siromani akali dal
-
Sangrur By-Poll Results: పంజాబ్‌లో ఆప్‌కు బిగ్ షాక్.. ఇది అస్సలు ఊహించలేదు!
చంఢీగడ్: పంజాబ్‌లో అధికారం దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి లోక్‌సభ ఉప ఎన్నికల్లో గట్టి షాక్ తగిలింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఖాళీ చేసిన సంగ్రూర్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలైంది. ఆదివారం వెలువడిన ఫలితాల్లో.. శిరోమణి అకాళిదల్ అభ్యర్థి సిమ్రన్ జిత్ మాన్ .. ఆప్ అభ్యర్థి గుల్మైర్‌పై 8 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. సంగ్రూర్ నుంచి వరుసగా 2014, 2019 ఎన్నికల్లో భగవంత్ ఎంపీగా గెలుపొందారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. దీంతో సీఎంగా భగవంత్ పదవీ బాధ్యతలు చేపట్టడంతో ఆయన గెలుపొందిన సంగ్రూర్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో సంగ్రూర్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా పంజాబ్‌లో గెలిచిన ఆప్ ఉపఎన్నికలో విజయం ఖాయమనుకున్నారు. కానీ అలా పంజాబ్‌లో అధికారం చేపట్టిందో లేదో.. అంతలోనే ఇలా ఓటమి పాలవడం ఆప్‌కు పెద్ద షాక్ అనే చెప్పాలి. చదవండి: మహారాష్ట్రలో ఊహించని మరో ట్విస్ట్.. రంగంలోకి దిగిన రష్మీ థాక్రే -
వామ్మో.. 94 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా పోటీ.. ఎవరో తెలుసా?
చండీగఢ్: శిరోమణి అకాలీదళ్ కురువృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ అరుదైన ఘనత సాధించారు. మన దేశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అత్యంత పెద్ద వయసు గల నాయకుడిగా ఆయన రికార్డుకెక్కారు. పంజాబ్ లోని లాంబి నియోజకవర్గం నుంచి ఆయన పోటీలో ఉన్నారు. ఐదు పర్యాయాలు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన బాదల్ 94 ఏళ్ల వయసులో తాజాగా ఎన్నికల బరిలో నిలిచారు. అంతకుముందు ఈ రికార్డు కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ పేరిట ఉండేది. 2016 ఎన్నికల్లో 92 ఏళ్ల వయసులో ఆయన పోటీ చేశారు. 75 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన ప్రకాశ్ సింగ్ బాదల్‌కు ఇవి 13వ అసెంబ్లీ ఎన్నికలు. చిన్న వయసులోనే రాజకీయ రంగంలోకి ప్రవేశించిన ఆయన అనేక ఘనతలు సాధించారు. 1947లో బాదల్ గ్రామం నుంచి ఎన్నికైనప్పుడు ఆయన అతి పిన్న వయస్కుడైన సర్పంచ్. అంతేకాకుండా 1970లో అత్యంత పిన్న వయస్కుడైన సీఎం అయ్యారు. 2012లో అత్యంత వయోవృద్ధుడైన సీఎం అయ్యారు. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత కూడా సొంతం. 1970-71, 1977-80, 1997-2002, 2007-12, 2012-17 మధ్య కాలంలో పంజాబ్ సీఎంగా సేవలు అందించారు. ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. (చదవండి: భగవంత్ మాన్.. ఆప్ బూస్టర్ షాట్) తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఒకసారి మాత్రమే స్వల్ప తేడాతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు బాదల్. 1967లో గిద్దర్‌బాహాలో హర్చరణ్ సింగ్ బ్రార్ చేతిలో కేవలం 57 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. బాదల్ తొలిసారిగా 1957లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై మలౌట్ నియోజకవర్గం నుంచి గెలిచారు. తర్వాత వరుసగా ఐదుసార్లు గిద్దర్బాహా నుంచి విజయయాత్ర సాగించారు. అనంతరం లాంబి నియోజకవర్గం ఐదు పర్యాయాలు ప్రాతినిథ్యం వహించారు. తాజా ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి అతిపెద్ద అభ్యర్థిగా బరిలో నిలిచారు. (చదవండి: పంజాబ్ ఎన్నికల్లో అందరిదీ సేఫ్ గేమే!..) ప్రకాశ్ సింగ్ బాదల్ తన రాజకీయ జీవితంలో రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేయలేదు. 