Spice Jet Airlines
-
స్పైస్ జెట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం...కరాచీలో అత్యవసర ల్యాండింగ్
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే విమానాన్ని దారి మళ్లించి కరాచి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఐతే స్పైస్‌జెట్ విమానంలో ఇండికేటర్ లైట్ సరిగా పనిచేయకపోవడంతోనే కరాచికి మళ్లించినట్లు ఎయిర్‌లైన్ అధికార ప్రతినిధి తెలిపారు. ఎలాంటి ఎమర్జెన్సీ ప్రకటించలేదని విమానయాన సంస్థ పేర్కొంది. అంతేకాదు ప్రయాణీకులను దుబాయ్‌కి తీసుకువెళ్లే ప్రత్యామ్నాయ విమానాన్ని కరాచీకి పంపుతున్నామని ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు. ఐతే అసాధారణంగా ఇంధనం తగ్గుతున్నట్లుగా ఇండికేటర్‌ని చూపించడంతో, పైలట్లు ఇంధనం లీకేజ్ అవుతుందన్న అనుమానంతో విమానాన్ని దారి మళ్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఇంధనం లీక్ అయినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఏవియేషన్ రెగ్యులేటర్ పేర్కొంది. (చదవండి: నైట్ క్లబ్లో కాల్పుల కలకలం...ప్రమాదవశాత్తు స్నేహితుడిని కాల్చిన వ్యక్తి) -
ముంబై - హాంకాంగ్ నాన్‌స్టాప్
సాక్షి, న్యూఢిల్లీ: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ దూకుడు మీద ఉంది. జాతీయంగా,అంతర్జాతీయంగా పలు విమాన సర్వీసులను కొత్తగా పరిచయం చేస్తూ ప్రస్తుత డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటోంది. ముఖ్యంగా ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ అప్పుల సంక్షోభంలో చిక్కుకుని కార్యకలాపాలను నిలిపివేసిన నేపథ్యంలో కొత్త వ్యూహాలతో విమాన సేవలను విస్తరిస్తోంది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ మార్గాల్లో వివిధ కొత్త విమానాలను ప్రకటించిన స్పైస్ జెట్ ప్రస్తుత డిమాండ్‌ను అందిపుచ్చుకుంటోంది. తాజాగా ముంబై, ఢిల్లీ నగరాలనుంచి విదేశాలకు నాన్ స్టాప్ విమానాలను నడపబోతున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా ముంబై నుంచి హాంకాంగ్‌కు రోజూ నాన్‌స్టాప్ ఫ్లైట్‌ను ప్రారంభిస్తున్నట్టు గురువారం తెలిపింది. జూలై 31, 2019 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ముంబై- హాంకాంగ్ ఏకైక నాన్-స్టాప్ విమానం తమదేననని పేర్కొంది. ఈ విమానం ముంబై లో ఉదయం 1.05 గంటలకు బయలుదేరి ఉదయం 9.40 గంటలకు హాంకాంగ్ చేరుకుంటుంది. ముంబై-హాంకాంగ్‌లో రూ.16,700 గాను, హాంకాంగ్-ముంబై రూట్లలో రూ .19,200 గా ఉంటాయని స్పైస్ జెట్ తెలిపింది. ముంబై వ్యాపార ప్రయోజనాలకు, పెరుగుతున్న డిమాండ్‌కు తమ కొత్త విమానం దోహదం చేస్తుందని స్పైస్ జెట్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ చెప్పారు. ముంబై , ఢిల్లీ నుంచి ఎనిమిది కొత్త నాన్ స్టాప్ అంతర్జాతీయ విమానాలను ప్రారంభించినట్లు స్పైస్ జెట్ ఈ వారం ప్రకటించింది. ఈ క్రమంలో ముంబై- రియాద్, ఢాకా-ఢిల్లీ, జెడ్డాలకు ఈ సర్వీసులను అందించనుంది. జూలై చివరి వారం నుంచి ఢాకా, జెడ్డాలకు విమానాలు అమలులో ఉంటాయనీ, రియాద్ వెళ్లే విమానాలు ఆగస్టు 15న ప్రారంభమవుతాయని స్పైస్ జెట్ తెలిపింది. కాగా ఏప్రిల్ 1 నుండి స్పైస్ జెట్ కొత్తగా 124 విమానాలను ప్రకటించింది, ఇందులో 76 ముంబైకి సంబంధించినవి కాగా, 20 ఢిల్లీవి. అలాగే ముంబై, ఢిల్లీ మధ్య 8 విమాన సర్వీసులను స్పైస్ జెట్ నడుపుతోంది. -
స్పైస్‌జెట్‌లో సాంకేతిక సమస్య
సాక్షి, శంషాబాద్: విమానయాన సంస్థలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి అహ్మదాబాద్ వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఏడున్నర గంటలు ఆలస్యంగా బయలుదేరింది. స్పైస్‌జెట్ 753 విమానం బుధవారం ఉదయం 5.30 గంటలకు ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకోవాలి. ఈ సమయంలో విమానంలో సాంకేతిక లోపం గమనిం చిన పైలెట్ జెట్‌ను నిలిపివేశారు. ప్రయాణికులకు సరైన సమాచారం అందించకుండా మధ్యాహ్నం 12 గంటల వరకు విమానంలోనే కూర్చోబెట్టారు. దీంతో సహనం కోల్పోయిన ప్రయాణికులు కిందికి దిగి ఆందోళన చేపట్టారు. విమానయాన సంస్థ నిర్వాహకులపై మండిపడ్డారు. విమానం ఆలస్యమైతే సమాచారం ఇవ్వకుండా, విశ్రాంతి గదులకు పంపించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రయాణికుల ఆందోళనతో నిర్వాహకులు వారిని టెర్మినల్‌కు పంపారు. మరమ్మతుల అనంతరం విమానం 12.55 గంటలకు ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకుంది. పైలట్ రాకపోవడంతో ఈ నెల 9న సాయంత్రం 4.10 గంటలకు శంషాబాద్ నుంచి లక్నో వెళ్లాల్సిన ఇండిగో విమానం 5 గంటలు ఆలస్యంగా నుంచి టేకాఫ్ తీసుకున్న సంగతి తెలిసిందే. -
ఇది అత్యాచారం కన్నా తక్కువేం కాదు..
చెన్నై : స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ అనుసరిస్తున్న ‘నో ఫ్రిల్స్ కారియర్’కు వ్యతిరేకంగా ఆ సంస్థలో పనిచేస్తున్న ఎయిర్ హోస్టెస్‌లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాలసీలో భాగంగా ఎయిర్‌లైన్ అధికారులు వారి భద్రతా సిబ్బంది చేత ఇబ్బందికరరీతిలో తమపై వ్యక్తిగత తనిఖీలు నిర్వహిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నిరోజులగా విమానాలు డీబోర్డింగ్ అయ్యాక భద్రతా సిబ్బంది తమను ఈ విధంగా ఇబ్బందిపెడుతున్నారని, చివరకు తమ హ్యండ్బాగ్లో నుంచి శానిటరి ప్యాడ్స్‌ను కూడా తొలగించాలని చెప్తున్నారని ఎయిర్ హోస్టెస్‌లు చెప్తున్నారు. ‘తనిఖీల పేరుతో వారు మా శరీరాన్ని అసభ్యకర రీతిలో తాకుతున్నారు. ఇది మాకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. మా సానిటరి ప్యాడ్స్‌ను తీసివేయాలని, మా శరీరాన్ని తాకాలని మీ పాలసీలో ఉందా? ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం మమ్మల్ని నియమించుకున్నారు. కానీ మా భద్రత గౌరవం మాటేంటి’ అంటూ ఎయిర్‌లైన్స్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. తమ పట్ల భద్రతా సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరు అత్యాచారం, వేధింపుల కంటే తక్కువగా ఉందా అంటూ ఎయిర్‌హోస్టెస్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌హోస్టెస్‌లు ఆహారపదార్థలు, ఇతర పదర్థాలను అమ్మడానికి ప్రయాణికుల వద్ద నుంచి డబ్బు తీసుకుంటున్నారనే అనుమానంతో కొద్దికాలం నుంచి స్పైస్‌జెట్ యాజమాన్యం విమానాలు డీబోర్డింగ్ అయ్యాక వారిని భద్రతా సిబ్బంది చేత తనిఖీలు చేయిస్తుంది. తనిఖీలు నిర్వహించే వరకు బాత్రూంలోకి కూడా వెళ్లకూడదని ఎయిర్‌హోస్టెస్‌లను ఆదేశించింది. ఈ విషయం గురించి ఎయిర్‌హోస్టెస్‌లు నిరసన తెలపడంతో స్పైస్‌జెట్ అధికారులు వారితో గుర్గావ్లోని తమ కార్యలయంలో మీటింగ్ నిర్వహించారు. దీనివల్ల ఆ రోజు రెండు ఇంటర్నేషనల్ విమానాలు ఆలస్యంగా నడిచాయి. అందులో ఒకటి కొలొంబో వెళ్లే విమానం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం చెన్నై ఎయిర్‌పోర్టులో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో యూనిఫామ్ ధరించిన కొంతమంది ఎయిర్‌హోస్టెస్‌లు, సాధారణ దుస్తుల్లో ఉన్న కొంతమంది గుంపుగా నిలబడి ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. -
స్పైస్‌జెట్ విమానాల రాకపోకలు రద్దు
శంషాబాద్: సంక్షోభంలో కూరుకుపోయిన స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్ సంస్థ హైదరాబాద్ నుంచి దేశవ్యాప్తంగా వివిధ నగరాలకు రాకపోకలు సాగించే విమానాలను సోమవారం అర్ధరాత్రి నుంచి రద్దు చేసింది. ఎస్జీ 806,1007,401,108,1074 విమానాలు గోవా, విజయవాడ, ముంబై, కొచ్చిన్, బెంగళూరు నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సి ఉండగా వాటిని ఆ సంస్థ రద్దు చేసింది. అలాగే మంగళవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఇక్కడి నుంచి కోయంబత్తూరు, ఇండోర్, తిరుపతి, కొచ్చిన్, మధురై, రాజమండ్రి బయలుదేరాల్సిన ఎస్జీ 1045, 1056, 1041, 235, 3313, 1061, 1021 విమానాలను పూర్తిగా రద్దు చేశారు. ఇందులో తిరుపతి వెళ్లాల్సిన రెండు విమానాలు కూడా రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.