ఆశారాం బాపు, భక్తులు విమానంలో ఏం చేశారంటే..
తనకు తాను దేవుడిగా చెప్పుకొనే ఆశారాం బాపు, ఆయన భక్తులు జెట్ ఎయిర్వేస్ విమానంలో నానా గొడవ చేసి తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించారు. ఆశారాం బాపు జోధ్పూర్ జైలు నుంచి వైద్య పరీక్షలు చేయించుకోడానికి ఢిల్లీ బయల్దేరారు. ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఆయనకు వైద్య పరీక్షలు జరగాల్సి ఉంది.
ఆశారాం బాపు, ఆయన భక్తులు తాము ఎక్కిన జెట్ ఎయిర్ వేస్ 9డబ్ల్యు 2552 విమానంలో సీట్లలో కూర్చోమంటే కూర్చోకుండా నినాదాలు చేస్తూనే ఉన్నారని తోటి ప్రయాణికులు చెప్పారు. దీనివల్ల ఉదయం 10.30 గంటలకు బయల్దేరాల్సిన విమానం.. విపరీతంగా ఆలస్యమై, చివరకు మధ్యాహ్నం రెండు గంటలకు బయల్దేరింది. అలా బయల్దేరిన తర్వాత కూడా విమానంలో ఏసీ సరిగా పనిచేయలేదని.. దాంతో తమకు ఊపిరి సరిగా ఆడలేదని ప్రయాణికులు ఫిర్యాదుచేశారు.