సోమదీప్‌కు లుకౌట్ నోటీసులు జారీ
హైదరాబాద్ : నాలుగు రోజుల క్రితం కూకట్పల్లి ప్రగతి నగర్ కారు ప్రమాదం కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు సాప్ట్వేర్ ఇంజినీర్లు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో కారు నడిపిన సోమదీప్ బసు అమెరికాకు పరారీ అయ్యాడు. దాంతో పోలీసులు అతనికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
వివరాల్లోకి వెళితే పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుదీప్ (26), ఉత్యా (23), సౌరవ్ మైథీ (30), నిలాద్రి (29)లు కొండాపూర్‌లో నివాసముంటున్నారు. సుదీప్ , ఉత్యా, సౌరవ్లు సాప్ట్వేర్ ఇంజనీర్లు కాగా... నిలాద్రి ఫార్మ కంపెనీలో పని చేస్తున్నాడు. బాచుపల్లిలో ఉండే తన స్నేహితుడు బసు శుక్రవారం రాత్రి విందు ఇస్తానంటే నలుగురూ కారులో వెళ్లారు.
విందు ముగించుకొని శనివారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా ప్రగతినగర్ సమీపంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. సుదీప్, ఉత్యా అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రగాయాలకు గురైన సౌరవ్, నిలాద్రిలను పోలీసులు కేపీహెచ్‌బీ కాలనీలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా తన అమెరికా ప్రయాణానికి ఆటంకం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ప్రమాదం జరిగిన సమయంలో సుదీప్ కారును నడిపినట్లు సోమదీప్ పోలీసులను తప్పుదారి పట్టించాడు. సుదీప్ చనిపోవటంలో ఆ నేరం తనపైకి రాదని భావించాడు. అయితే పోలీసులు లోతుగా విచారణ జరపటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు సోమదీప్ కోసం గాలిస్తున్నారు.