softball championship
-
‘వండర్’ వరలక్ష్మి.. సాఫ్ట్‌బాల్ క్రీడలో సత్తా చాటుతున్న సిక్కోలు విద్యార్థిని
శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు విద్యార్థిని కూటికుప్పల వరలక్ష్మి సాఫ్ట్‌బాల్‌లో అంచలంచెలుగా ఎదుగుతూ సంచలనాలు సృష్టిస్తోంది. రాష్ట్ర, జాతీయస్థాయిలో పతకాలు సాధిస్తూ సత్తా చాటుతోంది. తాజాగా ఏసియన్ యూనివర్సిటీ మహిళల(సీనియర్స్) సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్–2022 పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ పోటీలు డిసెంబర్ 17 నుంచి 21 వరకు బ్యాంకాక్‌లో జరగనున్నాయి. త్వరలో భారత జట్టు సభ్యులతో కలిసి ఆమె శిక్షణ తీసుకోనుంది. కొత్తవలస నుంచి బ్యాంకాక్‌కు.. వరలక్ష్మి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని కొత్తవలస. ఆమె తల్లిదండ్రులు కూటికుప్పల రాజు, భారతి దినసరి కూలీలు. పనికి వెళ్తే తప్ప పూట గడవని పరిస్థితి. తొగరాంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 6వ తరగతి చదువుతున్న సమయంలో వరలక్ష్మి సాఫ్ట్‌బాల్ క్రీడపై ఆసక్తి కనబరిచింది. అక్కడి ఫిజికల్ డైరెక్టర్ మొజ్జాడ వెంకటరమణ ఆమెకు సాఫ్ట్‌బాల్ క్రీడలో శిక్షణ ఇచ్చి ప్రోత్సహించారు. దీంతో ఆమె జిల్లా స్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరిచి.. రాష్ట్రస్థాయికి ఎంపికైంది. సాఫ్ట్‌బాల్ క్రీడలో పిక్చర్(బౌలింగ్) చేయడంలో వరలక్ష్మి దిట్ట. 2012లో అనంతపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో మొదటిసారి పాల్గొన్న వరలక్ష్మి తన అద్భుత ఆటతీరుతో.. జాతీయ పోటీలకు ఎంపికైంది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. తాను పాల్గొన్న ప్రతి పోటీలోను రాణించింది. 2019–20లో రాజస్తాన్‌లో జరిగిన సౌత్‌జోన్ సీనియర్ నేషనల్స్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో వరలక్ష్మి ప్రాతినిథ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ జట్టు రజత పతకం సాధించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో యానాంలో జరిగిన ఆసియా కప్ సెలెక్షన్స్‌లో కూడా పాల్గొని ప్రతిభ కనబరిచి ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకుంది. వీరికి మధ్యప్రదేశ్‌లో శిక్షణా శిబిరం నిర్వహించగా.. వరలక్ష్మి సత్తా చాటి బ్యాంకాక్‌లో జరిగే ఏసియన్ యూనివర్సిటీ మహిళల సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలో పాల్గొనే భారత జట్టుకు ఎంపికయ్యింది. వరలక్ష్మి మరోవైపు చదువులోనూ ప్రతిభ కనబరుస్తోంది. తొగరాం ప్రభుత్వ జూనియర్ కాలేజీలోనే ఇంటర్ పూర్తిచేసిన ఆమె.. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని రాయలసీమ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ కాలేజీలో డిప్లమో ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ప్రతిభకు పేదరికం ఏ మాత్రం అడ్డుకాదని వరలక్ష్మి నిరూపిస్తోందని గ్రామస్తులు, పలువురు ప్రముఖులు ప్రశంసించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. మాది నిరుపేద కుటుంబం. మా అమ్మ, నాన్న కూలి పనులకు వెళ్తుంటారు. మా అమ్మా, నాన్నతో పాటు మా గురువు, పీడీ వెంకటరమణ ప్రోత్సాహం వల్లే నేను ఆటలో ముందుకెళ్లా. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. జాతీయ సీనియర్ జట్టుకు ఎంపిక కావడమే నా లక్ష్యం. – కూటికుప్పల వరలక్ష్మి, సాఫ్ట్‌బాల్ క్రీడాకారిణి -
