Snoring disease
-
ఆప్నియా... గురక నివారణ ఇలా...
మామూలు గురకకూ, ఆప్నియాకు కాస్త తేడా ఉంటుంది. అదేమిటంటే... గురక వస్తుంటే ఆప్నియా ఉన్నట్లు కాదు. కానీ... ఆప్నియా ఉంటే మాత్రం గురక తప్పక వస్తుంది. ఆప్నియా అంటే... దానివల్ల గుండెకు, మెదడుకు ఆక్సిజన్ అందకుండా పోయే ప్రమాదం ఉంది. అలా ఆక్సిజన్ అందనప్పుడల్లా... మెలకువ వచ్చేలా మెదడు దేహాన్ని ఆదేశిస్తుంటుంది. రాత్రి నాణ్యమైన నిద్ర ఉండకపోవడంతో పగలంతా జోగుతూ డల్‌గా ఉంటారు. ఈ ఆప్నియా రక్తపోటు పెరగడానికి, డయాబెటిస్ బాధితుల్లో చక్కెరలు నియంత్రణలో లేకపోవడానికీ, పక్షవాతానికీ దారితీసే ప్రమాదం ఉన్నందున దాన్ని నివారించుకోవాల్సిన అవసరముంది. ఇలా తగ్గుతుంది... మంచి జీవనశైలితో ఆప్నియాను చాలావరకు నివారించవచ్చు ∙స్థూలకాయం ఉన్నవారు ఆరోగ్యకరమైన వ్యాయామంతో బరువు తగ్గడం ∙ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు పూర్తిగా మానేయడం. -
గురకకూ... ఆప్నియాకూ తేడా ఏంటో తెలుసా?
ఇటీవల బప్పీలహరి మరణం తర్వాత స్లీప్ ఆప్నియా సమస్య గురించి చర్చ జరుగుతోంది. మెదడుకు ఆక్సిజన్ అందడంలో ఇబ్బంది ఏర్పడటం వల్ల ‘స్లీప్ ఆప్నియా’ వస్తుంది. గురక ఉన్నంత మాత్రన అది స్లీప్ ఆప్నియా కాకపోవచ్చుగానీ... స్లీప్ ఆప్నియా ఉంటే మాత్రం... అది గురకకు దారితీస్తుంది. అందువల్ల గురక వచ్చేవారు తప్పక అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఒక్కోసారి అది ప్రాణాంతకమూ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్లీప్ ఆప్నియా గురించి ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ ఈసీ వినయకుమార్‌ను అడిగి తెలుసుకుందాం. ప్రశ్న : అసలు గురక ఎందుకు/ఎలా వస్తుంది? జ: నిద్రలో మన కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి. అలాగే గొంతు కండరాలు కూడా. అలా గొంతు కండరాలు రిలాక్స్ కావడంతోనే... అవి వేలాడినట్టుగా (ఫ్లాపీగా) అయిపోతాయి. శ్వాసనాళం గొట్టంలా ఉందనుకోండి... అప్పుడు ఎలాంటి శబ్దమూ రాదు. కానీ గొంతు కండరాలు రిలాక్స్ కాగానే అవి గాలి తీసిన ట్యూబులా ముడుచుకుపోయినట్లుగా అయిపోతాయి. దాంట్లోంచి గాలి వెళ్తున్నప్పుడూ, అంగిలికి తాకినప్పుడూ.. అందులో ప్రకంపనలు కలుగుతాయి. వాటివల్లనే శబ్దం వస్తుంది. దాన్నే మనం గురక అని పిలుస్తాం. ప్రశ్న : గురకకూ, ఆప్నియాకు సంబంధమేమిటి? జ: అన్ని కండరాల్లాగే నిద్రలో గొంతు కండరాలూ వదులవుతాయి కదా. అలా మూసుకుపోయినట్లుగా ఉన్న శ్వాసనాళం నుంచి గాలి సాఫీగా వెళ్లదు. కొద్దిసేపు మాత్రమే అలా ఉంటే దాన్ని ‘హైపాప్నియా’ అంటారు. ఆ కండిషన్ పది సెకండ్లకు పైగా కొనసాగుతూ ఉంటే దాన్ని ‘ఆప్నియా’ అంటారు. ఈ కండిషన్లో వాయునాళాల్లోకి గాలి వెళ్లదు కాబట్టి... ఊపిరితిత్తులకు తగినంత ఆక్సిజన్ అందదు. పైగా అక్కడ కార్బన్ డై ఆక్సైడ్ మోతాదులు పెరగడంతో ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రశ్న : గురకకూ... ఆప్నియాకూ తేడా ఏమిటి? జ: గురక ఉన్నవారందరికీ ఆప్నియా ఉన్నట్లు కాదు. కానీ... ఆప్నియా ఉంటే మాత్రం గురక తప్పక వస్తుంది. అది ఆరోగ్యపరంగానే కాదు... కుటుంబ బంధాల్లో... ముఖ్యంగా జీవితభాగస్వామికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. చాలా సందర్భాల్లో హైపాప్నియా పెద్ద సమస్య కాబోదు. కానీ ఆప్నియా దీర్ఘకాలం పాటు కొనసాగితే... దానివల్ల గుండెకు, మెదడుకు ఆక్సిజన్ అందకుండా పోయే ప్రమాదం ఉంది. ఆక్సిజన్ అందనప్పుడల్లా బాధితులకు మెలకువ వచ్చేలా మెదడు ఆదేశిస్తూ ఉంటుంది. దాంతో రాత్రంతా నాణ్యమైన నిద్ర ఉండదు. దీన్నే ‘స్లీప్ డెఫిసిట్’ అంటారు. ఫలితంగా పగలంతా వారు జోగుతూ ఉంటారు. అంతేకాదు... రక్తపోటు పెరగడం, డయాబెటిస్ ఉన్నవాళ్లకు చక్కెరలు నియంత్రణలో లేకపోవడం, పక్షవాతం రావడం, ఆస్తమా, సీఓపీడీ జబ్బులున్నవాళ్లలో వాటి తీవ్రత పెరుగుతుంది. గుండెజబ్బులు రావడం వంటి సమస్య లొస్తాయి. అవి హార్ట్ ఫెయిల్ అయ్యే ముప్పును పెంచుతాయి. ఒక్కోసారి స్లీప్ ఆప్నియా కారణంగా వచ్చే ఈ దుష్ప్రభావాలతోనూ మృతి చెందే అవకాశాలూ ఉంటాయి. ప్రశ్న : మంచి జీవనశైలితో మెరుగవుతుందా? జ: మంచి జీవనశైలి అలవాట్లతో ఆప్నియాను చాలావరకు నివారించవచ్చు. స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గాలి. (బప్పీ లహరి స్థూలకాయం కూడా ఆయన సమస్యకు దోహదం చేసి ఉండవచ్చు). ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు పూర్తిగా మానేయాలి. తప్పనప్పుడు నిద్రపోవడానికి కనీసం నాలుగు నుంచి ఆరు గంటలకు ముందు ఆల్కహాల్ ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడదు. గురక వచ్చేవారిలో ఆల్కహాల్ తీసుకున్న తర్వాత అది ఎక్కువ కావడం జీవిత భాగస్వామికీ, కుటుంబ సభ్యులకూ స్పష్టంగా తెలుస్తుంది. ఇది ప్రమాదకరంగా పరిణమించిన దాఖలాలూ ఉన్నాయి. అందుకే ఆల్కహాల్‌ను పూర్తిగా మానేయాలి. ప్రశ్న : ఏ డాక్టర్‌ను కలవాలి? ఎప్పుడు సంప్రదించాలి? జ: వీలైనంత త్వరగా సంప్రదించడం మంచిది. అది మామూలు గురకా లేక ప్రమాదకరమైన ఆప్నియా గురకా అన్నది డాక్టర్లు కొన్ని పరీక్షల ద్వారా తెలుసుకుంటారు. గురక వచ్చేవారు పల్మనాలజిస్టులు/ స్లీప్ స్పెషలిస్టులను లేదా ఈఎన్టీ నిపుణులను సంప్రదించాలి. కారణాలు / నివారణ కొన్ని అలవాట్లు ఆప్నియాకు కారణం కావడంతో పాటు, మరిన్ని దుష్ప్రభావాలు కలిగేలా చేస్తాయి. మద్యం అలవాటు వాటిలో ముఖ్యమైనది. దాంతోపాటు పొగతాగడం, స్థూలకాయం ఆప్నియాను మరింతగా తీవ్రతరం చేస్తాయి.