Social audits
-
ఆత్మలకూ... పింఛన్లు!
సామాజిక పింఛన్లను కొందరు కార్యదర్శులు సొంతానికి వాడుకుంటున్నారు. మరణించిన వారి పేరున దర్జాగా కాజేస్తూ ప్రభుత్వాన్ని మోసగిస్తున్నారు. తప్పుడు ధ్రువీకరణలతో జేబులు నింపుకుని తప్పుదారి పట్టిస్తున్నారు. జరుగుతున్న అక్రమాలు సోషల్ ఆడిట్లో బట్టబయలవుతోంది. విజయనగరం ,బలిజిపేట(పార్వతీపురం): సామాజిక పింఛన్ల పంపిణీలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. వీటిపై ఎన్ని నిబంధనలు పెట్టినా... కొందరు కార్యదర్శులు తమ పని తాము చేసుకుపోతున్నారు. గ్రామాలలో మరణించిన వారిపేరున వచ్చే పింఛన్లు ఇలా కాజేస్తున్నట్టు సోషల్‌ఆడిట్‌లో తేలింది. గ్రామస్థాయి నాయకులు వారితో కుమ్మక్కయి ఈ విధంగా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన సోషల్ ఆడిట్లో 5గ్రామాలకు చెందిన 12మంది లబ్ధిదారుల పింఛను మొత్తాలు రూ. 22వేలు ప్రతినెలా కార్యదర్శులు అథంటికేషన్‌తో స్వాహాచేసిన విషయం బట్టబయలైంది. మరణించిన వారిపేరున వచ్చే మొత్తాలను స్వాహా చేస్తున్నారని రుజువయింది. అందులో మండలంలోని పెద్దింపేటకు చెందిన ఆరుగురి పింఛన్ మొత్తం రూ. 13వేలు గ్రామ కార్యదర్శి కాజేసినట్టు తేలింది. పలగరలో 1, అంపావల్లిలో 2, వంతరాంలో 2, అరసాడలో ఒకరికి మంజూరైన మొత్తాలు ఆయాగ్రామ కార్యదర్శులు స్వాహా చేసినట్టు తేలింది. ఎన్ని మెషీన్లు వచ్చినా... రెండేళ్ల క్రితం నుంచి బయోమెట్రిక్ద్వారానే పింఛన్ల పంపిణీ సాగుతోంది. లబ్ధిదారులు వచ్చి వేలిముద్రలు వేసి వారి పింఛను తీసుకునేవారు. మంచం మీద ఉండేవారు, ఇతరత్రా రాలేనివారి వద్దకు వెళ్ళి బయోమెట్రిక్ వేయించుకుని వారికి పింఛన్ పంపిణీ చేస్తారు. వేలిముద్రలు పడక, ఐరిస్ కాక పొందలేనివారికి పంపిణీ చేసేవారే అథంటికేషన్ వేసి చెల్లించే అవకాశం కల్పించారు. అయితే ఇలా గ్రామపింఛన్ లబ్ధిదారుల మొత్తంలో 2శాతానికి మించి అథంటికేషన్ ద్వారా చెల్లించకూడదు. అథంటికేషన్తోనే అవకతవకలు జరుగుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. సకాలంలో కాని మరణ ధ్రువీకరణ మరణ ధ్రువీకరణ పత్రాలు గ్రామ కార్యదర్శులే ఇస్తారు. అంటే ఎవరు ఎప్పుడు మృతిచెందారన్నది వారికి తెలుస్తుంది. ధ్రువీకరణ పత్రాన్ని పూర్తి వివరాలతో 21రోజుల్లోగా కార్యదర్శి ఆన్లైన్ చేయాలి. అలా అయితేనే వారు పింఛన్ లబ్ధిదారులైతే ఆ మొత్తాలు ఇక వచ్చే అవకాశం ఉండదు. అయితే కొందరు కార్యదర్శులు ఈ మరణ ధ్రువీకరణను ఆన్లైన్ చేయడంలో తాత్సారం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఎంపీడీఓ వెంకటరమణ వద్ద సాక్షి ప్రస్తావించగా... మరణించినవారి పేరున వచ్చే పింఛన్లు డ్రా చేయడం నేరమనీ, అలా జరిగినట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
‘ఆసరా’పై సామాజిక తనిఖీ
నల్లగొండ : ‘ఆసరా’ పెన్షన్లలో చోటు చేసుకున్న అక్రమాలు నిగ్గుతేల్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆసరా పెన్షన్ల లబ్ధిదారుల ఎంపికలో భారీ అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఓ నిర్ధారణకు వచ్చింది. ఇటీవల ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ప్రాథమికంగా నిర్వహించిన ఇంటింటి సర్వేలో మొత్తం పింఛన్‌దారుల్లో 20 శాతం మంది అనర్హులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అన్ని జిల్లాల్లో సామాజిక తనిఖీలు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ నుంచి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులకు సంకేతాలు ఇచ్చారు. ఆస రా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోలోనే సామాజిక తనిఖీ అంశాన్ని పొ ందుపర్చారు. కానీ పథకం ప్రారంభదశలోనే దీనిని అమలు చేస్తే అన్ని వైపుల నుంచి విమ ర్శలు వస్తాయన్న అభిప్రాయంతో మొదట్లో వెనక్కి త గ్గింది. ఆసరా పెన్షన్లు బోగస్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నట్లు జిల్లా అధికారులకు ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టి...అందుకు బాధ్యులైన నలుగురు పంచాయతీ కార్యదర్శులను విధుల నుంచి తొలగించారు. కానీ ఫిర్యాదుల పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంది. గ్రామాలతో పోలిస్తే...మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లోనే భారీ అవకతవకలు జరిగినట్లు అధికారులకు సమాచారం ఉంది. జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పనితీరు అస్తవ్యస్తంగా ఉండడంతో పాటు మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా అనర్హులను కూడా ఆసరా పెన్షన్లలో చోటు కల్పించినట్లు పక్కా సమాచారం సేకరించిన అధికారులు తమ ఫోకస్ అంతా వాటిపైనే పెట్టారు. పింఛన్లు-కుటుంబాలు పెరిగాయ్... ఆసరా పెన్షన్లకు ముందు జిల్లా వ్యాప్తంగా అన్ని కేటగిరీల్లో కలుపుకుని పింఛన్‌దారులు మొత్తం 3,94,717 మంది ఉండగా...ప్రస్తుతం 4,02,509 మంది ఉన్నారు. అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో కుటుంబాల సంఖ్య 8.34 లక్షలు ఉంటే...సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఆ సంఖ్య 11.35 లక్షలకు పెరిగాయి. దీంతోపాటు నెలవారీ చెల్లిస్తున్న పింఛన్ మొత్తాన్ని రెండు వందల నుంచి వెయ్యి రూపాయలకు, వికలాంగుల పింఛన్ ఐదు వందల నుంచి రూ.1500లకు పెంచారు. పింఛదారుల్లో వికలాంగులు, కల్లుగీత కార్మికులు గతంలో ఉన్నవాటి కి మించి భారీగా పెరిగారు. సదరమ్ క్యాంపుల ద్వారా వైకల్య నిర్ధారణ పరీక్షలు చేస్తున్నప్పటికి వికలత్వాన్ని నిర్ధారించడంలో వైద్యులు అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చాయి. కనగల్, తిరుమలగిరి మండలాల్లో బోగస్ సదరమ్ సర్టిఫికెట్లు ద్వారా పింఛన్ పొందడాన్ని పసిగట్టిన అధికారులు వారిపై కేసులు కూడా నమోదు చేశారు. క ల్లు గీత కార్మికుల్లో చోటామోటా రాజకీయ నాయకులు, వృద్ధాప్య పెన్షన్‌దారుల్లో అనర్హులు ఉన్నట్లు జిల్లా అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఆసరాలో అనర్హులు ఏరివేయాలంటే సామాజిక తనిఖీ ఒక్కటే మార్గమని ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. సమగ్ర కుటుంబ సర్వే ప్రామాణికం... ఉపాధి హామీ పథకంలో అమలు చేసిన విధంగానే ఆసరా పెన్షన్లలో సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. గ్రామాలు, మున్సిపాల్టీల్లో వేర్వేరు బృందాలు పర్యటిస్తాయి. లబ్ధిదారుల జాబితా ఆధారంగా సర్వే జరుగుతుంది. సమగ్ర కుటుంబ సర్వే ప్రామాణికంగా తీసుకుని లబ్ధిదారుల దరఖాస్తుల ఆధారంగా ఇంటింటికి వెళ్లి ఆర్థిక, సామాజిక స్థితిగతులను స్వయంగా పరిశీలిస్తారు. ఈ తనిఖీలో అనర్హులు తేలినట్లయితే అందరికీ తెలిసే విధంగా బహిరంగ సభలు నిర్వహించి ఆసరా జాబితా నుంచి వారిని తొలిగిస్తారు. అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు, ఇప్పటివరకు చెల్లించిన సొమ్మును రికవరీ చేస్తారు. సామాజిక తనిఖీకి సంబంధించి పూర్తిస్థాయి విధివిధానాలు ఖరారు కావాల్సి ఉందని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరక్టర్ చిర్రా సుధాకర్ ‘సాక్షి’కి తెలిపారు. సెర్ప్ నుంచి వస్తున్న సమాచారం మేరకు ఈ నెలాఖరు నుంచి సామాజిక తనిఖీ నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. -
అర్హులు.. 6.03 లక్షలు!