క్రీడాకారులు జాతీయ పతాకంతో సమానం
శ్రీకాకుళం న్యూకాలనీ: క్రీడాకారులు జాతీయ పతాకంతో సమానంగా సరితూగుతారని, వారికి ఎనలేని ఆత్మాభిమానం ఉంటుందని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం శ్రీకాకుళంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో 9వ ఏపీ రాష్ట్ర సీనియర్స్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్–2022 పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్పీకర్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీ ఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ క్రీడాపోటీల నిర్వహణకు ప్రభుత్వాలతోపాటు దాతలు కూడా సహకరిస్తే మరింత విజయవంతం అవుతాయన్నారు. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ కలిదిండి నరసింహరాజు, కన్వీనర్ వెంకటరామరాజు, సీఈవో సి.వెంకటేషులు, నిర్వహణ కమిటీ సభ్యులు ఎం.వి.రమణ, హరిధరరావు, లక్ష్మీదేవి, వైఎస్సార్సీపీ నాయకుడు చౌదరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
సాఫ్ట్‌బాల్ చాంపియన్ షిప్ విజేత తెలంగాణ..
భువనేశ్వర్: కటక్‌లో జరిగిన జాతీయ సాఫ్ట్‌బాల్ చాంపియన్ షిప్లో తెలంగాణ బాలికల జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో తెలంగాణ 2–0తో మధ్యప్రదేశ్‌ను ఓడించింది. ఈ జట్టులో ఎక్కువ మంది తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీకి చెందిన అమ్మాయిలే ఉన్నారు. విజేతగా నిలిచిన జట్టుకు టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి రొనాల్డ్ రోస్ అభినందించారు. చదవండి: SRH Vs DC: ఐదేళ్ల తర్వాత మళ్లీ డకౌట్.. -
ప్రిక్వార్టర్స్‌లో తెలంగాణ జట్లు
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నీలో తెలంగాణ పురుషులు, మహిళల జట్లు ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరుగుతోన్న ఈ టోరీ్నలో బుధవారం ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ తెలంగాణ జట్లు గెలుపొందాయి. మహిళల తొలి మ్యాచ్‌లో తెలంగాణ 8–0తో మణిపూర్‌పై, రెండో మ్యాచ్ లో 3–2తో రాజస్తాన్‌పై గెలిచాయి. పురుషుల విభాగంలో తెలంగాణ 10–0తో పశ్చిమ బెంగాల్‌ను ఓడించింది. ఇతర పురుషుల మ్యాచ్‌ల్లో ఛత్తీస్‌గఢ్ 4–0తో కేరళపై, చండీగఢ్ 4–3తో రాజస్తాన్‌పై, పంజాబ్ 9–0తో కర్ణాటకపై, మహారాష్ట్ర 15–0తో పాండిచ్చేరిపై, మధ్యప్రదేశ్ 10–0తో ఉత్తరప్రదేశ్‌పై, జమ్మూ కశీ్మర్ 10–0తో పాండిచ్చేరిపై, హరియాణా 6–4తో తమిళనాడుపై గెలుపొందాయి. మహిళల మ్యాచ్‌ల్లో ఢిల్లీ 10–0తో తమిళనాడుపై, పంజాబ్ 15–0తో ఒడిశాపై, ఛత్తీస్‌గఢ్ 10–0తో కర్ణాటకపై, ఆంధ్రప్రదేశ్ 6–2తో కేరళపై నెగ్గాయి. -
తెలంగాణ ముందంజ
