slab collapse
-
బైక్ హెల్మెట్ ధరించి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్.. ఎందుకంటే..
భువనేశ్వర్: ఒడిశాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక డాక్టర్ హెల్మెట్ ధరించి పేషేంట్లకు ట్రీట్మెంట్ ఇస్తూ కనిపించారు. అంతకుముందు రోజున ఆ హాస్పిటల్ పైకప్పు నుండి పెళ్లలు ఊడి పడటమే అందుక్కారణమని చెబుతున్నారు అక్కడి సిబ్బంది. ఒడిశా బాలంగిర్ జిల్లా దండముండ హాస్పిటల్లో స్లాబు పెచ్చులు పెచ్చులుగా ఊడి కింద పడుతోంది. ఇదే ఆసుపత్రిలో కాంపౌండరుగా పనిచేస్తోన్న సుమంత నాయక్ సోమవారం పెద్ద ప్రమాదం నుండే తప్పించుకున్నాడు. ఖప్రాకోల్ బ్లాకులో విధులు నిర్వర్తిస్తుండగా తన పక్కన హఠాత్తుగా పైనుండి పెచ్చులు ఊడి పడ్డాయని తెలిపాడు. మెడికల్ వార్డులో తనతోపాటు మరికొంతమంది పేషేంట్లు ఉండగా ఈ సంఘటన జరిగిందని అదృష్టవశాత్తు తమకు ఏమీ కాలేదని, అందుకే బైక్ హెల్మెట్ ధరించే డ్యూటీకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అతడిలాగే ఆసుపత్రి సిబ్బందిలో చాలా మంది భయంతో హెల్మెట్లు ధరించి విధులకు హాజరయ్యారు. వారితోపాటే ఈ డాక్టర్ కూడా హెల్మెట్ ధరించుకుని పేషేంట్లకు ట్రీట్మెంట్ చేస్తూ దర్శనమిచ్చారు. ఆయన కూర్చున్న పైభాగంలో కూడా స్లాబు పెచ్చు ఊడిపోయిన దృశ్యం వీడియోలో చూడవచ్చు. ఇక్కడే ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తోన్న బాలకృష్ణ పురోహిత్ మాట్లాడుతూ.. సరైన మెయింటెనెన్స్ లేక బిల్డింగ్ శిథిలావస్థకు వచ్చిందని పై అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని, ఇదే నిర్లక్ష్యం కొనసాగితే రాను రాను మరింత ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొంటాయని అన్నారు. ఇక్కడి సిబ్బంది మాట్లాడుతూ ఐదేళ్ల క్రితమే నిర్మించిన అవుట్ పేషేంట్ వార్డులో పరిస్థితి మరీ దారుణంగా ఉందని.. నాసిరకమైన నిర్మాణం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇది కూడా చదవండి: అజిత్ పవార్ కట్టప్ప - శరద్ పవార్ బాహుబలి As seen in the infrastructural realities of rural #Odisha A doctor is shown treating patients inside a medical facility in Bolangir while donning a helmet out of fear of falling concrete from the floor. Numerous issues need to be brought up, but because to babus' carelessness,… pic.twitter.com/sA40Wc3Q1q — Sashmita Behera (@incsashmita) July 6, 2023 -
కుప్పకూలిన బతుకులు
భాగ్యనగర్‌కాలనీ (హైదరాబాద్): కూకట్‌పల్లిలో ఓ భవనం నాలుగో అంతస్తు స్లాబ్ నిర్మాణం అలా జరిగిందో లేదో.. ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో మూడో అంతస్తు సైతం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. భవనం స్లాబ్‌లు పెద్దశబ్ధంతో కూలడంతో చుట్టుపక్కలవారు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి గ్రామంలో మూడు అంతస్తుల నిర్మాణం జరిగిన ఓ భవనంపై శనివారం నాలుగో అంతస్తు స్లాబ్ వేశారు. అయితే స్లాబ్ పూర్తి అయిన కొద్ది సేపటికి ఊతంగా కట్టిన కర్రల తాడును కూలీలు తీస్తుండగా ఒక్కసారిగా నాలుగో అంతస్తు శ్లాబ్ కూలిపోయింది. ఆ సమయంలో స్లాబ్‌పై ఉన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన దయాశంకర్ (25), ఆనంద్ (23) అనే ఇద్దరు కార్మికులు శిథిలాల కింద పడి అక్కడడిక్కడే మృతి చెందారు. స్లాబ్ కూలిన సమయంలో అక్కడే ఉన్న భవన యజమాని లక్ష్మణ్‌రావుకు తలపై గాయం కావటంతో వెంటనే ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వాసు అనే మరో వ్యక్తికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. భవనం కూలిన విషయం తెలుసుకున్న కూకట్పల్లి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బందికి వారు సమాచారం ఇవ్వడంతో ఆయా విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకోగా సకాలంలో అధికారులు చేరుకున్నప్పటికీ సహాయక చర్యలు చేపట్టడంలో ఆలస్యం చోటుచేసుకుంది. శిథిలాల