1962లో ఒకసారి, ఆ తర్వాత 1992లో అకాలీదళ్ ఎన్నికల్ని బహిష్కరించినప్పుడు ఆయన పోటీలో లేరు. తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన ముగ్గురు ఔత్సాహిక నాయకులతో ఈసారి బాదల్ ముఖాముఖి తలపడుతున్నారు. దివంగత మంత్రి గుర్నామ్‌సింగ్ అబుల్ఖురానా కుమారుడు జగ్పాల్ సింగ్ అబుల్ఖురానాను కాంగ్రెస్ బరిలోకి దింపింది. దివంగత ఎంపీ జగదేవ్ సింగ్ ఖుదియాన్ కుమారుడు గుర్మీత్ సింగ్ ఖుదియాన్ ఆమ్ ఆద్మీ పార్టీ పోటీలో ఉన్నారు. బీజేపీ ముక్త్సర్ జిల్లా మాజీ చీఫ్ రాకేష్ ధింగ్రాను పోటీకి నిలబెట్టింది. ఇంత వయసులోనూ బాదల్ ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కరోనా బారిన పడటంతో ఆయన ప్రచారానికి బ్రేక్ పడింది. ఒకటి రెండు రోజుల్లో ఆయన తన నియోజకవర్గానికి చేరుకోనున్నారు. బాదల్ తరపున బంధువులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. భటిండా ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ కూడా ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పర్యటించారు. కాగా, బాదల్ 2015లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. మోదీ సర్కారు తీసుకొచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020లో అవార్డును వెనక్కు ఇచ్చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈసారి రైతుల మద్దతు తమకే ఉంటుందని అకాలీదళ్ భావిస్తోంది. (చదవండి: చన్నీ వర్సెస్ సిద్ధూల మధ్య వివాదం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు) -
స్థానికం హింసాత్మకం: పార్టీ అధ్యక్షుడి కాన్వాయ్‌పై దాడి
చండీగడ్: స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పంజాబ్‌లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏకంగా ఓ పార్టీ అధ్యక్షుడి కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేశారు. దీంతో పంజాబ్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. పంజాబ్‌లోని ఫజ్లికా జిల్లా జలాలాబాద్‌లో శిరోమణి అకాలీదల్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ పర్యటనకు రాగా కాంగ్రెస్ నాయకులు అడ్డగించారు. పార్టీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి బాదల్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తకలు అకాళీదల్ పార్టీ కార్యకర్తలతో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా గుర్తుతెలియని వ్యక్తులు బాదల్ కాన్వాయ్‌పై రాళ్లు, కర్రలతో దాడులు చేశారు. దీంతో కాన్వాయ్‌లోని ఓ వాహనం తీవ్రంగా దెబ్బతింది. పరిస్థితి అదుపు తప్పడంతో వెంటనే బాదల్‌ను పక్కకు తీసుకెళ్లారు. అక్కడే ఉన్న పోలీసులు పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు గాల్లోకి కాల్పులు చేశారు. రెండు వర్గాలను చెదరగొట్టాయి. ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు భగవంత్ మన్ కూడా జలాలాబాద్ పర్యటన ఉండడంతో నిమిష నిమిషానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘర్షణల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను శిరోమణి అకాలీదళ్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనను నిరసిస్తూ చౌరస్తాలో బాదల్ తన అనుచరులతో ధర్నా చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే అకాలీదళ్ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తిప్పి కొట్టింది. ఈ ఘటనకు సుఖ్బీర్ సింగ్ బాదల్ బాధ్యత వహించాలని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. -
ఎన్డీఏ పక్షాల ఐక్యతకు పిలుపు..