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ పురుషుల జట్టు ముందంజ వేసింది. ఆంధ్రప్రదేశ్ వేదికగా మంగళవారం జరిగిన పురుషుల తొలి మ్యాచ్‌లో తెలంగాణ 8–3తో బిహార్‌పై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో ఢిల్లీ 3–1తో ఆంధ్రప్రదేశ్‌ను ఓడించగా... ఛత్తీస్‌గఢ్ 2–0తో కేరళపై, మహారాష్ట్ర 12–0తో పాండిచ్చేరిపై గెలుపొందాయి. మహిళల విభాగంలో మహారాష్ట్ర 8–0తో రాజస్తాన్‌పై, చండీగఢ్ 4–3తో ఆంధ్రప్రదేశ్‌పై, కేరళ 10–0తో పాండిచ్చేరిపై నెగ్గి ముందంజ వేశాయి. -
తెలంగాణ జట్టుకు మూడోస్థానం
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలికల జట్టు రాణించింది. ఆర్మూర్‌లోని ఈఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ వేదికగా జరిగిన ఈ టోర్నీ బాలికల విభా గంలో తెలంగాణ జట్టు మూడోస్థానాన్ని దక్కించుకుంది. సోమవారం జరిగిన బాలికల ఫైనల్లో మహారాష్ట్ర జట్టు 8–7తో ఆంధ్రప్రదేశ్‌పై గెలు పొంది విజేతగా నిలిచింది. బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ 4–0తో ఛత్తీస్‌గఢ్‌ను చిత్తుగా ఓడించింది. పంజాబ్ జట్టుకు మూడోస్థానం లభించింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో డిచ్పల్లి ఏడో బెటాలియన్ కమాండెంట్ ఎన్వీ సాంబయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత సాఫ్ట్‌బాల్ సంఘం కార్యదర్శి ఎల్ఆర్ మౌర్య, సీఈవో ప్రవీణ్ అనోకర్, కోశాధికారి శ్రీకాంత్, నిజామాబాద్ జిల్లా సాఫ్ట్‌బాల్ సంఘం చైర్మన్ లింగారెడ్డి, కార్యదర్శి కె. శోభన్‌బాబు పాల్గొన్నారు. -
తెలంగాణ, ఏపీ జట్ల ముందంజ
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ, ఏపీ బాలికల జట్లు ముందంజ వేశాయి. ఆర్మూర్‌లోని టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ 10–0తో పాండిచ్చేరిపై ఘనవిజయం సాధించింది. మరో మ్యాచ్‌లో ఏపీ 10–0తో హెచ్ఏఎల్ను చిత్తుగా ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో రాజస్తాన్ 13–1తో చండీగఢ్‌పై, పంజాబ్ 15–5తో ఢిల్లీపై, మధ్యప్రదేశ్ 2–1తో హరియాణాపై, మహారాష్ట్ర 10–0తో ఉత్తరప్రదేశ్‌పై గెలిచాయి. బాలుర మ్యాచ్‌ల్లో ఛత్తీస్‌గఢ్ 6–5తో రాజస్తాన్‌పై, గుజరాత్ 12–11తో హరియాణాపై, ఛత్తీస్‌గఢ్ 14–0తో ఢిల్లీపై, పాండిచ్చేరి 11–0తో గుజరాత్‌పై, పంజాబ్ 9–0తో హెచ్ఏఎల్పై, కర్ణాటక 11–0తో మణిపూర్‌పై, మధ్యప్రదేశ్ 17–0తో తమిళనాడుపై, ఉత్తరప్రదేశ్ 10–0తో మణిపూర్‌పై విజయం సాధించాయి. -
తెలంగాణ బాలికల జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: మినీ సబ్ జూనియర్ అండర్–12 జాతీయ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలబాలికల జట్లు ఆకట్టుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో బాలికల జట్టు విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకోగా... బాలుర జట్టు రన్నరప్ ట్రోఫీని అందుకుంది. మంగళవారం జరిగిన బాలికల ఫైనల్లో తెలంగాణ 4–0తో రాజస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. మధ్యప్రదేశ్ జట్టుకు మూడో స్థానం దక్కింది. మరోవైపు బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో తెలంగాణ 2–9తో ఆంధ్రప్రదేశ్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. బాలుర విభాగంలోనూ మధ్యప్రదేశ్ జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ యువజన, క్రీడా శాఖ డైరెక్టర్ సుమన్ రావత్ మెహతా ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
