టైటిల్స్–అమెరికా) తర్వాత 100 టైటిల్స్ నెగ్గిన రెండో ప్లేయర్‌గా గుర్తింపు పొందుతాడు. -
రాహుల్ యాదవ్‌కు పురుషుల సింగిల్స్ టైటిల్
వీవీ నాథూ స్మారక అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ చిట్టబోయిన రాహుల్ యాదవ్ సింగిల్స్ టైటిల్ గెలిచాడు. పుణేలో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రాహుల్ యాదవ్ 21–14, 16–21, 21–15తో ఆలాప్ మిశ్రా (మధ్యప్రదేశ్)పై గెలుపొందాడు. ఆర్బీఐ తరఫున బరిలోకి దిగిన హైదరాబాద్ అమ్మాయి కె.మనీషా మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను సాధించింది. ఫైనల్లో మనీషా–సాన్యామ్ శుక్లా (ఎయిరిండియా) ద్వయం 22–20, 21–18తో షేక్ గౌస్ (ఆంధ్రప్రదేశ్)–పూజ (ఎయిరిండియా) జంటపై నెగ్గింది. -
అండర్-14 చాంప్ శివాని
అండర్-16లో రన్నరప్ ఐటా సూపర్ సిరీస్ టెన్నిస్ సాక్షి, హైదరాబాద్: ఐటా సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి అమినేని శివాని అండర్-14 బాలికల సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకుంది. అండర్-16 విభాగంలోనూ ఫైనల్ బరిలోకి దిగిన ఆమె రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అసోంలోని చాచల్‌లో గత ఐదు రోజులుగా జరుగుతున్న ఈ పోటీలు శుక్రవారం ముగిశాయి. అండర్-14 బాలికల సింగిల్స్ టైటిల్ పోరులో శివాని 6-0, 6-2తో మహారాష్ట్రకు చెందిన సాన్య సింగ్‌పై అలవోక విజయం సాధించింది. బాలుర ఫైనల్లో తమిళనాడు ఆటగాడు సురేశ్ 6-2, 5-7, 7-6 (8/6)తో అమిత్ బెనివాల్ (హర్యానా)పై గెలిచి విజేతగా నిలిచాడు. అండర్-16 బాలికల సింగిల్స్ ఫైనల్లో శివాని 7-5, 5-7, 6-7 (5/7)తో ప్రియాంక కలిత (అసోం) చేతిలో పోరాడి ఓడింది. బాలుర ఫైనల్లో ధ్రువ్ సునిశ్ (మహారాష్ట్ర) 6-3, 6-1తో యుగల్ బన్సాల్ (ఢిల్లీ)పై గెలిచి టైటిల్ అందుకున్నాడు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో అసోం రాష్ట్రానికి చెందిన మాజీ టెన్నిస్ ఆటగాడు ప్రశాంత దాస్ విజేతలకు బహుమతులు అందజేశారు. -
సెరెనాకు 58వ టైటిల్
బ్రిస్బేన్: కొత్త ఏడాదిలో విలియమ్స్ సిస్టర్స్ సెరెనా, వీనస్‌లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. బ్రిస్బేన్ ఓపెన్‌లో చెల్లెలు సెరెనా చాంపియన్‌గా నిలువగా... ఆక్లాండ్ క్లాసిక్ ఓపెన్ టోర్నీలో అక్క వీనస్, సెర్బియా బ్యూటీ అనా ఇవనోవిచ్ చేతిలో ఓడి రన్నరప్‌గా సరిపెట్టుకుంది. శనివారం జరిగిన ఫైనల్స్‌లో నంబర్‌వన్ సెరెనా 6-4, 7-5తో రెండో ర్యాంకర్ విక్టోరియా అజరెంకా (బెలారస్)ను ఓడించి తన కెరీర్లో 58వ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తాజా విజయంతో ఈనెల 13న ఆరంభమయ్యే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగుతానని సెరెనా పేర్కొంది. విజేతగా నిలిచిన సెరెనాకు 1,96,670 డాలర్ల (రూ. కోటీ 22 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. మూడేళ్ల తర్వాత... ఇద్దరు మాజీ నంబర్వన్ల మధ్య న్యూజిలాండ్‌లో జరిగిన ఆక్లాండ్ ఓపెన్ ఫైనల్లో ఇవనోవిచ్ 6-2, 5-7, 6-4తో వీనస్ విలియమ్స్‌పై గెలిచింది. 2011లో బాలి ఓపెన్ టైటిల్ తర్వాత ఇవనోవిచ్ ఖాతాలో చేరిన మరో టైటిల్ ఇదే కావడం గమనార్హం. అంతేకాకుండా 2008 తర్వాత వీనస్‌ను ఇవనోవిచ్ ఓడించడం ఇదే తొలిసారి. విజేతగా నిలిచిన ఇవనోవిచ్‌కు 43 వేల డాలర్లు (రూ. 26 లక్షల 76 వేలు) దక్కాయి. -
స్నేహిత్ డబుల్ ధమాకా
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో జూనియర్, సబ్ జూనియర్ బాలుర సింగిల్స్ టైటిల్‌ను స్నేహిత్(జీపీటీటీఏ) కైవసం చేసుకున్నాడు. స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల్లో గురువారం జరిగిన సబ్ జూనియర్ బాలుర సింగిల్స్ ఫైనల్లో స్నేహిత్ 10-12, 1-9, 11-5, 8-11, 14-12, 11-8 స్కోరుతో హర్ష్ లోహిత్ (వైఎంసీఏ)పై విజయం సాధించాడు. జూనియర్ బాలుర సింగిల్స్ ఫైనల్లో స్నేహిత్ 11-8, 12-10, 4-11, 9-11, 8-11తో హర్ష్ లోహిత్‌పై నెగ్గాడు. ఇతర ఫలితాలిలా ఉన్నాయి... పురుషుల సింగిల్స్: 1.పి.విఘ్నయ్ రెడ్డి (ఆర్బీఐ), 2.గౌతమ్ కృష్ణ (ఆవా). యూత్ బాలుర సింగిల్స్: 1.టి.సాయి ప్రణీత్ (విజయవాడ), 2.గౌతమ్ కృష్ణ (ఆవా). మహిళల సింగిల్స్: 1.నిఖత్ బాను (జీఎస్ఎం), 2.శ్రీజ (జీటీటీఏ). జూనియర్ బాలికల సింగిల్స్: 1.నైనా (ఎల్బీ స్టేడియం), 2.శ్రీజ (జీటీటీఏ). సబ్ జూనియర్ బాలికల సింగిల్స్: 1.శైలునూర్ బాషా (విజయవాడ). 2.కె.వి.వి.వైశాలి. -
రుత్విక, బాలు మహేంద్రలకు టైటిల్స్
జింఖానా, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండర్-19 బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ బాలికల సింగిల్స్ టైటిల్‌ను గద్దె రుత్విక శివాని (ఖమ్మం), బాలుర టైటిల్‌ను బాలు మహేంద్ర గెలుచుకున్నారు. తణుకులో బుధవారం ఈ పోటీలు ముగిశాయి. బాలికల ఫైనల్లో స్కోరు 15-13 ఉన్న దశలో రుత్విక ప్రత్యర్థి, టాప్‌సీడ్ రితుపర్ణదాస్ మ్యాచ్ నుంచి తప్పుకుంది. దీంతో రెండోసీడ్ రుత్వికను విజేతగా ప్రకటించారు. సెమీఫైనల్స్‌లో రుత్విక 21-13, 21-15తో శ్రీ కృష్ణప్రియ (హైదరాబాద్)పై; రితుపర్ణదాస్ 20-22, 21-19, 21-11తో వృశాలి (రంగారెడ్డి)పై విజయం సాధించారు. బాలుర ఫైనల్లో రెండోసీడ్ బాలు మహేంద్ర (విశాఖపట్నం) 21-9, 20-11, 21-10తో అనీత్ కుమార్ (రంగారెడ్డి)పై నెగ్గాడు. సెమీఫైనల్స్‌లో బాలు మహేంద్ర 21-9, 21-18తో కిరణ్ కుమార్ (రంగారెడ్డి)పై; అనీత్ కుమార్ 21-18, 8-21, 21-5తో చంద్రకుమార్ (తూర్పు గోదావరి)పై విజయం సాధించారు. బాలికల డబుల్స్‌లో మేఘన-రితుపర్ణదాస్ జోడి 21-15, 21-19తో పూజ-సోనికా సాయిలపై గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. బాలుర కేటగిరీలో చైతన్య-గంగాధర్ రావు జంట 21-13, 21-16తో ఉపేందర్-అనిత్ కుమార్ జోడిని ఓడించింది. విజేతలకు భారత బ్యాడ్మింటన్ చీఫ్ పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రోఫీలను అందజేశారు.