ఈ అలవాట్లను తప్పక మానేయాలి. ముఖ్యంగా బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ – అంటే బరువు ను ఎత్తు స్క్వేర్తో భాగిస్తే వచ్చే సంఖ్య) ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అది 27 కంటే ఎక్కువ ఉంటే స్లీప్ ఆప్నియా వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గాలి. మరీ ఎక్కువ బరువు (మార్బిడ్ ఒబేసిటీ) ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు బేరియాట్రిక్ సర్జరీకి వెళ్లడం మంచిది. చికిత్స స్లీప్ టెస్ట్‌ల తర్వాత... తీవ్రతను బట్టి, అవసరాన్ని బట్టి డాక్టర్లు ‘సీపాప్’ అంటే... ‘కంటిన్యువస్ పాజిటివ్ ఎయిర్–వే’ మెషిన్ సహాయంతో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. సమస్య తీవ్రతను బట్టి కొన్ని సందర్భాల్లో అవసరమైతే ఈఎన్టీ నిపుణుల ఆధ్వర్యంలో శస్త్రచికిత్స (వ్యూలో పాలటో ఫారింగోప్లాస్టీ – యూపీపీపీ) అవసరం కావచ్చు. -ఇ.సి వినయ కుమార్ సీనియర్ ఇఎన్‌టి సర్జన్ -
గుర్...ర్...ర్.... గురకకు చెక్ పెట్టండిలా
సాధారణంగా గాఢనిద్రలో ఉన్నప్పుడు ఒక గంట లేదా రెండు గంటల సేపు తేలికపాటి గురక అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ నిద్ర పట్టీ పట్టగానే పెద్ద శబ్దంతో గురక వస్తుంటే మాత్రం డాక్టర్ సలహా తీసుకోవాల్సిందే. సాధారణ గురక వల్ల ఇంట్లో వాళ్లకు అసౌకర్యం మినహా మరే ప్రమాదమూ ఉండదు. ఇన్ఫెక్షన్ల కారణంగా వచ్చిన గురక అయితే ఇన్ఫెక్షన్కు చికిత్స చేయించుకుంటే సరిపోతుంది. లైఫ్‌స్టైల్ మార్పుతో ఈ గురకను దూరం చేసుకోవచ్చు. సాధారణ గురక (స్నోరింగ్) ప్రమాదకరం కాదు, కానీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అయితే తేలిగ్గా తీసుకోకూడదు. ఈ కండిషన్లో గురక మధ్యలో గాలి పీల్చుకోవడం ఆగుతుంటుంది. ఇది ప్రమాదకరమైన స్థితి. దీనికి డాక్టర్‌ను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. అసలు గురక ఎందుకు వస్తుంది? గురకకు దారి తీసే కారణాలివి: ►ముక్కు మూసుకుపోయి గాలి సరఫరాకు అంతరాయం కలుగుతున్నప్పుడు గురక వస్తుంది. అయితే ఇది చాలామందిలో సీజనల్‌గానే ఉండవచ్చు. సైనస్ ఇన్ఫెక్షన్లున్నప్పుడు కూడా నాసికామార్గం నుంచి గాలి సులువుగా ఊపిరితిత్తులను చేరలేదు. అటువంటప్పుడు కూడా గాలి పీల్చుకునేటప్పుడు శబ్దం వస్తుంది. నాసల్ పాలిప్స్ కూడా గురకకు కారణం కావచ్చు. పాలిప్స్ అంటే ముక్కులోపలి గోడలకు కానీ ముక్కుదూలం వెంబడి కానీ కండరం పెరగడం. ►రోజంతా శారీరకంగా ఎక్కువగా శ్రమించి దేహం ఎక్కువ అలసటకు లోనయినప్పుడు నిద్రలోకి జారుకోగానే గొంతు, నాలుక శ్వాసకోశ వ్యవస్థతో కలిసే ప్రదేశంలో కండరాలు పూర్తిగా విశ్రాంతిదశలోకి వెళ్లిపోతుంటాయి. దాంతో గాలి ప్రయాణించాల్సిన మార్గం కుంచించుకున్నట్లు అవుతుంది. ఆల్కహాల్ ఇతర మత్తు పదార్థాలు సేవించేవారిలో కూడా ఇదే కండిషన్ ఏర్పడుతుంది. ►అధికబరువు ఉన్న వాళ్లలో బల్కీ థ్రోట్ టిష్యూస్ కండిషన్ కనిపిస్తుంది. గురకకు ఇదీ ఓ కారణమే. ►దిండు మరీ మెత్తగా ఉండి భుజాల కంటే తల దిగువగా ఉన్నప్పుడు, దిండు మరీ గట్టిగా ఎత్తుగా ఉన్నప్పుడు కూడా గాలిపీల్చుకునేటప్పుడు శబ్దం వస్తుంది. ►పిల్లల్లో కొందరికి టాన్సిల్స్, అడినాయిడ్స్ పెద్దవిగా ఉంటాయి. పిల్లల్లో గురకకు ప్రధాన కారణం ఇదే అయి ఉంటుంది. గురకను తగ్గించుకునే మార్గాల.... ►అధికబరువును తగ్గించుకోవాలి. ►దూమపానం, మద్యపానం మానేయాలి. ►వెల్లకిలా పడుకోకుండా పక్కకు ఒత్తిగిలి పడుకోవాలి. ►దిండు ఎత్తు పట్ల జాగ్రత్త (మెడ మరీ కిందకు ఉండకూడదు, మరీ ఎత్తుగానూ ఉండకూడదు, భుజాలకు సమాంతరంగా ఉండాలి) ►గురకను అరికట్టే ప్లాస్టిక్ డివైజ్ ఉంటుంది. దానిని నోట్లో పెట్టుకుంటే ఫలితం ఉంటుంది. దీనిని డాక్టర్ సలహా మేరకు ఉపయోగించాలి. పాలిప్, బల్కీ టిష్యూ వంటి సమస్యలైతే చిన్నపాటి శస్త్ర చికిత్సతో నయం చేసుకోవచ్చు. -
అశ్రద్ధ చేస్తే ప్రాణం పోతుంది
పాడి-పంట: జి.కొండూరు (కృష్ణా) : వర్షాకాలం వచ్చిందంటే చాలు... పశు పోషకులు కలవరపడుతుంటారు. ఎందుకంటే ఈ సీజన్లో పశువులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సూక్ష్మజీవుల కారణంగా గొంతువాపు, జబ్బవాపు వంటి వ్యాధులు సోకడంతో పాటు ఈగలు, దోమల దాడి కూడా పెరుగుతుంది. ఈ సమస్యలను అధిగమించేందుకు రైతులు సకాలంలో తగిన యాజమాన్య చర్యలు చేపట్టాలని, పశువులకు వైద్య చికిత్సను అందించాలని సూచిస్తున్నారు కృష్ణా జిల్లా జి.కొండూరు మండల పశు వైద్యాధికారి డాక్టర్ కె.నరసింహారావు. ఆ వివరాలు... లేత గడ్డి ప్రమాదం తొలకరి వర్షాలకు మొలిచే లేత గడ్డి మొక్కలను పశువులు ఆబగా తింటుంటాయి. అయితే ఎదిగీ ఎదగని లేత గడ్డిలో హైడ్రో సైనైడ్ అనే విష పదార్థం ఉంటుంది. ఇలాంటి గడ్డిని మేసిన 15 నిమిషాలకే పశువులో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. వెంటనే తగిన చికిత్స చేయించకపోతే పశువు మృత్యువాత పడే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు సాధ్యమైనంత వరకూ పచ్చిక బయళ్లలో పశువులకు లేత గడ్డిని అతిగా మేపకుండా ఉండడమే మంచిది. గురక వ్యాధి సోకితే... వర్షాకాలంలో పశువులకు సోకే ప్రాణాంతక వ్యాధుల్లో గొంతువాపు (గురక) ఒకటి. ముఖ్యంగా వయసులో ఉన్న గేదె జాతి పశువుల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వ్యాధి సోకిన పశువుకు అకస్మాత్తుగా అధిక జ్వరం వస్తుంది. పశువు మేత మేయదు. గొంతు పైన, మెడ కింద వాపు కన్పిస్తుంది. పశువు ఆయాసపడుతూ శ్వాస పీల్చుకుంటుంది. ఆ సమయంలో గురక శబ్దం వస్తుంది. నోరు, ముక్కు నుంచి ద్రవం కారుతుంది. పశువు వణుకుతూ ఉంటుంది. కళ్లు ఎర్రబడి నీరు కారుతుంటుంది. పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గుతుంది. వ్యాధి తీవ్రత ఎక్కువైతే పశువు ఎడతెరిపి లేకుండా దగ్గుతూ, చివరికి అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోతుంది. వ్యాధి సోకిన పశువును వెంటనే మంద నుంచి వేరు చేయాలి. దాని మలమూత్రాలను, అది తినగా మిగిలిన గడ్డిని తీసి కాల్చేయాలి. పశువుల పాక/షెడ్డును ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. వ్యాధి సోకిన పశువు మరణిస్తే ఊరికి దూరంగా తీసికెళ్లి, గొయ్యి తవ్వి, అందులో సున్నం వేసి పూడ్చేయాలి. గురక వ్యాధి లక్షణాలు కన్పించిన వెంటనే పశు వైద్యుడి సలహా మేరకు పశువుకు గ్లూకోజ్, యాంటి బయటిక్ మందు, నెప్పి నివారణ మందు ఇవ్వాలి. ఎంత త్వరగా వైద్యం చేయిస్తే పశువు అంత త్వరగా కోలుకుంటుంది. వ్యాధి ముదిరిన తర్వాత చికిత్స చేసినా ఫలితం ఉండదు. జబ్బ వాపూ ప్రమాదమే వయసులో ఉన్న ఆరోగ్యవంతమైన పశువుల్లోనూ, తెల్ల జాతి పశువుల్లోనూ జబ్బవాపు వ్యాధి ఎక్కువగా కన్పిస్తుంది. వ్యాధి సోకిన పశువు అధిక జ్వరంతో బాధపడుతుంది. మేత మేయకుండా పడుకొని ఉంటుంది. జబ్బ భాగం వాచి, నల్లగా కములుతుంది. అక్కడ కండరాలు ఉబ్బుతాయి. వాటిలో గాలి బుడగలు, నీరు చేరి పశువు తీవ్రమైన నెప్పితో బాధపడుతుంది. వాచిన చోట చేతితో తాకితే గరగరమని శబ్దం వస్తుంది. సకాలంలో వైద్యం అందకపోతే పశువు నీరసించి, చనిపోతుంది. వ్యాధి సోకిన పశువుకు పశు వైద్యుని సలహా మేరకు పెన్సిలిన్ మందు ఇవ్వాలి. నెప్పి, జ్వర నివారణ మందులతో పాటు రక్తనాళాల ద్వారా గ్లూకోజ్ ద్రావణాన్ని అందించాలి. గురక, జబ్బ వ్యాధులు సోకకుండా రైతులు ముందుగానే పశువులకు టీకాలు వేయించడం మంచిది. వ్యాధి సోకిన వెంటనే అశ్రద్ధ చేయకుండా పశు వైద్యశాలకు తీసికెళ్లి తగిన చికిత్స చేయించాలి. ఈగలు-దోమలు దాడి చేస్తే... నేల చిత్తడిగా-వాతావరణం అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో, నీరు నిల్వ ఉన్న గుంతల్లో, మురుగు నీటి కాలువల్లో ఈగలు, దోమలు ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి ఆహారం కోసం పశువులను పట్టి పీడిస్తుంటాయి. వర్షాకాలంలో వీటి తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈగలు, దోమలు పశువుల శరీరంపై వాలి రక్తాన్ని పీలుస్తాయి. వీటి తాకిడి కారణంగా పశువులు పడుకోలేవు... నిలబడలేవు. వాటిని వదిలించుకోవడానికి తోకను అటూ ఇటూ కొట్టుకుంటూ, చెవులు ఊపుతూ అసహనానికి గురవుతాయి. కడుపు నిండా మేత మేయలేవు. ఫలితంగా పశువులు రక్తహీనతకు లోనవుతాయి. ఈగలు, దోమల కాటు వల్ల పశువు శరీరంపై పుండ్లు పడతాయి. వీటి ద్వారా సూక్ష్మక్రిములు పశువు శరీరంలో ప్రవేశించి ఇతర వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గుతుంది. పశువులకు అంటువ్యాధులు వచ్చే ప్రమాదమూ ఉంది. ఏం చేయాలి? ఈగలు, దోమల నివారణకు నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో కిరోసిన్‌ను పిచికారీ చేయాలి. మురుగు నీరు చేరే చోటును, చిత్తడి ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ బ్లీచింగ్ పొడి చల్లాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో పశువుల పాకలో ఎండు పిడకలు, వేపాకుతో పొగ పెట్టాలి. వైద్యుల సలహా మేరకు పశువు శరీరంపై కీటక నాశనులను పిచికారీ చేయాలి. సాయంకాలం వేళ పశువుల శరీరంపై వేపనూనె రాయాలి. అలాగే వేపాకు, పసుపు కలిపి మెత్తగా నూరి శరీరానికి పట్టించాలి.