టైటిల్‌పోరుకు తెలంగాణ జట్లు
సాక్షి, హైదరాబాద్: మినీ సబ్ జూనియర్ అండర్–12 జాతీయ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలబాలికల జట్లు జోరు కనబరుస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో తెలంగాణ జట్లు టైటిల్‌పోరుకు అర్హత సాధించాయి. సోమవారం జరిగిన బాలికల సెమీస్ మ్యాచ్‌ల్లో తెలంగాణ 10–0తో ఆంధ్రప్రదేశ్‌పై ఘనవిజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో తెలంగాణ 3–0తో హరియాణాపై, రాజస్తాన్ 6–3తో మహారాష్ట్రపై, ఆంధ్రప్రదేశ్ 10–0తో హిమాచల్‌ప్రదేశ్‌పై గెలుపొందాయి. మరోవైపు బాలుర సెమీఫైనల్లో తెలంగాణ 15–0తో పంజాబ్‌ను ఓడించింది. మరో సెమీస్‌లో ఆంధ్రప్రదేశ్ 11–1తో మధ్యప్రదేశ్‌పై గెలుపొంది తెలంగాణతో టైటిల్‌పోరుకు సిద్ధమైంది. బాలుర క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో తెలంగాణ 10–0తో హిమాచల్‌ప్రదేశ్‌పై, మధ్యప్రదేశ్ 10–0తో హరియాణాపై, పంజాబ్ 6–4తో రాజస్తాన్‌పై, ఆంధ్రప్రదేశ్ 10–0తో మహారాష్ట్రపై విజయం సాధించాయి. -
తెలంగాణ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలికల జట్టు సత్తా చాటింది. పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) వేదికగా జరిగిన ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో తెలంగాణ 1–0తో రాజస్తాన్‌పై విజయం సాధించింది. తెలంగాణ జట్టు కెప్టెన్ ప్రియాంక ఈ మ్యాచ్‌లో ఆకట్టుకుంది. మరోవైపు బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టుకు నిరాశ ఎదురైంది. టోర్నీ ఆద్యంతం రాణించిన ఆంధ్రప్రదేశ్ చివరిపోరులో తేలిపోయింది. టైటిల్ పోరులో 1–2తో రాజస్తాన్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో భారత సాఫ్ట్‌బాల్ సంఘం కోశాధికారి శ్రీకాంత్ థోరట్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
మెదక్ జట్లకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ అంతర్ జిల్లా సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో మెదక్ జట్లు సత్తా చాటాయి. వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగిన ఈ టోర్నీలో బాలబాలికల విభాగాల్లో విజేతలుగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. ఆదివారం జరిగిన బాలికల ఫైనల్లో మెదక్ 4–3తో నిజామాబాద్‌పై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో కామారెడ్డి 7–0తో మహబూబ్‌నగర్‌పై ఘనవిజయం సాధించింది. బాలుర టైటిల్ పోరులో మెదక్ 6–5తో వరంగల్‌పై నెగ్గి చాంపియన్‌గా నిలిచింది. మహబూబ్‌నగర్ 8–0తో రంగారెడ్డిని ఓడించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ సాఫ్ట్‌బాల్ సంఘం చైర్మన్ పి. సాంబశివరావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాఫ్ట్‌బాల్ సంఘం కార్యదర్శి కె. శోభన్‌బాబు, కోశాధికారి డి. అభిషేక్ గౌడ్, వరంగల్ జిల్లా సాఫ్ట్‌బాల్ సంఘం అధ్యక్షుడు వి. రాజ్ కుమార్, డీవైఎస్ఓ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ జట్ల శుభారంభం
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ సీనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. గోవాలో శుక్రవారం ప్రారంభమైన ఈ టోర్నీ పురుషుల తొలి మ్యాచ్‌లో తెలంగాణ 10–1తో పాండిచ్చేరిపై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో గోవా 10–0తో తమిళనాడును ఓడించగా, ఆంధ్రప్రదేశ్ 2–0తో పాండిచ్చేరిపై గెలిచింది. మహిళల విభాగంలో తెలంగాణ 10–0తో పాండిచ్చేరిపై, ఆంధ్రప్రదేశ్ 8–0తో గోవాపై నెగ్గాయి. ఇతర మ్యాచ్‌ల్లో కర్ణాటక 10–0తో పాండిచ్చేరిపై, కేరళ 10–0తో కర్ణాటకపై, గోవా 10–0తో తమిళనాడుపై విజయం సాధించాయి. పోటీలకు ముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే చంద్రాకమ్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారత సాఫ్ట్‌బాల్ సమాఖ్య సీఈవో ప్రవీణ్, ఉపాధ్యక్షులు ధర్మ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌కు మిశ్రమ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మినీ సబ్ జూనియర్ (అండర్–13) సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైన ఈ టోర్నీలో బాలుర జట్టు గెలుపొందగా, బాలికల జట్టు తొలి మ్యాచ్‌లోనే పరాజయం పాలైంది. బాలుర కేటగిరీలో హైదరాబాద్ 12–0తో మేడ్చల్‌పై నెగ్గగా... బాలికల జట్టు 0–8తో రంగారెడ్డి చేతిలో ఓడిపోయింది. ఇతర బాలికల మ్యాచ్‌ల్లో మెదక్ 10–0తో కొత్తగూడెంపై, నిజామాబాద్ 10–0తో మహబూబ్‌నగర్‌పై, వరంగల్ 10–0తో కరీంనగర్‌పై గెలిచాయి. బాలుర మ్యాచ్‌ల్లో వరంగల్ 10–0తో కొత్తగూడెంపై, మహబూబ్‌నగర్ 4–0తో కరీంనగర్‌పై, నిర్మల్ 12–1తో కామారెడ్డిపై నెగ్గాయి. అంతకు ముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి ఎ. ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాఫ్ట్‌బాల్ సంఘం కార్యదర్శి కె. శోభన్‌బాబు, నిర్మల్ లైబ్రరీ చైర్మన్ ఎ. రాజేందర్, తెలంగాణ ఖోఖో సంఘం అధ్యక్షులు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
విజేత హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా సీనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జట్లు మెరిశాయి. మహబూబ్‌నగర్‌లో జరిగిన ఈ టోర్నీలో పురుషుల జట్టు టైటిల్‌ను గెలువగా, మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచింది. పురుషుల ఫైనల్లో హైదరాబాద్ జట్టు 9–3తో రంగారెడ్డి జట్టుపై గెలుపొందింది. మేడ్చల్ జట్టుకు మూడోస్థానం దక్కింది. మహిళల టైటిల్‌పోరులో నిజామాబాద్ 1–0తో హైదరాబాద్‌ను ఓడించింది. ఈ విభాగంలో రంగారెడ్డి జట్టు తృతీయ స్థానాన్ని దక్కించుకుంది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ సాఫ్ట్‌బాల్ సంఘం కార్యదర్శి కె. శోభన్ బాబు, మాజీ ఎమ్మెల్యే శేఖర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
తెలంగాణకు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్–జూనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలికల జట్టు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. దోమల్‌గూడలోని ప్రభుత్వ వ్యాయామవిద్య కాలేజీలో గురువారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో తెలంగాణ జట్టు... రాజస్తాన్‌పై గెలిచి మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో మహారాష్ట్ర జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్లో మహారాష్ట్ర 6–0 స్కోరుతో ఆంధ్రప్రదేశ్ జట్టుపై గెలిచింది. దీంతో ఏపీ జట్టు రన్నరప్‌తో తృప్తిపడింది. బాలుర విభాగంలో ఛత్తీస్‌గఢ్ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఛత్తీస్‌గఢ్ 2–0తో రాజస్తాన్‌పై విజయం సాధించింది. పంజాబ్ మూడో స్థానం పొందింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి డబ్ల్యూబీఎస్‌సీ అధ్యక్షుడు రికార్డో ఫ్రాకారి ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేత, రన్నరప్ జట్లకు ట్రోఫీలు అందజేశారు. ఇందులో తెలంగాణ సాఫ్ట్‌బాల్ సంఘం చైర్మన్, ఎంపీ జితేందర్ రెడ్డి, భారత సమాఖ్య కార్యదర్శి మౌర్య, రాష్ట్ర సంఘం కార్యదర్శి శోభన్‌బాబు, కోశాధికారి అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. Softball Championship, Telangana,సాఫ్ట్ బాల్ చాంపియన్ షిప్, తెలంగాణ -
తెలంగాణకు మిశ్రమ ఫలితాలు
జాతీయ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. దోమల్‌గూడలోని ప్రభుత్వ వ్యాయామ విద్య కాలేజీలో జరుగుతోన్న ఈ టోర్నీలో తెలంగాణ బాలికల జట్టు సెమీస్‌కు చేరుకోగా, బాలుర జట్టు క్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. బుధవారం జరిగిన బాలికల క్వార్టర్స్ మ్యాచ్‌లో తెలంగాణ 8–0తో హరియాణాను చిత్తుగా ఓడించి ముందంజ వేసింది. ఇతర మ్యాచ్‌ల్లో ఆంధ్రప్రదేశ్ 2–0తో ఢిల్లీపై, రాజస్తాన్ 2–0తో మణిపూర్‌పై, మహారాష్ట్ర 5–0తో మధ్యప్రదేశ్‌పై, ఏపీ 13–0తో మణిపూర్‌పై, మహారాష్ట్ర 3–0తో మధ్యప్రదేశ్‌పై గెలుపొందాయి. బాలుర విభాగంలో తెలంగాణ జట్టు 0–1తో రాజస్తాన్ చేతిలో పరాజయం పాలైంది. ఇతర మ్యాచ్‌ల్లో కేరళ 2–1తో ఏపీపై, ఛత్తీస్‌గఢ్ 1–0తో పంజాబ్‌పై, పంజాబ్ 7–0తో కేరళపై విజయం సాధించాయి. నేడు జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో తెలంగాణ బాలికల జట్టు రాజస్తాన్‌తో తలపడుతుంది. -
సాఫ్ట్ బాల్ రన్నరప్ హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మినీ జూనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ బాలికల జట్టు రాణించింది. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లో జరిగిన ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన బాలికల ఫైనల్లో హైదరాబాద్ 0–10తో నిజామాబాద్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. మూడోస్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో మెదక్ జట్టు 6–5తో నల్లగొండపై గెలుపొందింది. బాలుర విభాగంలో వరంగల్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో వరంగల్ 10–0తో నిజామాబాద్‌పై గెలుపొందింది. రంగారెడ్డి జట్టు 3–2తో ఆదిలాబాద్‌పై నెగ్గి మూడో స్థానాన్ని దక్కించుకుంది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో బేగంబజార్ కార్పొరేటర్ జి. శంకర్ యాదవ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గన్‌ఫౌండ్రీ డివిజన్ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా, రాష్ట్ర సాఫ్ట్‌బాల్ సంఘం కార్యదర్శి కె. శోభన్‌బాబు, కోశాధికారి డి. అభిషేక్ గౌడ్ పాల్గొన్నారు.