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు తమ మధ్య విభేదాలను పక్కనపెట్టి విపక్షాలకు దీటుగా వ్యవహరించాలని శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ పిలుపు ఇచ్చారు. బీజేపీ చీఫ్ అమిత్ షాతో భేటీ అనంతరం బాదల్ మీడియాతో మాట్లాడుతూ పాలక పార్టీకి తమ పార్టీ శాశ్వత మిత్రపక్షంగా ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీ, అకాలీ దళ్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చిచెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు తమ మధ్య విభేదాలను పక్కనపెట్టి విపక్షాలపై పోరాడాల్సిన అవసరం ఉందని బాదల్ వ్యాఖ్యానించారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల సన్నాహాల నేపథ్యంలో బీజేపీ చీఫ్ అమిత్ షా మిత్రపక్షాలతో పాటు పలువురు సెలబ్రిటీలు, ఆయా రంగాల్లో దిగ్గజాలను కలుస్తూ నాలుగేళ్ల మోదీ హయాంలో సాధించిన విజయాలను వివరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా అమిత్ షా బుధవారం ముంబయిలో శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రేతో భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో తమతో కలిసి పోటీ చేసేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా థాక్రేను షా కోరారు. ఇరువురు నేతల మధ్య సమావేశం ఫలవంతమైందని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఉప ఎన్నికల ఫలితాలతో పాటు ప్రభుత్వంపై విపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న క్రమంలో బీజేపీ అగ్రనేతల వైఖరిలో మార్పునకు ఈ భేటీలు సంకేతమని భావిస్తున్నారు. -
‘హోదాకు మద్దతిస్తాం.. కానీ..’
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పూర్తి మద్దతు ఇస్తామని శిరోమణి అకాలీదళ్ తెలిపింది. అయితే బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి తమ మద్దతు ఉండదని ఆ పార్టీ పార్లమెంట్ సభ్యుడు ప్రేమ్‌సింగ్ స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఎన్డీఏ సర్కార్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్‌సభ ముందుకు రాకముందే సభ మంగళవారానికి వాయిదా పడింది. విపక్ష సభ్యులు నిరసనలు తెలుపుతూ.. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నిరసనలు వ్యక్తం చేశారు. గందరగోళ పరిస్థితుల్లో సభ నడపడం సాధ్యం కాదంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేశారు. హోదా కోసం అలుపెరుగని పోరు చేపట్టిన వైఎస్సార్సీపీ ఎంపీలు మాత్రం ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా వెళతామని పోరు కొనసాగిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం చర్చకు చేపట్టేలా పట్టుపడుతున్నారు. -
‘శిరోమణి’ నేత కుమారుడి అరెస్టు
సోదరుడిని ముంచిన కేసులో కటకటాల్లోకి నేడో-రేపో నగరానికి తరలించే అవకాశం సాక్షి, హైదరాబాద్: పంజాబ్‌కు చెందిన రాజకీయ పార్టీ శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ) సివిల్ లైన్స్ సర్కిల్ అధ్యక్షుడు సురేందర్ బన్సాల్ కుమారుడు సందీప్‌ను హైదరాబాద్ పోలీసులు గురువారం అక్కడి బటాలాలో అరెస్టు చేశారు. నగరంలో నివసిస్తున్న సురేందర్ సోదరుడు ప్రబోధ్ బన్సాల్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. తన సోదరుడైన సురేందర్, ఆయన కుమారులు అమిత్, సందీప్‌లు కుట్రపన్ని బోగస్ సంతకాలతో తనకు సంబంధించిన రూ.1.7 కోట్ల షేర్లు కాజేశారనేది ప్రబోధ్ ఆరోపణ. దీనిపై వారిని ప్రశ్నించగా తనపై దాడి చేశారనీ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు వివిధ సెక్షన్ల కింద నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా తమ ఎదుట హాజరుకావాలని గతంలోనే అనేకసార్లు పోలీసులు ముగ్గురు నిందితుల్నీ కోరారు. వారి నుంచి స్పందన లేకపోవడంతో గురువారం బటాలా చేరుకున్న ప్రత్యేక బృందం సురేందర్ ఇంటిపై దాడి చేసింది. మిగిలిన ఇద్దరూ తప్పించుకోగా సందీప్ పోలీసులకు చిక్కాడు. స్థానిక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అమిత్ సింగ్ ఎదుట నిందితుడిని ప్రవేశపెట్టిన స్పెషల్ టీమ్ అతడిని హైదరాబాద్ తరలించేందుకు ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్ పొందింది. శుక్ర-శనివారాల్లో సందీప్‌ను సిటీకి తీసుకువచ్చి స్థానిక కోర్టులో హాజరుపర్చనున్నారు.