కింద సాయంత్రం 5.30 గంటలకు మృతి చెందిన వారిలో ఒకరి చేయి బయటకు కనిపించింది. దీంతో స్లాబ్‌కు వాడిన ఇనుప చువ్వలను కట్ చేసి, సిమెంట్ పెచ్చులను తొలగించి అతికష్టంమీద రాత్రి కల్లా రెండు మృతదేహాలను వెలికి తీశారు. ఈ భవనానికి రెండు అంతస్తులకు అనుమతులు తీసుకొని నాలుగు అంతస్తుల నిర్మాణం చేపట్టినట్లు సమాచారం. మృతులు ఇద్దరికీ వివాహాలు కాగా బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ‘సెంట్రింగ్’ లోపమే కారణమా? భవన స్లాబ్ నిర్మాణ సమయంలో సెంట్రింగ్ పనులు సరిగా చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. స్లాబ్ నిర్మాణం జరిపే సమయంలో భారీగా సిమెంట్, కాంక్రీట్ మిశ్రమాన్ని పోస్తుంటారు. అయితే ఆ బరువుకు తగ్గట్లుగా సెంట్రింగ్ పనులు జరగలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. నాలుగో స్లాబ్ పరిస్థితి ఇలా ఉంటే.. మూడో స్లాబ్ కూడా కూలడంతో నాణ్యతలో డొల్ల తనం స్పష్టం తెలుస్తోంది. స్లాబ్లకు సరిగ్గా క్యూరింగ్ జరపకుండా అంతస్తులపై అంతస్తులు నిర్మించడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అనుమతులకు మించి అంతస్తులు.. వాస్తవానికి జీహెచ్ఎంసీ నుంచి భవనం యజమాని జీ ప్లస్ 2 నిర్మాణానికి అనుమతి పొందినట్లు సమాచారం. అయితే అంతకుమించి 3, 4 అంతస్తులను అక్రమంగా నిర్మాణం ని ర్మించారు. ముందుగానే అధికారులు అడ్డుకుని ఉంటే ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసేవి కావని స్థానికులు అంటున్నారు. క్రిమినల్ కేసులు పెడతాం: డీసీ రవీందర్‌కుమార్ ఈ ఘటనపై జీహెచ్ఎంసీ కూకట్పల్లి డిప్యూటీ కమిషనర్ రవీందర్‌కుమార్ స్పందించారు. ముందుగా తీసుకున్న అనుమతులకు మించి అదనపు అంతస్తులు వేయడంతో.. ప్రమాదానికి కారణమైన భవన యజమాని, ఆర్కిటెక్ట్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా అనుమతికి మించి అంతస్తులు నిర్మించినందుకు భవన యజమానికి జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఘటనా స్థలానికి ఎమ్మెల్యే మాధవరం.. స్లాబ్‌లు కూలిన భవనాన్ని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణలు పరిశీలించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. -
కుప్పకూలిన స్లాబ్: ఐదుగురికి తీవ్రగాయాలు
ఎర్రగుంట్ల (వైఎస్సార్ జిల్లా) : ఎర్రగుంట్ల మండల ఏరువాక వీధిలో నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కుప్ప కూలిపోవడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటి పైభాగంలో నిర్మాణ పనులకు గాను ఇసుకను తీసుకెళుతున్న క్రమంలో స్లాబ్ కూలి కూలీలపై పడింది. అరుణమ్మ, కళావతి, శివకుమార్, రవి, ప్రసన్నలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న జమ్మలమడుగు వైఎస్సార్సీపీ నాయకుడు డాక్టర్ సుధీర్ రెడ్డి ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. -
పైకప్పు కూలి ఇద్దరు కూలీలు మృతి
హైదరాబాద్ : కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎన్ఎఫ్సీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం పైకప్పు కూలి ఇద్దరు కూలీలు మృతిచెందారు. ఈ దుర్ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ఏడుగురు కూలీలు కూడా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించింది. -
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్లాగ్ యార్డులో కూలిన స్లాబ్
విశాఖ : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో బుధవారం ప్రమాదం జరిగింది. కర్మాగారంలోని ఎస్ఎంఎస్ భవనంలోని ప్లాగ్ యార్డు పైకప్పు హఠాత్తుగా కూలిపోయింది. అయితే ఆ సమయంలో అక్కడ కార్మికులు ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. దీంతో ఉత్పత్తి నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు కార్మికులు తెలిపారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. యలమంచిలిలో చెరువుకు గండి పడటంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి.