సాక్షి, న్యూఢిల్లీ: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ దూకుడు మీద ఉంది. జాతీయంగా,అంతర్జాతీయంగా పలు విమాన సర్వీసులను కొత్తగా పరిచయం చేస్తూ ప్రస్తుత డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటోంది. ముఖ్యంగా ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ అప్పుల సంక్షోభంలో చిక్కుకుని కార్యకలాపాలను నిలిపివేసిన నేపథ్యంలో కొత్త వ్యూహాలతో విమాన సేవలను విస్తరిస్తోంది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ మార్గాల్లో వివిధ కొత్త విమానాలను ప్రకటించిన స్పైస్ జెట్ ప్రస్తుత డిమాండ్‌ను అందిపుచ్చుకుంటోంది. తాజాగా ముంబై, ఢిల్లీ నగరాలనుంచి విదేశాలకు నాన్ స్టాప్ విమానాలను నడపబోతున్నట్టు ప్రకటించింది.
ముఖ్యంగా ముంబై నుంచి హాంకాంగ్‌కు రోజూ నాన్‌స్టాప్ ఫ్లైట్‌ను ప్రారంభిస్తున్నట్టు గురువారం తెలిపింది. జూలై 31, 2019 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ముంబై- హాంకాంగ్ ఏకైక నాన్-స్టాప్ విమానం తమదేననని పేర్కొంది. ఈ విమానం ముంబై లో ఉదయం 1.05 గంటలకు బయలుదేరి ఉదయం 9.40 గంటలకు హాంకాంగ్ చేరుకుంటుంది. ముంబై-హాంకాంగ్‌లో రూ.16,700 గాను, హాంకాంగ్-ముంబై రూట్లలో రూ .19,200 గా ఉంటాయని స్పైస్ జెట్ తెలిపింది. ముంబై వ్యాపార ప్రయోజనాలకు, పెరుగుతున్న డిమాండ్‌కు తమ కొత్త విమానం దోహదం చేస్తుందని స్పైస్ జెట్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ చెప్పారు.
ముంబై , ఢిల్లీ నుంచి ఎనిమిది కొత్త నాన్ స్టాప్ అంతర్జాతీయ విమానాలను ప్రారంభించినట్లు స్పైస్ జెట్ ఈ వారం ప్రకటించింది. ఈ క్రమంలో ముంబై- రియాద్, ఢాకా-ఢిల్లీ, జెడ్డాలకు ఈ సర్వీసులను అందించనుంది. జూలై చివరి వారం నుంచి ఢాకా, జెడ్డాలకు విమానాలు అమలులో ఉంటాయనీ, రియాద్ వెళ్లే విమానాలు ఆగస్టు 15న ప్రారంభమవుతాయని స్పైస్ జెట్ తెలిపింది. కాగా ఏప్రిల్ 1 నుండి స్పైస్ జెట్ కొత్తగా 124 విమానాలను ప్రకటించింది, ఇందులో 76 ముంబైకి సంబంధించినవి కాగా, 20 ఢిల్లీవి. అలాగే ముంబై, ఢిల్లీ మధ్య 8 విమాన సర్వీసులను స్పైస్ జెట్ నడుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment