ఎర్రగుంట్ల మండల ఏరువాక వీధిలో నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కుప్ప కూలిపోవడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఎర్రగుంట్ల (వైఎస్సార్ జిల్లా) : ఎర్రగుంట్ల మండల ఏరువాక వీధిలో నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కుప్ప కూలిపోవడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటి పైభాగంలో నిర్మాణ పనులకు గాను ఇసుకను తీసుకెళుతున్న క్రమంలో స్లాబ్ కూలి కూలీలపై పడింది.
అరుణమ్మ, కళావతి, శివకుమార్, రవి, ప్రసన్నలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న జమ్మలమడుగు వైఎస్సార్‌సీపీ నాయకుడు డాక్టర్ సుధీర్ రెడ్డి ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.