ఆర్టీసీ బస్సులో ఏం జరిగిందంటే... | Right Right Movie Teaser out | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులో ఏం జరిగిందంటే...

Published Sun, Apr 17 2016 11:03 PM | Last Updated on Sun, Sep 3 2017 10:08 PM

ఆర్టీసీ బస్సులో ఏం జరిగిందంటే...

ఆర్టీసీ బస్సులో ఏం జరిగిందంటే...

‘‘నాతోపాటు 22మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన మంచి మనసున్న నిర్మాత డా. రామానాయుడుగారు. ఆయనలాగే ఎమ్మెస్ రాజుగారు ఒక్కో సినిమాకు ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేయడం అభినందనీయం. ఈ సినిమా విజయవంతమై మంచి పేరు, డబ్బులు తీసుకురావాలి. టైటిల్ పాజిటివ్‌గా ఉంది’’ అని ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ అన్నారు. సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా ‘బాహుబలి’ ఫేం ప్రభాకర్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘రైట్ రైట్’. వత్సవాయి వెంకటేశ్వర్లు సమర్పణలో శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మను దర్శకత్వంలో జె.వంశీకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.

దర్శకులు బి.గోపాల్, మారుతి, వంశీ పైడిపల్లి కలిసి ట్రైలర్ విడుదల చేశారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ- ‘‘డ్రైవర్, కండక్టర్‌కు మధ్య జరిగే కథే ఈ చిత్రం. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘ఆర్డినరీ’ సినిమా స్ఫూర్తితో ఈ చిత్రం నిర్మించాం. తొలి భాగం వినోదాత్మకంగా ఉంటే, మలి భాగంలో మిస్టరీ ఉంటుంది. ఎస్. కోట నుంచి గవిటికి వెళ్లే ఆర్టీసీ బస్సు ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. మే చివరి వారం లేదా జూన్ మొదటివారంలో సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ- ‘‘కథ కొత్తగా ఉంది. మంచి టీమ్‌తో చేసిన ఈ కొత్త ప్రయత్నం అందర్నీ మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఇందులో ఐదు పాటలున్నాయనీ, త్వరలో పాటలను విడుదల చేస్తామనీ నిర్మాత తెలిపారు.
 ఈ చిత్రానికి కెమేరా: శేఖర్ వి.జోసెఫ్, సంగీతం: జె.బి, సహ నిర్మాత: ఎమ్.వి. నరసింహులు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జె. శ్రీనివాస రాజు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement