మూడు దేశాల్లో ఉగ్ర దాడులు, 41 మంది మృతి
సౌసీ/కువైట్/పారిస్: ప్రపంచ దేశాలను పెను ముప్పుగా మారిన ఇస్లాం ఉగ్రవాదులు శుక్రవారం చెలరేగిపోయారు. మూడు ఖండాల్లోని మూడు దేశాల్లో దాడులకు తెగబడ్డారు. 41 మంది ప్రాణాలు బలిగొన్నారు. ఐరోపా, ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని ఫ్రాన్స్, కువైట్, ట్యునీసియా దేశాల్లో దాడులు చేశారు.
ట్యునీసియాలోని పర్యాటక పట్టణం సౌసీలో రెండు హోటళ్లపై దుండగులు కాల్పులు జరిపిన ఘటనలో 27 మంది మృతి చెందారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. మరో దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సముద్ర తీరం వెంబడి ఉన్న హోటళ్లపై ఈ దాడి జరిగింది. అయితే దాడులు జరిపింది ఉగ్రవాదులా, కాదా అనేది వెల్లడి కాలేదు. బీచ్ టూరిజానికి ప్రసిద్ధిగాంచిన సౌసీకి విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు.
కువైట్ రాజధాని కువైట్ లో షియా మసీదులో ఇస్లాం ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఐఎస్ఐఎస్ ప్రకటించుకుంది. ఫ్రాన్స్ లోని లియాన్ ప్రాంతానికి సమీపంలోని ఉన్న గ్యాస్ ఫ్యాక్టరీలో ఇస్లాం ఉగ్రవాది దాడి చేయడంతో ఒకరు మృతి చెందారు. వరుస ఉగ్రదాడులతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. భద్రతను కట్టుదిట్టం చేశాయి.