special portal
-
జాతీయ ఉపకార వేతనాలకు ప్రత్యేక పోర్టల్
సాక్షి, అమరావతి: కళాశాలలు, యూనివర్సిటీల విద్యార్థులకు అందించే ‘సెంట్రల్ సెక్టార్ స్కీం స్కాలర్షిప్’లకు దరఖాస్తు కోసం ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి వచ్చినట్లు ఇంటర్మిడియెట్ విద్యామండలి కమిషనర్ సౌరభ్ గౌర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు. 2023–24 విద్యా సంవత్సరానికి సెంట్రల్ సెక్టార్ స్కీం స్కాలర్షిప్ కోసం డిసెంబర్ 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, ఈ సమాచారాన్ని డీవీఈవోలు, ఆర్ఐవోలు అన్ని మేనేజ్మెంట్స్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు తెలియజేయాలన్నారు. విద్యార్థుల డేటాను జ్ఞానభూమి పోర్టల్‌లో అందుబాటులో ఉంచామని, వివరాల ఆధారంగా http://www.scholarships.gov.in వెబ్సైట్లో స్కాలర్షిప్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
దళితబంధుకి ప్రత్యేక పోర్టల్.. యాప్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళిత బంధు పథకం మార్గదర్శకాల రూపకల్పన కొలిక్కి వచ్చింది. ఎస్సీ అభివృద్ధి శాఖ వీటిని ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆమోదం దక్కిన వెంటనే ఉత్తర్వులు వెలువడే అవకాశంఉన్నట్లు ఆ శాఖలోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వం ఆదేశిస్తే ఆగస్టు మొదటి లేదా రెండో వారం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అంతా ఆన్లైన్లోనే.. దళిత బంధు పథకం దరఖాస్తుల స్వీకరణ మొదలు పరిశీలన, అర్హత నిర్ధారణ, ఆర్థిక సాయం అందజేత తదితర ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే కొనసాగనుంది. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను రూపొందించింది. దీనికి సమాంతరంగా యాప్‌ను కూడా తయారు చేసింది. ప్రస్తుతం ఇవి ట్రయల్స్ దశలో ఉన్నాయి. వచ్చే నెల మొదటి వారం నాటికి వెబ్ పోర్టల్‌తో పాటు యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. క్షేత్రస్థాయి అధికారులు మొదలు జిల్లా అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు అంతా ఈ వెబ్ పోర్టల్, యాప్ ద్వారా నిరంతరం పథకం అమలు తీరును పర్యవేక్షిస్తారు. ఇందుకు సంబంధిత అధికారులకు ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను సీజీజీ కేటాయిస్తుంది. నెలరోజుల కసరత్తు దాదాపు నెలరోజుల పాటు కసరత్తు చేసిన ఎస్సీ అభివృద్ధి శాఖ, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు వివిధ అంశాలను ప్రామాణికంగా తీసుకుని విధివిధానాలను రూపొందించారు. ఈ పథకం కింద అర్హత సాధించిన కుటుంబానికి గరిష్టంగా రూ.10 లక్షల ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారు వ్యక్తిగత ఖాతాలో ప్రభుత్వం జమ చేయనున్న సంగతి తెలిసిందే. విద్యార్థుల కోసం అమలు చేస్తున్న విదేశీ విద్యా నిధి పథకంలో గరిష్ట లబ్ధి రూ.20 లక్షలు కాగా.. దాని తర్వాత దళిత బంధు పథకం కిందే అధిక మొత్తంలో ఆర్థిక సాయం అందనుంది. ఇప్పటివరకు లబ్ధిపొందని కుటుంబానికి ప్రాధాన్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటివరకు లబ్ధి పొందని కుటుంబానికి ఈ పథకంలో తొలి ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. అదేవిధంగా కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షల లోపు ఉన్న, భూమి లేని పేద కుటుంబాన్ని ఎంపిక చేయనున్నారు. లబ్ధిదారు కుటుంబంలోని మహిళ పేరిట పథకం మంజూరు చేస్తారు. ఒకవేళ ఆ కుటుంబంలో అర్హురాలైన మహిళ లేనప్పుడు పురుషుడికి అవకాశం కల్పిస్తారు. ఈ పథకం కింద లబ్ధి పొందే కుటుంబం ఆర్థికంగా స్థిరపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దరఖాస్తుదారులు తాము ఏర్పాటు చేసే యూనిట్‌కు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టును పక్కాగా సమర్పించాలి. అన్ని కోణాల్లో వడపోసిన తర్వాతే ఎస్సీ కార్పొరేషన్ అర్హతను ఖరారు చేస్తుంది. -
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక శుభవార్త. బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకే గృహోపకరణాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక పోర్టల్‌ను అభివృద్ధి చేస్తోంది. కంప్యూటర్లు, ట్యాబ్‌లు, మొబైల్ ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను డిస్కౌంట్ ధరలకే అందించే విధంగా ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (ఏపీటీఎస్).. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తరహాలో ‘జీ–కార్ట్’ పేరుతో ఒక పోర్టల్‌ను అభివృద్ధి చేస్తోంది. ఉద్యోగులు ఐడీ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా లాగిన్ అయ్యి, వస్తువులను కొనుగోలు చేసే విధంగా పోర్టల్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోర్టల్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సెక్యూరిటీ ఆడిటింగ్ కూడా పూర్తయ్యింది. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పోర్టల్‌ను ప్రారంభిస్తామని ఏపీటీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ నంద కిషోర్ ‘సాక్షి’కి వెల్లడించారు. దీనివల్ల సుమారు 10.36 లక్షల మంది ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వారికి ప్రయోజనం లభిస్తుందని ఏపీటీఎస్ అంచనా వేస్తోంది. వివిధ కార్పొరేషన్లతో కలుపుకొని రాష్ట్రంలో 7,76,492 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా, 2.60 లక్షల మంది వలంటీర్లు ఉన్నారు. ఓఈఎంలతో ఒప్పందం ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈకామర్స్ పోర్టల్స్ కంటే తక్కువ రేటుకు వస్తువులను అందించే విధంగా నేరుగా తయారీ సంస్థల (ఓఈఎం–ఒరిజనల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్)తో మాట్లాడి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు నందకిషోర్ తెలిపారు. పది లక్షల మందికిపైగా ఉద్యోగులు ఉండటంతో ఓఈఎం సంస్థలు కూడా ఒప్పందం చేసుకోవడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. కొంత మంది ఉద్యోగులు గ్రూపులుగా ఏర్పడి ఒకేసారి అధిక మొత్తంలో కొనుగోలు ఆర్డరుఇస్తే, మరింత డిస్కౌంట్ ఇచ్చేలా గ్రూపు బయ్యింగ్ పాలసీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ పోర్టల్ ద్వారా కొనుగోలు చేసిన వస్తువులను నేరుగా ఇంటికి చేర్చడం కోసం లాజిస్టిక్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. ‘చేయూత’ కోసం హోల్‌సేల్ రిటైలర్స్‌తో ఒప్పందాలు ఇదే సమయంలో రాష్ట్రంలో వైఎస్సార్ చేయూత కింద షాపులను ఏర్పాటు చేసుకున్న మహిళలకు తక్కువ రేటుకే వస్తువులను అందించే విధంగా హోల్‌సేల్ రిటైల్ సంస్థలతో చర్చలు జరుపుతున్నారు. వాల్‌మార్ట్, డీమార్ట్, రిలయన్స్ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్లు ఏపీటీఎస్ ఎండీ నందకిషోర్ తెలిపారు. రాష్ట్రంలో సుమారు 75,000 మంది వైఎస్సార్ చేయూత కింద షాపులు ఏర్పాటు చేసుకున్నారని, వీరికి సరుకులు కొనుగోళ్లు ఇబ్బందిగా ఉండటంతో నేరుగా షాపులకే డెలివరీ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. -
‘అడ్వాన్స్డ్’కు ప్రత్యేక పోర్టల్
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్‌కు ప్రత్యేక పోర్టల్‌ను ఢిల్లీ ఐఐటీ అందుబాటులోకి తీసుకువచ్చింది. అడ్వాన్స్డ్ నోటిఫికేషన్, అర్హత వివరాలను పొందుపరిచిన వెబ్సైట్ (htt pr://jeeadv.ac.in) కాకుండా జేఈఈ మెయిన్ అర్హత సాధించిన విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మరో వెబ్‌సైట్‌ను (jeeadv.inc.in) దుబాటులోకి తెచ్చింది. అర్హతలకు సంబంధించిన వివరాలన్నింటిని పాత వెబ్సైట్లోనే(అఫీషియల్) ఉంచింది. ఆ వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో దరఖాస్తుల మొదటిరోజు విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.దీంతో వెంటనే మరో వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. విద్యార్థులు ఈ వెబ్సైట్ (jeeadv.nic.in) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు రిజిస్ట్రేషన్‌కు, 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం ఇచ్చింది. ఈ నెల 27న నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా మెయిన్‌లో టాప్ 2.5 లక్షల మంది బెస్ట్ స్కోర్ విద్యార్థులనే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. విద్యార్థులకు జనవరి జేఈఈ మెయిన్‌లో వచ్చిన స్కోర్, ప్రస్తుత జేఈఈ మెయిన్‌లో వచ్చిన స్కోర్ రెండింటిలో ఏది బెస్ట్ అయితే దాన్నే అడ్వాన్స్‌డ్‌కు పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ఆ మేరకు కేటగిరీల కటాఫ్ స్కోర్‌ను శుక్రవారంరాత్రే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకటించింది. ఆయా స్కోర్ పరిధిలో ఉన్న విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టింది. జనవరి, సెప్టెంబర్ జేఈఈ మెయిన్లకు 11.23 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 10.23 లక్షల మంది పరీక్ష రాసినట్లు వెల్లడించింది. వీరిలో టాప్ 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈసారి జేఈఈ మెయిన్‌కు హాజరైన బాలికల సంఖ్య పెరిగింది. దాదాపు 30 శాతం(3.08 లక్షల) మంది జేఈఈ మెయిన్ కు హాజరయ్యారు. అలాగే ఐఐటీల్లో బాలికల సంఖ్యను పెంచేందుకు 2021 సంవత్సరం వరకు సీట్లను పెంచుతూ వస్తున్న కేంద్రం.. ఈసారి కూడా 20 శాతం సూపర్‌న్యూమరరీ సీట్లను కేటాయించనుంది. కాగా, విద్యార్థులకు వచ్చిన ఫైనల్ స్కోర్ ఆధారంగా ఎన్టీఏ జేఈఈ మెయిన్ ర్యాంకులను కేటాయించింది. ఈ ర్యాంకుల ఆధారంగానే ఎన్ఐటీ, ఐఐఐటీ, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ (జీఎఫ్‌టీఐ)ల్లో ప్రవేశాలు జరపనుంది. -
పంటల వివరాలకు ప్రత్యేక పోర్టల్
సాక్షి, హైదరాబాద్ : వానాకాలం నుంచి నియంత్రిత సాగు విధానం అమలులో భాగంగా రైతు లు, విస్తీర్ణం, పంటల వారీగా వివరాలు నమో దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ గుంట భూమిలోనూ వేసిన పంటల వివరాలను నమోదు చేసేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్‌లో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు ఈ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. దీనికోసం ప్రభుత్వం వ్యవసాయ శాఖ అదనపు డైరెక్టర్ కె.విజయ్ కుమార్‌ను చీఫ్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌గా నియమించింది. పంటల సాగు విస్తీర్ణం మాడ్యూల్ రైతులు, పంటలు, సర్వే నంబరు వారీగా వివరాలు నమోదు చేసేందుకు నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సహకారంతో వ్యవసాయ శాఖ ప్రత్యేక మాడ్యూల్‌ను రూపొందించింది. క్రాప్సోన్ ఏరియా మాడ్యూల్ (పంటల సాగు విస్తీర్ణం నమూనా)లో రైతులు, పంటల వివరాలు నమోదు చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిపై ముందస్తు అంచనా వేయడం సాధ్యమవుతుందని వ్యవసాయ శాఖ భావిస్తోంది. ఆయా పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరతో పాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేయడంపై ప్రణాళికలు రూపొందించడం కూడా సులభమవుతుందని అధికారులు చెప్తున్నారు. -
పోగొట్టుకున్న ఫోన్లను కనిపెట్టే పోర్టల్
న్యూఢిల్లీ: చోరీకి గురైన లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల ఆచూకీ దొరకపుచ్చుకునేందుకు, బ్లాక్ చేసేందుకు ఉపయోగపడే విధంగా కేంద్రం ప్రత్యేక పోర్టల్‌ను ఆవిష్కరించింది. ఢిల్లీ–నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) వాసుల కోసం www.ceir.gov.in వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. సెప్టెంబర్‌లోనే ముంబైలో ఆవిష్కరించిన ఈ పోర్టల్‌ను త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. -
కరెంట్ అఫైర్స్‌కు ప్రత్యేక పోర్టల్
హైదరాబాద్: పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ పాత్ర నిర్వచించలేనిది. ఏ పరీక్ష తీసుకున్నా కనీసం 20 నుంచి 30 శాతం ప్రశ్నలు వస్తాయి. ఈ తరుణంలో ప్రతి పరీక్షకు స్టడీ మెటీరియల్, మోడల్ పేపర్లతో ప్రత్యేక పోర్టల్స్ ప్రారంభించే సాక్షి ఇప్పుడు కరెంట్ అఫైర్స్‌కు కూడా తెలుగు, ఇంగ్లిష్‌లో ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్‌లో ైడైలీ, వీక్లీ, మంత్లీ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్ బిట్బ్యాంక్తో పాటు కరెంట్ అఫైర్స్ స్పెషల్ (ఇయర్ రౌండప్), సులువుగా ప్రాక్టీస్ చేసుకునేందుకు మంత్లీ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్టులను రూపొందించింది. రోజూ దినపత్రిక చదువుతూ సాక్షి ప్రత్యేకంగా రూపొందించిన కరెంట్ అఫైర్స్, బిట్ బ్యాంక్స్ సాధన చేయడం వల్ల ఈ విభాగంలో మంచి మార్కులు సాధించవచ్చు. అంతర్జాతీయ సంఘటనలు, ద్వైపాక్షిక సంబంధాలు-నిర్ణయాలు, దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులు, తాజా నియామకాలు, వార్తల్లోని వ్యక్తులు, క్రీడలు-విజేతలు, సదస్సులు-సమావేశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తున్న కొత్త ఆవిష్కరణలు వంటి వాటిలో తాజా అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.. http://www.sakshieducation.com/CA/Index.html