నేరాలు మరింత తగ్గాలి
ఏలూరు అర్బన్ : జిల్లాలో నేరాల సంఖ్య మరింతగా తగ్గాలని, దీనికోసం పోలీసులు తీవ్రంగా శ్రమించాలని ఏలూరు రేంజి డీఐజీ పి.వి.ఎస్.రామకృష్ణ, జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా స్థాయి నేర సమీక్ష నిర్వíß ంచారు. డివిజన్ల వారీగా ప్రస్తుత నెలలో జరిగిన వివిధ నేరాలపై వారు అధికారుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం మాట్లాడుతూ.. గతంతో పోల్చుకుంటే అన్ని రకాల నేరాలనూ తగ్గించగలిగామని, రోడ్డు ప్రమాదాల నివారణలో రాష్ట్రంలోనే అగ్రగాములుగా ఉన్నామని పేర్కొన్నారు. ఇళ్ల చోరీలనూ గత రెండేళ్లతో పోలిస్తే గణనీయంగా తగ్గించగలిగామని చెప్పారు. అదే సమయంలో జిల్లాలో హత్యలు, కొట్లాటలు, ఆర్థికనేరాలు ఆశించిన మేర తగ్గలేదని, ఈ అంశంపై జిల్లా పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లపై నిఘా పెంచాలని, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ నేరాలను అదుపులో ఉంచాలని సూచించారు. నేరాలపై ముందస్తు సమాచారం సేకరించేందుకు ప్రత్యేకంగా ఇన్ఫార్మర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇటీవల జిల్లాలో ప్రత్యేకించి ఏలూరులో జరిగిన నేరాలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎన్.చంద్రశేఖర్, ఏలూరు, కొవ్వూరు, నరసాపురం, జంగారెడ్డిగూడెం డీఎస్పీలు గోగుల వెంకటేశ్వరరావు, నర్రా. వెంకటేశ్వరరావు, జి.పూర్ణచంద్రరావు, కె. వెంకట్రావు, ఎస్బీ డీఎస్పీ పి.భాస్కరరావు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.