ప్రతీకాత్మక చిత్రం
చండీగఢ్: దేశంలో మహిళల రక్షణకు ఎన్ని చట్టాలను తీసుకువచ్చినా వారిపై ఆగడాలు మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకు కామాంధులు పేట్రేగిపోతున్నారు. దేశంలో నిత్యం ఎక్కడో ఓ చోట అత్యాచార ఘటన జరుగుతూనే ఉంది. తాజాగా హరియాణా రాష్ట్రం సోనిపట్ పరిధిలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిని బెదిరించి.. ఇద్దరు బాలికలపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారితో పురుగుల మందు తాగించడంతో వారిద్దరూ మృతిచెందారు.
సంచలనం రేపిన ఈ ఘటన వివరాలను పోలీసులు మీడియా సమావేశంలో తెలిపారు. ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నివసిస్తోంది. వారి వయసు 14, 16 ఏళ్లు. తల్లి కూలీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే వీరి పక్క ఇంట్లోనే కొందరు వలస కార్మికులు నివసిస్తున్నారు. వీరి కన్ను పక్కనే ఉన్న ఆ అక్కాచెల్లెళ్లపై పడింది. ఈ క్రమంలో ఆ నలుగురు ఆగస్టు 5, 6 తేదీన అర్ధరాత్రి వారి ఇంట్లోకి చొరబడి.. ఆమె తల్లిపై దాడి చేశారు. ఆమె అచేతనావస్థలో ఉండగా ఆమె ఎదుటే కూతుళ్లపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ తరువాత వారితో పురుగుల మందు తాగించారు. అనంతరం ఆ ఇద్దరు బాలికలు అపస్మారక స్ధితికి చేరుకున్నారు.
బాలికల పరిస్థితి విషమించడంతో.. పాము కరిచినట్లు పోలీసులకు చెప్పాలని తల్లిని నలుగురు నిందితులు బెదిరించారు. తల్లి సరేనని అంగీకరించడంతో కుమార్తెలను ఢిల్లీలోని ఆస్పత్రికి తీసుకువచ్చింది. అయితే మార్గమధ్యంలోనే ఓ బాలిక చనిపోయింది. మరో బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె తల్లి ప్రాణభయంతో ఆస్పత్రిలో వైద్యులకు గానీ, పోలీసులకు అసలు విషయం చెప్పలేదు. వారికి పాము కాటేసిందనే చెప్పింది. అధికారులు పోస్టుమార్టం నిర్వహించగా బాలికల మీద లైంగిక దాడి జరిగిన విషయం బయటపడింది. అంతేకాదు వారిమీద విషప్రయోగం జరిగిందని కూడా నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు ఆమె తల్లిని గట్టిగా అడగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment