హెచ్ సీయూలో మరో వివాదం
హైదరాబాద్: పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్యతో అట్టుడుతున్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్ సీయూ)లో మరో వివాదం చోటుచేసుకుంది. విద్యార్థుల ఆందోళన ఉధృతమవుతుండడంతో హెచ్ సీయూలో ఇంటర్నెట్, వై ఫై నిలిపివేశారు. కంప్యూటర్, లైబ్రరీలకు తాళం వేశారు. దీని గురించి వర్సిటీ వర్గాలను విద్యార్థులు ప్రశ్నించగా ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశానుసారం ఇంటర్నెట్ తొలగించామని సమాధానం వచ్చింది.
ఆడిటోరియంకు సమీపంలో ఉన్న క్యాంపస్ నెట్ వర్క్ ఫెసిలిటీ(సీఎన్ఎఫ్) సెంటర్ ద్వారా విద్యార్థులు, సిబ్బందికి ఇంటర్నెట్, వై ఫైతో పాటు ఇతర ఐటీ సేవలు అందిస్తున్నారు. విద్యార్థుల హాస్టళ్లు, కామన్ ఏరియాలో ఇంటర్నెట్, వై ఫై నిలిపివేయాలని బుధవారం రాత్రి ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చాయని సీఎన్ఎఫ్ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. దీంతో గురువారం ఉదయం నుంచి క్యాంపస్ లో పూర్తిగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.
తమ ఆందోళన ఉధృతం కాకుండా అడ్డుకునేందుకే ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ ద్వారా విద్యార్థులు పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారని గ్రహించిన ఉన్నతాధికారులు క్యాంపస్ లో అంతర్జాలం అందుబాటులో లేకుండా చేశారు. అయితే కుయుక్తులు పన్నినా తమ పోరాటం ఆగదని విద్యార్థులు అంటున్నారు.