- తేలిన రైతుల లెక్క - రుణమాఫీ రూ.2761.08కోట్లు - అనర్హులు 27వేల మంది - కలెక్టర్ జీడీ ప్రియదర్శిని వెల్లడి పాలమూరు : జిల్లాలో రైతు రుణమాఫీ లెక్క తేలింది. 6.03 లక్షల మంది అర్హుతసాధించినట్లు జిల్లా అధికారులు గుర్తించారు. గతకొద్ది రోజులుగా వడపోత కార్యక్రమం అనంతరం ఎట్టకేలకు ఆదివారం జాబితాను ఓ కొలిక్కితీసుకొచ్చారు. జిల్లాలో రైతుల పేర అక్రమార్కుల పేర భారీగా రుణాలు పొందారు. కొన్నిచోట్ల అధికారులే బోగస్పట్టా పాస్‌పుస్తకాలు సృష్టించి రుణాలు కాజేశారు. ఈ పరంపరలో సామాజిక తనిఖీలు పూర్తిస్థాయిలో చక్కబెట్టకుండానే రుణమాఫీ అర్హుల వడపోత ప్రక్రియ ఎట్టకేలకు పూర్తిచేశారు. ఆదివారం సాయంత్రం నాటికి 64 మండలాలకు సంబంధించిన రుణమాఫీ అర్హులు మొత్తం 6,03,026 మంది రైతులకు సంబంధించి రూ.2761,08,38,146 మాఫీ అయినట్లు జాబితాను కలెక్టర్ జీడీ ప్రియదర్శిని విడుదల చేశారు. ముందుగా సిద్ధం చేసిన జాబితాలో నుంచి రుణమాఫీకి అనర్హులుగా 27వేల మంది రైతులను నిర్ధారించడంతో జిల్లాలో రుణమాఫీ మొత్తంలో నుంచి రూ.200 కోట్లు తగ్గింది. రుణమాఫీ కింద అధికారులు మొదట తయారుచేసిన జాబితాకు, రెండోసారి రూపొందించిన జాబితాకు మధ్య భారీ వ్యత్యాసం కనిపించింది. బ్యాంకర్లు ఇచ్చిన నివేదికలో రూ.2,906.71కోట్ల రుణమాఫీకి జాబితా సమర్పించారు. 6,31,286 మంది రైతులు రూ.లక్షలోపు రుణమాఫీ జాబితాలో ఉన్నట్లు తెలిపారు. బ్యాంకులు ఇచ్చిన జాబితా ప్రకారం రెవెన్యూ యంత్రాంగం ఓ కమిటీని ఏర్పాటుచేసి గ్రామాల్లో పరిశీలన చేపట్టింది. ఈ సందర్భంగా సాగుచేయకుండా అక్రమ పద్ధతుల్లో రుణం పొందిన వారు వెలుగులోకి వచ్చారు. తుదిజాబితా ప్రకారం 6,03,026 మంది రైతులు అర్హులుగా నిర్ణయించడంతో ప్రస్తుతం రూ.2761.08కోట్లు మాఫీ చేయనున్నారు. దీన్నికూడా పూర్తిస్థాయిలో పరిశీలన జరపాలని రైతులు, రైతుసంఘాల నేతలు కోరుతున్నారు.