టైటిల్: శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్
నటీనటులు: వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల, సీయా గౌతమ్, స్నేహ గుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, బద్రం, అనీష్ కురివెళ్ల, నాగ్ మహేష్, మచ్చ రవి తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీగణపతి సినిమాస్
నిర్మాత: వెన్నపూస రమణారెడ్డి
దర్శకత్వం: రైటర్ మోహన్
సంగీతం: సునీల్ కశ్యప్
సినిమాటోగ్రఫీ: మల్లికార్జున్ ఎన్
ఎడిటర్: అవినాష్ గుర్లింక్
విడుదల తేది: డిసెంబర్ 25, 2024
కథేంటంటే..
ఈ సినిమా కథ 1991లో సాగుతుంది. రాజీవ్ గాంధీ హత్య(1991 మే 21)జరిగిన రోజు శ్రీకాకుళం బీచ్‌లో మేరీ అనే యువతి కూడా దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేసును సీఐ భాస్కర్(అనీష్ కురివెళ్ల) సీరియస్‌గా తీసుకుంటాడు. వారం రోజుల్లో హంతకులను పట్టుకుంటానని, లేదంటే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని మీడియా ముఖంగా శపథం చేస్తాడు. అదే సమయంలో రాజీవ్ గాంధీ హత్య కేసు విషయంలో ఢిల్లీ నుంచి అధికారులు రావడంతో సీఐ భాస్కర్ స్టేషన్‌లోనే ఉండాల్సి వస్తోంది.
వారంలో హంతకుడిని పట్టుకోకపోతే పరువు పోతుందని.. ఈ కేసు విచారణను ప్రైవేట్ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్(వెన్నెల కిశోర్)కి అప్పగిస్తాడు. ఈ హత్య వెనుక మేరి స్నేహితురాలు భ్రమరాంభ(అనన్య నాగళ్ల), ఆమె ప్రియుడు బాలు(రవితేజ మహద్యం), మేరిపై మోజు పడ్డ ఝాన్సీ, సస్పెండ్ అయిన పోలీసు అధికారి పట్నాయక్(బాహుబలి ప్రభాకర్)తో పాటు ముగ్గురు జాలర్లు ఉన్నట్లు డిటెక్టివ్ షెర్లాక్ అనుమానిస్తాడు. వీరందరిని పిలిపించి తనదైన శైలీలో విచారణ ప్రారంభిస్తాడు. ఒక్కొక్కరు ఒక్కో స్టోరీ చెబుతారు. వీరిలో మేరిని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? అసలు డిటెక్టివ్ షెర్లాక్ నేపథ్యం ఏంటి? అతను డిటెక్టివ్ వృత్తినే ఎందుకు ఎంచుకున్నాడు? మేరి హత్య కేసుతో షెర్లాక్‌కి ఉన్న సంబంధం ఏంటి? చివరకు హంతకులను ఎలా పట్టుకున్నారు? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
డిటెక్టివ్ కథలు టాలీవుడ్‌కి కొత్తేమి కాదు. చిరంజీవి ‘చంటబ్బాయ్’ మొదలు నవీన్ పొలిశెట్టి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ వరకు చాలా సినిమాలు ఈ కాన్సెప్ట్‌తో వచ్చాయి. కొన్ని కథలు సీరియస్‌గా సాగితే..మరికొన్ని కామెడీగా సాగుతూనే థ్రిల్లింగ్ గురి చేస్తాయి. కానీ అలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన వచ్చిన ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ చిత్రం మాత్రం అటు కామెడీ పండించలేదు..ఇటు థ్రిల్లింగ్‌కు గురి చేయలేదు.
హాలీవుడ్ రేంజ్ టైటిల్..దానికి జస్టిఫికేషన్ ఇచ్చే కథ ఎంచుకున్న దర్శకుడు మోహన్.. ఆసక్తికరంగా కథనాన్ని నడిపించడం మాత్రం విఫలం అయ్యాడు. డిటెక్టివ్ చేసే ఇన్వెస్టిగేషన్ మొదలు.. హత్య జరిగిన తీరు వరకు ఏది ఆసక్తికరంగా ఉండదు. రాజీవ్ గాంధీ హత్య జరిగిన రోజే ఈ హత్య జరిగినట్లు చూపించడానికి సరైన కారణం కూడా ఉండదు.
సీఐ భాస్కర్ బిజీ కావడంతోనే ఈ కేసును ప్రైవేట్ డిటెక్టివ్‌కి ఇచ్చినట్లుగా మొదట్లో చూపిస్తారు. కానీ సినిమా చూస్తున్నంత సేపు సీఐ భాస్కర్ ఇంత ఖాలీగా ఉన్నాడేంటి అనిపిస్తుంది. ఇక డిటెక్టివ్ చేసే ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా లేకపోయినా.. కనీసం నవ్వుకునే విధంగా కూడా ఉండదు. మధ్యలో వచ్చే ఉప కథలు కూడా చాలా రొటీన్‌గా ఉంటాయి.
రాజీవ్ గాంధీ హత్యకు గురైన విషయం తెలిసి శ్రీకాకుళం సీఐ అలర్ట్ అవ్వడంతో సినిమా ప్రారంభం అవుతుంది. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా అర్థరాత్రంతా పోలీసులు పెట్రోలింగ్ చేయడం, ఘర్షనకు దిగిన ఇద్దరిని అరెస్ట్ చేయడం.. పోలీసులను చూసి ఓ కారు వెనక్కి వెళ్లడంతో ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇక హత్య జరగడం.. విచారణ కోసం డిటెక్టివ్ షేర్లక్ రంగంలోకి దిగడం వరకు కథపై ఆసక్తి పెరుగుతుంది. ఆ తర్వాత విచారణ భాగంగా వచ్చే ఉప కథలు బోరింగ్‌గా సాగుతాయి.
ఒక్కోక్కరు చెప్పే స్టోరీ.. తెరపై చూడడం భారంగా ఉంటుంది. అలాగే ఝాన్సీ అనే పాత్రను తీర్చిదిద్దిన విధానం కూడా అంతగా ఆకట్టుకోదు. అయితే హంతకులు ఎవరనే విషయం చివరి వరకు ప్రేక్షకుడు కనిపెట్టకుండా చేయడం దర్శకుడు కొంతవరకు సఫలం అయ్యాడు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త బెటర్. మేరిని ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారనేది ఆసక్తికరంగా ఉంటుంది. షెర్లాక్ ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ కాస్త ఎమోషనల్‌గా ఉంటుంది. అయితే అప్పటికే విసిగిపోయిన ప్రేక్షకుడు.. ఆ ఎమోషనల్ సీన్‌కి కూడా అంతగా కనెక్ట్ కాలేకపోతాడు.
ఎవరెలా చేశారంటే..
డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ పాత్రకు వెన్నెల కిశోర్ కొంతవరకు న్యాయం చేశాడు. అయితే శ్రీకాకుళం యాసలో ఆయన పలికే సంభాషణలలో సహజత్వం కలిపించదు. కామెడీ కూడా అంతగా పండించలేకపోయాడు. అనన్య నాగళ్లకు ఓ మంచి పాత్ర లభించింది. భ్రమరాంభ పాత్రలో ఆమె చక్కగా నటించింది. ఆ పాత్రలోని వేరియేషన్స్ ఆకట్టుకుంటాయి. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టునే తిరుగుతుంది. అనీష్ కురివెళ్ల పాత్రకి వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించడం ఆ క్యారెక్టర్ స్థాయిని తగ్గించింది. రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, బద్రం, నాగ్ మహేష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ అవినాష్ గుర్లింక్ తన కత్తెరకు ఇకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment