Sri Satya Entertainments Banner
-
అల్లి బిల్లి చెక్కిలి గిల్లి... చాలా బాగుంది!
- హీరో రామ్ ‘‘‘తొలి చిత్రం నుంచి సుమంత్ అశ్విన్ నటనలో వైవిధ్యం చూపిస్తున్నాడు. ఈ సినిమా తన కెరీర్‌కు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు విడుదల చేసిన ఈ పాట బాగుంటుంది. ముఖ్యంగా ఈ పాటలో అశ్విన్‌తో పాటు ప్రభాకర్ స్టెప్స్ వేయడం సరదాగా ఉంది’’ అని రామ్ అన్నారు. సుమంత్ అశ్విన్, పూజా ఝవేరీ జంటగా ‘బాహుబలి’ ప్రభాకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘రైట్... రైట్’. మను దర్శకత్వంలో శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ ఈ చిత్రం నిర్మించారు. జె.బి. స్వరపరచిన ఈ చిత్రంలోని ‘అల్లి బిల్లి చెక్కిలి గిల్లి.. రెక్కలే విప్పెను లిల్లి’ అనే తొలి పాట వీడియోను సోమవారం హీరో రామ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ- ‘‘అప్పుడప్పుడూ లుంగీతో నాన్నగారు ఇంట్లో సరదాగా స్టెప్స్ వేస్తుంటారు. లుంగీలో అంత క్యాజువల్‌గా ఎలా డ్యాన్స్ చేయగలుగుతారా? అనిపించేది. ఇప్పుడీ సినిమాలో నేను కూడా లుంగీ కట్టుకుని డ్యాన్స్ చేశా. లుంగీలో డ్యాన్స్ ఇదే ఫస్ట్ టైమ్. ఈ సినిమా అధిక భాగం చిత్రీకరణ అరకులో జరిపాం. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ తర్వాత అరకు అంత అందంగా కనిపించేది ఈ సినిమాలోనే’’ అని చెప్పారు. తొలి సగం వినోదాత్మంగా, మలి సగం మిస్టరీతో ఈ చిత్రం ఉత్కంఠగా సాగుతుందని దర్శకుడు అన్నారు. మే 7న పాటలను విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. ఈ కార్యక్రమంలో నటుడు ‘బాహుబలి’ ప్రభాకర్, సంగీత దర్శకుడు జేబీ, చిత్ర సమర్పకుడు వత్సవాయి వెంకటేశ్వర్లు, సహ నిర్మాత జె.శ్రీనివాసరాజు, ఆదిత్యా మ్యూజిక్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సులో ఏం జరిగిందంటే...
‘‘నాతోపాటు 22మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన మంచి మనసున్న నిర్మాత డా. రామానాయుడుగారు. ఆయనలాగే ఎమ్మెస్ రాజుగారు ఒక్కో సినిమాకు ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేయడం అభినందనీయం. ఈ సినిమా విజయవంతమై మంచి పేరు, డబ్బులు తీసుకురావాలి. టైటిల్ పాజిటివ్‌గా ఉంది’’ అని ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ అన్నారు. సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా ‘బాహుబలి’ ఫేం ప్రభాకర్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘రైట్ రైట్’. వత్సవాయి వెంకటేశ్వర్లు సమర్పణలో శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మను దర్శకత్వంలో జె.వంశీకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. దర్శకులు బి.గోపాల్, మారుతి, వంశీ పైడిపల్లి కలిసి ట్రైలర్ విడుదల చేశారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ- ‘‘డ్రైవర్, కండక్టర్‌కు మధ్య జరిగే కథే ఈ చిత్రం. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘ఆర్డినరీ’ సినిమా స్ఫూర్తితో ఈ చిత్రం నిర్మించాం. తొలి భాగం వినోదాత్మకంగా ఉంటే, మలి భాగంలో మిస్టరీ ఉంటుంది. ఎస్. కోట నుంచి గవిటికి వెళ్లే ఆర్టీసీ బస్సు ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. మే చివరి వారం లేదా జూన్ మొదటివారంలో సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ- ‘‘కథ కొత్తగా ఉంది. మంచి టీమ్‌తో చేసిన ఈ కొత్త ప్రయత్నం అందర్నీ మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఇందులో ఐదు పాటలున్నాయనీ, త్వరలో పాటలను విడుదల చేస్తామనీ నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: శేఖర్ వి.జోసెఫ్, సంగీతం: జె.బి, సహ నిర్మాత: ఎమ్.వి. నరసింహులు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జె. శ్రీనివాస రాజు.