'కాంగ్రెస్ ఎంపీలు పిల్లుల్లా కూర్చుంటున్నారు'
న్యూఢిల్లీ: పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలు పిల్లుల్లా కూర్చుంటున్నారని టీడీపీ ఎంపీలు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపీల వైఖరిపై టీడీపీ ఎంపీలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం రాజ్యసభ ఆవరణలో వారు మీడియాతో మాట్లాడుతూ ఆంటోనీ కమిటీతో ఒరిగేదేమీ లేదని అన్నారు. శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీతో ఏ ప్రాంతానికి న్యాయం జరగదని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటమే సోనియా గాంధీ లక్ష్యమని ఆయన అన్నారు. అందరి కష్టంతోనే హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందన్నారు. న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని సీఎం రమేష్ స్పష్టం చేశారు. ఓట్లు, సీట్లు కోసమే రాష్ట్ర విభజన చేశారని సీఎం రమేష్ ఆరోపించారు.