అర్హులు.. 6.03 లక్షలు!
- తేలిన రైతుల లెక్క
- రుణమాఫీ రూ.2761.08కోట్లు
- అనర్హులు 27వేల మంది
- కలెక్టర్ జీడీ ప్రియదర్శిని వెల్లడి
పాలమూరు : జిల్లాలో రైతు రుణమాఫీ లెక్క తేలింది. 6.03 లక్షల మంది అర్హుతసాధించినట్లు జిల్లా అధికారులు గుర్తించారు. గతకొద్ది రోజులుగా వడపోత కార్యక్రమం అనంతరం ఎట్టకేలకు ఆదివారం జాబితాను ఓ కొలిక్కితీసుకొచ్చారు. జిల్లాలో రైతుల పేర అక్రమార్కుల పేర భారీగా రుణాలు పొందారు. కొన్నిచోట్ల అధికారులే బోగస్‌పట్టా పాస్‌పుస్తకాలు సృష్టించి రుణాలు కాజేశారు. ఈ పరంపరలో సామాజిక తనిఖీలు పూర్తిస్థాయిలో చక్కబెట్టకుండానే రుణమాఫీ అర్హుల వడపోత ప్రక్రియ ఎట్టకేలకు పూర్తిచేశారు. ఆదివారం సాయంత్రం నాటికి 64 మండలాలకు సంబంధించిన రుణమాఫీ అర్హులు మొత్తం 6,03,026 మంది రైతులకు సంబంధించి రూ.2761,08,38,146 మాఫీ అయినట్లు జాబితాను కలెక్టర్ జీడీ ప్రియదర్శిని విడుదల చేశారు. ముందుగా సిద్ధం చేసిన జాబితాలో నుంచి రుణమాఫీకి అనర్హులుగా 27వేల మంది రైతులను నిర్ధారించడంతో జిల్లాలో రుణమాఫీ మొత్తంలో నుంచి
రూ.200 కోట్లు తగ్గింది.
రుణమాఫీ కింద అధికారులు మొదట తయారుచేసిన జాబితాకు, రెండోసారి రూపొందించిన జాబితాకు మధ్య భారీ వ్యత్యాసం కనిపించింది. బ్యాంకర్లు ఇచ్చిన నివేదికలో రూ.2,906.71కోట్ల రుణమాఫీకి జాబితా సమర్పించారు. 6,31,286 మంది రైతులు రూ.లక్షలోపు రుణమాఫీ జాబితాలో ఉన్నట్లు తెలిపారు. బ్యాంకులు ఇచ్చిన జాబితా ప్రకారం రెవెన్యూ యంత్రాంగం ఓ కమిటీని ఏర్పాటుచేసి గ్రామాల్లో పరిశీలన చేపట్టింది. ఈ సందర్భంగా సాగుచేయకుండా అక్రమ పద్ధతుల్లో రుణం పొందిన వారు వెలుగులోకి వచ్చారు. తుదిజాబితా ప్రకారం 6,03,026 మంది రైతులు అర్హులుగా నిర్ణయించడంతో ప్రస్తుతం రూ.2761.08కోట్లు మాఫీ చేయనున్నారు. దీన్నికూడా పూర్తిస్థాయిలో పరిశీలన జరపాలని రైతులు, రైతుసంఘాల నేతలు కోరుతున్నారు.