Srikakulam Sherlockholmes Movie
-
‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ రివ్యూ
టైటిల్: శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్నటీనటులు: వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల, సీయా గౌతమ్, స్నేహ గుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, బద్రం, అనీష్ కురివెళ్ల, నాగ్ మహేష్, మచ్చ రవి తదితరులునిర్మాణ సంస్థ: శ్రీగణపతి సినిమాస్నిర్మాత: వెన్నపూస రమణారెడ్డిదర్శకత్వం: రైటర్ మోహన్సంగీతం: సునీల్ కశ్యప్సినిమాటోగ్రఫీ: మల్లికార్జున్ ఎన్ఎడిటర్: అవినాష్ గుర్లింక్విడుదల తేది: డిసెంబర్ 25, 2024కథేంటంటే..ఈ సినిమా కథ 1991లో సాగుతుంది. రాజీవ్ గాంధీ హత్య(1991 మే 21)జరిగిన రోజు శ్రీకాకుళం బీచ్‌లో మేరీ అనే యువతి కూడా దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేసును సీఐ భాస్కర్(అనీష్ కురివెళ్ల) సీరియస్‌గా తీసుకుంటాడు. వారం రోజుల్లో హంతకులను పట్టుకుంటానని, లేదంటే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని మీడియా ముఖంగా శపథం చేస్తాడు. అదే సమయంలో రాజీవ్ గాంధీ హత్య కేసు విషయంలో ఢిల్లీ నుంచి అధికారులు రావడంతో సీఐ భాస్కర్ స్టేషన్లోనే ఉండాల్సి వస్తోంది. వారంలో హంతకుడిని పట్టుకోకపోతే పరువు పోతుందని.. ఈ కేసు విచారణను ప్రైవేట్ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్(వెన్నెల కిశోర్)కి అప్పగిస్తాడు. ఈ హత్య వెనుక మేరి స్నేహితురాలు భ్రమరాంభ(అనన్య నాగళ్ల), ఆమె ప్రియుడు బాలు(రవితేజ మహద్యం), మేరిపై మోజు పడ్డ ఝాన్సీ, సస్పెండ్ అయిన పోలీసు అధికారి పట్నాయక్(బాహుబలి ప్రభాకర్)తో పాటు ముగ్గురు జాలర్లు ఉన్నట్లు డిటెక్టివ్ షెర్లాక్ అనుమానిస్తాడు. వీరందరిని పిలిపించి తనదైన శైలీలో విచారణ ప్రారంభిస్తాడు. ఒక్కొక్కరు ఒక్కో స్టోరీ చెబుతారు. వీరిలో మేరిని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? అసలు డిటెక్టివ్ షెర్లాక్ నేపథ్యం ఏంటి? అతను డిటెక్టివ్ వృత్తినే ఎందుకు ఎంచుకున్నాడు? మేరి హత్య కేసుతో షెర్లాక్‌కి ఉన్న సంబంధం ఏంటి? చివరకు హంతకులను ఎలా పట్టుకున్నారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..డిటెక్టివ్ కథలు టాలీవుడ్‌కి కొత్తేమి కాదు. చిరంజీవి ‘చంటబ్బాయ్’ మొదలు నవీన్ పొలిశెట్టి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ వరకు చాలా సినిమాలు ఈ కాన్సెప్ట్‌తో వచ్చాయి. కొన్ని కథలు సీరియస్‌గా సాగితే..మరికొన్ని కామెడీగా సాగుతూనే థ్రిల్లింగ్ గురి చేస్తాయి. కానీ అలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన వచ్చిన ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ చిత్రం మాత్రం అటు కామెడీ పండించలేదు..ఇటు థ్రిల్లింగ్‌కు గురి చేయలేదు. హాలీవుడ్ రేంజ్ టైటిల్..దానికి జస్టిఫికేషన్ ఇచ్చే కథ ఎంచుకున్న దర్శకుడు మోహన్.. ఆసక్తికరంగా కథనాన్ని నడిపించడం మాత్రం విఫలం అయ్యాడు. డిటెక్టివ్ చేసే ఇన్వెస్టిగేషన్ మొదలు.. హత్య జరిగిన తీరు వరకు ఏది ఆసక్తికరంగా ఉండదు. రాజీవ్ గాంధీ హత్య జరిగిన రోజే ఈ హత్య జరిగినట్లు చూపించడానికి సరైన కారణం కూడా ఉండదు. సీఐ భాస్కర్ బిజీ కావడంతోనే ఈ కేసును ప్రైవేట్ డిటెక్టివ్‌కి ఇచ్చినట్లుగా మొదట్లో చూపిస్తారు. కానీ సినిమా చూస్తున్నంత సేపు సీఐ భాస్కర్ ఇంత ఖాలీగా ఉన్నాడేంటి అనిపిస్తుంది. ఇక డిటెక్టివ్ చేసే ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా లేకపోయినా.. కనీసం నవ్వుకునే విధంగా కూడా ఉండదు. మధ్యలో వచ్చే ఉప కథలు కూడా చాలా రొటీన్‌గా ఉంటాయి. రాజీవ్ గాంధీ హత్యకు గురైన విషయం తెలిసి శ్రీకాకుళం సీఐ అలర్ట్ అవ్వడంతో సినిమా ప్రారంభం అవుతుంది. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా అర్థరాత్రంతా పోలీసులు పెట్రోలింగ్ చేయడం, ఘర్షనకు దిగిన ఇద్దరిని అరెస్ట్ చేయడం.. పోలీసులను చూసి ఓ కారు వెనక్కి వెళ్లడంతో ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇక హత్య జరగడం.. విచారణ కోసం డిటెక్టివ్ షేర్లక్ రంగంలోకి దిగడం వరకు కథపై ఆసక్తి పెరుగుతుంది. ఆ తర్వాత విచారణ భాగంగా వచ్చే ఉప కథలు బోరింగ్‌గా సాగుతాయి. ఒక్కోక్కరు చెప్పే స్టోరీ.. తెరపై చూడడం భారంగా ఉంటుంది. అలాగే ఝాన్సీ అనే పాత్రను తీర్చిదిద్దిన విధానం కూడా అంతగా ఆకట్టుకోదు. అయితే హంతకులు ఎవరనే విషయం చివరి వరకు ప్రేక్షకుడు కనిపెట్టకుండా చేయడం దర్శకుడు కొంతవరకు సఫలం అయ్యాడు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త బెటర్. మేరిని ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారనేది ఆసక్తికరంగా ఉంటుంది. షెర్లాక్ ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ కాస్త ఎమోషనల్‌గా ఉంటుంది. అయితే అప్పటికే విసిగిపోయిన ప్రేక్షకుడు.. ఆ ఎమోషనల్ సీన్‌కి కూడా అంతగా కనెక్ట్ కాలేకపోతాడు. ఎవరెలా చేశారంటే.. డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ పాత్రకు వెన్నెల కిశోర్ కొంతవరకు న్యాయం చేశాడు. అయితే శ్రీకాకుళం యాసలో ఆయన పలికే సంభాషణలలో సహజత్వం కలిపించదు. కామెడీ కూడా అంతగా పండించలేకపోయాడు. అనన్య నాగళ్లకు ఓ మంచి పాత్ర లభించింది. భ్రమరాంభ పాత్రలో ఆమె చక్కగా నటించింది. ఆ పాత్రలోని వేరియేషన్స్ ఆకట్టుకుంటాయి. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టునే తిరుగుతుంది. అనీష్ కురివెళ్ల పాత్రకి వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించడం ఆ క్యారెక్టర్ స్థాయిని తగ్గించింది. రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, బద్రం, నాగ్ మహేష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ అవినాష్ గుర్లింక్ తన కత్తెరకు ఇకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
కథ చాలా కొత్తగా ఉంది: బాబీ కొల్లి
‘‘నేను, మోహన్ కలిసి రైటర్స్‌గా పని చేశాం. తను ఈ సినిమాని వినోదంతో పాటు సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో తీశాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కథ చాలా కొత్తగా ఉంది. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అని డైరెక్టర్ బాబీ కొల్లి అన్నారు. ‘వెన్నెల’ కిశోర్ టైటిల్ రోల్లో, రవితేజ మహాదాస్యం, అనన్య నాగళ్ల జంటగా, శియా గౌతమ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. లాస్యా రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణా రెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డైరెక్టర్స్ బాబీ కొల్లి, కల్యాణ్ కృష్ణ అతిథులుగా హాజరయ్యారు. ‘‘ఈ సినిమా కంటెంట్‌ని బలంగా నమ్మాను. ఆ కథే నన్ను గెలిపిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు వంశీ నందిపాటి. ‘‘నా కెరీర్లో చాలా మంచి పేరు తీసుకొచ్చే సినిమా ఇది’’ అని అనన్య నాగళ్ల పేర్కొన్నారు. ‘‘నటుడిగా ఈ చిత్రం నాకు చాలా కీలకం’’ అన్నారు రవితేజ మహాదాస్యం. ‘‘ఈ మూవీతో కచ్చితంగా హిట్ సాధిస్తాం’’ అని వెన్నపూస రమణారెడ్డి చెప్పారు. -
యాంకర్ పై ఫన్నీ ప్రాంక్.. మేము చిరంజీవి గారి తాలూకా..
-
ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు: అనన్య
‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ లో భ్రమరాంబ పాత్రలో నటించాడు. కథలో నా రోల్ చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు నేను అలాంటి పాత్రలో నటించలేదు. ఇది చాలా డిఫరెంట్ మూవీ’ అంటున్నారు యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల. వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'. రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించారు. అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో అనన్య తాజాగా మీడియాతో ముచ్చటించారు.⇢ ఇప్పటివరకూ ఇలాంటి కథ నేను వినలేదు. మోహన్ గారు కథ చెప్పినపుడు చాలా కొత్తగా అనిపించింది. ఒక సంఘటన జరిగినపుడు అందులో ఒకొక్కరి కోణం నుంచి ఒకొక్క పెర్స్ఫెక్టివ్ ఉంటుంది. ఇలా కథని తీసుకెళ్లడం నాకు చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించింది. కథ వినగానే ఓకే చెప్పాను. వందశాతం ఆడియన్స్ కి ఈ సినిమా మంచి క్రిస్మస్ గిఫ్ట్ అవుతుంది.⇢ ఇందులో డిటెక్టివ్ అమ్మ పేరు షర్మిలమ్మ, నాన్న పేరు లోకనాథ్, తన పేరు ఓం ప్రకాష్. ఈ మూడు పేర్లలో ఫస్ట్ లెటర్ సౌండింగ్ తో షెర్లాక్ హోమ్స్ అని పెట్టడం జరిగింది. తెలుగులో డిటెక్టివ్ సినిమా అనగానే చిరంజీవి గారి చంటబ్బాయ్ గుర్తుకు వస్తుంది. అందుకే అందరికీ కనెక్ట్ అయ్యేవిధంగా ఆ ట్యాగ్ ని పెట్టడం జరిగింది.⇢ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు వైజాగ్ పర్యటన ముగించుకొని అదే రోజు శ్రీపెరంబుదూర్ వెళ్లి అక్కడ చనిపోయారు. ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు చిన్న సంఘటనలని ఎవరూ పట్టించుకోరు. అదే రోజు ఓ కేసు జరిగింది. ఆ కేసు తీగలాగితే డొంక కదిలినట్లుగా చాలా మలుపులతో కథనం ఎంగేజింగ్ గా ఉంటుంది. ⇢ తెలుగుతో పాటు హిందీలో ఓ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నాను. నా సీనీ జర్నీ పట్ల హ్యాపీగా ఉన్నాను. నాకు కంటిన్యూ గా వర్క్ వస్తోంది. రీసెంట్ గా పోట్టేల్ సినిమాకి మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత నా దగ్గరకి మంచి కథలు వచ్చాయి. ఓ రెండు సినిమాలు సైన్ చేశాను.⇢ ప్రస్తుతం తెలుగులో కథాకళి, లేచింది మహిళా లోకం సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. -
ప్రమోషన్స్‌కు దూరంగా వెన్నెల కిశోర్.. 'ఇక మీరెందుకు పాకులాడటం?'
సినిమా తీయడమే కాదు దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యం. పుష్ప 2 రిలీజ్‌కు ముందు అల్లు అర్జున్ క్షణం ఖాళీ లేకుండా నార్త్ టు సౌత్ మొత్తం చుట్టేశాడు. ప్రమోషన్స్ ఆ రేంజ్లో ఉన్నాయి కాబట్టే ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా నెక్స్ట్ లెవల్లో వచ్చాయి. సినిమా ప్రమోషన్స్‌కు కూడా ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తున్నారు. జనాల్లో తమ సినిమా గురించి మాట్లాడుకునేందుకు ఇదే బెస్ట్ ఆప్షన్ అని భావిస్తున్నారు.వరుసగా డుమ్మాఅయితే వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా ఈవెంట్స్‌కు వరుసగా డుమ్మా కొడుతున్నాడు. గురువారం నాడు ట్రైలర్ సక్సెస్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ అనన్య నాగళ్లతో పాటు దర్శకనిర్మాతలు వచ్చారు. దీంతో ఓ జర్నలిస్ట్.. వెన్నెల కిశోర్ ఈ సినిమాకు పబ్లిసిటీ అక్కర్లేదనుకుంటున్నాడు. ఆయన సినిమాకు ఆయనే రావట్లేదు. ఆయన రానప్పుడు మీరెందుకు పాకులాడటం? అని ప్రశ్నించాడు.కథే హీరోఅందుకు డిస్ట్రిబ్యూటర్ వంశీ ఈ సినిమాలో కథే హీరో. మేము కథనే నమ్మాం. కథలో ఆయన ప్రధాన పాత్ర పోషించాడు అని చెప్పాడు. అప్పటికీ సదరు జర్నలిస్ట్.. హీరో మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటున్నారు అని వ్యాఖ్యానించాడు. అందుకు నిర్మాత.. మరి ముందుకువెళ్లాలి కదా.. డబ్బులు పెడుతోంది మేము.. ఆయన కాదు కదా! అని బదులిచ్చాడు.ప్రమోషన్స్‌కు ఎందుకు రావట్లేదంటే?ఇంతలో మరొకరు వెన్నెల కిశోర్ ఎందుకు ప్రమోషన్స్‌కు రారు? అని ప్రశ్నించాడు. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. తనకున్న బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోతున్నారు. పలుమార్లు ప్రమోషన్స్‌కు రమ్మని బతిమాలాం.. కానీ రాలేకపోయారు. ఆయన ఇంట్రోవర్ట్.. ఇలాంటివాటికి నేను రాలేనని సున్నితంగా తిరస్కరించాడు అని నిర్మాత వివరించాడు. కాగా ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది.చదవండి: 'ప్రియాంక.. నీ భర్తను అదుపులో పెట్టుకో!' నిక్‌పై ట్రోలింగ్