Sonipat district
-
తల్లిని కొట్టి.. అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం
చండీగఢ్: దేశంలో మహిళల రక్షణకు ఎన్ని చట్టాలను తీసుకువచ్చినా వారిపై ఆగడాలు మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకు కామాంధులు పేట్రేగిపోతున్నారు. దేశంలో నిత్యం ఎక్కడో ఓ చోట అత్యాచార ఘటన జరుగుతూనే ఉంది. తాజాగా హరియాణా రాష్ట్రం సోనిపట్ పరిధిలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిని బెదిరించి.. ఇద్దరు బాలికలపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారితో పురుగుల మందు తాగించడంతో వారిద్దరూ మృతిచెందారు. సంచలనం రేపిన ఈ ఘటన వివరాలను పోలీసులు మీడియా సమావేశంలో తెలిపారు. ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నివసిస్తోంది. వారి వయసు 14, 16 ఏళ్లు. తల్లి కూలీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే వీరి పక్క ఇంట్లోనే కొందరు వలస కార్మికులు నివసిస్తున్నారు. వీరి కన్ను పక్కనే ఉన్న ఆ అక్కాచెల్లెళ్లపై పడింది. ఈ క్రమంలో ఆ నలుగురు ఆగస్టు 5, 6 తేదీన అర్ధరాత్రి వారి ఇంట్లోకి చొరబడి.. ఆమె తల్లిపై దాడి చేశారు. ఆమె అచేతనావస్థలో ఉండగా ఆమె ఎదుటే కూతుళ్లపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ తరువాత వారితో పురుగుల మందు తాగించారు. అనంతరం ఆ ఇద్దరు బాలికలు అపస్మారక స్ధితికి చేరుకున్నారు. బాలికల పరిస్థితి విషమించడంతో.. పాము కరిచినట్లు పోలీసులకు చెప్పాలని తల్లిని నలుగురు నిందితులు బెదిరించారు. తల్లి సరేనని అంగీకరించడంతో కుమార్తెలను ఢిల్లీలోని ఆస్పత్రికి తీసుకువచ్చింది. అయితే మార్గమధ్యంలోనే ఓ బాలిక చనిపోయింది. మరో బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె తల్లి ప్రాణభయంతో ఆస్పత్రిలో వైద్యులకు గానీ, పోలీసులకు అసలు విషయం చెప్పలేదు. వారికి పాము కాటేసిందనే చెప్పింది. అధికారులు పోస్టుమార్టం నిర్వహించగా బాలికల మీద లైంగిక దాడి జరిగిన విషయం బయటపడింది. అంతేకాదు వారిమీద విషప్రయోగం జరిగిందని కూడా నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు ఆమె తల్లిని గట్టిగా అడగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. -
కాలేజీలోనే లెక్చరర్‌పై కాల్పులు
ఛండీగఢ్ : హరియాణాలో దారుణం చోటు చేసుకుంది. ఓ విద్యార్థి.. లెక్చరర్‌పై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో లెక్చరర్ మృతిచెందారు. సోనిపట్ జిల్లాలోని ఖార్ఖోడా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం కళాశాలకు వచ్చిన విద్యార్థిని తుపాకీతో లెక్చరర్ రాజేష్ సింగ్‌పై కాల్పులు జరిపినట్లు సమాచారం. విద్యార్థి పరారీలో ఉన్నాడని.. త్వరలోనే అతన్ని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఘటనకు గల కారణాలు, మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. మరో ఘటనలో... గుర్‌గ్రామ్ లో బాద్షాపూర్లో నివసించే దంపతులపై గుర్తు తెలియని ఆగంతకులు కాల్పులు తెగబడ్డారు. ఈ దాడిలో భర్త తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. ఇక స్వల్ప గాయాలతో బయటపడిన భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనలో టిల్లు అనే రౌడీ షీటర్ హస్తం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న టిల్లు కోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు. #Haryana: Married couple shot at by unknown bike-borne assailants in #Gurugram's Badshahpur in early morning hours today; husband died on way to hospital, wife suffered injuries & is currently out of danger. pic.twitter.com/eFxxYP2AJ5 — ANI (@ANI) 13 March 2018 -
కూతురికి 'ప్రత్యేక' పెళ్లికానుక ఇచ్చిన తండ్రి
రొహతక్: గోరక్షణ పేరిట దేశంలో దాడులు పెచ్చుమీరుతున్న ప్రస్తుత తరుణంలో మతసామరస్యం పరిఢవిల్లే ఘటన హర్యానాలో వెలుగులోకి వచ్చింది. ఓ ముస్లిం వ్యక్తి తన కుమార్తె పెళ్లి ప్రత్యేక కానుకగా గోమాతను బహూకరించడం ఆసక్తి కలిగిస్తోంది. సోనిపట్ జిల్లా ఖార్ ఖొద్దా గ్రామానికి చెందిన నూర్ ఖాన్ తన కూతురు గుల్షానాకు పెళ్లికానుకగా ఆవును ఇచ్చాడు. సుమారు 15 వేల రూపాయలతో గోవును కొని తన కుమార్తెకు బహూరించాడు. తన కూతురికి గోవులంటే చాలా ఇష్టమని నూర్ ఖాన్ తెలిపాడు. ఆవులు ఎక్కడ కనబడినా బ్రెడ్డు, బెల్లం పెడుతుంటుందని వెల్లడించాడు. ఆవును సాకేందుకు తన ఇంట్లో సరిపడా స్థలం లేనందుకు అతడు విచారం వ్యక్తం చేశాడు. ఓ ముస్లిం వ్యక్తి తన కూతురికి పెళ్లి కానుకగా గోవునివ్వడం హర్యానాలో ఇదే తొలిసారి అని చెబుతున్నారు. తన తండ్రి ఇచ్చిన బహుపతి పట్ల గుల్షానా సంతోషం వ్యక్తం చేసింది. అత్తవారింట్లో ఆవును బాగా చూసుకుంటానని చెప్పింది.