Srinivasapuram
-
'ఆడపిల్లలను బయట ప్రాంతాలకు పంపొద్దు'
గోపవరం : దళారుల మాటలను నమ్మి ఆడపిల్లలను బయట ప్రాంతాలకు పంపవద్దని కడప జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ జడ్జి ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని శ్రీనివాసపురంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు సంపాదనపై ఆశపడి ఆడపిల్లలను బయటి ప్రాంతాలకు పంపడం వలన అక్కడ వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారనేది ఎవరికి తెలియదన్నారు. అక్కడ ప్రాణానికి ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడే తల్లిదండ్రుల దృష్టికి వస్తుందన్నారు. నేషనల్ లీగల్ సెల్ అథారిటీ ప్రకారం 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. దీనికి చట్టాలు కూడా వర్తిస్తాయి. కానీ అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను కూడా బయటికి పంపడం చట్టరీత్యా నేరమన్నారు. దళారుల మాటలను నమ్మి పిల్లలను వారికి అప్పచెబుతారని, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వారు అమ్మకాలు పెడుతున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అధికశాతం ఆసుపత్రుల్లో చట్టవ్యతిరేకంగా స్కానింగ్ సెంటర్లు కొనసాగుతున్నాయని, అలాంటి సెంటర్లను గుర్తించి జిల్లాకలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. ఆసుపత్రిలో స్కానింగ్ ఏర్పాటు చేసేటప్పుడు కలెక్టర్ అనుమతి తప్పనిసరి అన్నారు. ఆడపిల్లలు బాగా చదివితే మంచి ఉద్యోగాలు వస్తాయని, ప్రభుత్వాలు కూడా వారికి 33 శాతం రిజర్వేషన్ కేటాయించడం జరిగిందన్నారు. ప్రతిఒక్కరూ ఆడపిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో భారతరత్న మహిళా మండలి చైర్పర్సన్ సరస్వతిదేవి, ఎస్ఐ నరసింహారెడ్డి, ఇన్చార్జి ఎంపీడీఓ నాగార్జునుడు, అడ్వకేట్ రమణారెడ్డి, ఆర్ఐ శ్రీనివాసులు, ఈఓపీఆర్డీ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పేద విద్యార్థుల అభ్యున్నతికి సహకరించాలి
శ్రీనివాసపురం (హుజూర్నగర్ రూరల్) : పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి దాతలు సహకరించాలని ఎంఈఓ లక్పతినాయక్ కోరారు. మండలంలోని శ్రీనివాసపురం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయుడు చెరుకు రామాంజనేయ శాస్త్రి ఇచ్చిన రూ. 5 వేల విలువైన పుస్తకాలు, ఇతర సామగ్రిని ఎంఈఓ శనివారం విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతల సహకారంతో పాటు గ్రామస్తులూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో యూపీఎస్ హెచ్ఎం దేవరం రాంరెడ్డి, ఉపాధ్యాయులు, సీఆర్పీ చిక్కుళ్ల గోవిందు, సైదులు, విజయ్‌కుమార్, రామాంజనేయ శాస్త్రి, శ్రీను, జానీ బేగం, రవికిషోర్, అనిల్‌రెడ్డి, లావణ్య, స్పందన పాల్గొన్నారు. -
నిర్వాసితులను ఆదుకుంటాం
సీఎం సిద్ధరామయ్య రైల్వే కోచ్ పరిశ్రమ నిర్మాణ పనులకు సిద్ధు శంకుస్థాపన ప్రతి ఏటా 500 బోగీల ఉత్పత్తి లక్ష్యం ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు నాలుగేళ్లలో ఉత్పత్తి ప్రారంభం కోలారు, న్యూస్‌లైన్ : రైల్వే కోచ్ తయారీ పరిశ్రమకు భూములిచ్చిన ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీనిచ్చారు. శ్రీనివాసపురం తాలూకా యదరూరు వద్ద 1,118 ఎకరాల విస్తీర్ణంలో రూ.1460 కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పరిశ్రమకు ఆయన బుధవారం శంకుస్థాపన చేసి, ప్రసంగించారు. పరిశ్రమ ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోయిన ప్రతి రైతు కుటుంబానికి ఉద్యోగం కల్పిస్తామని అన్నారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన స్థలంలో ఇప్టికే 568 ఎకరాలను రైల్వే శాఖకు అందించినట్లు వివరించారు. మిగిలిన భూమిని రైతుల నుంచి స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా 500 బోగీల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించనున్న ఈ ఫ్యాక్టరీలో ఐదు వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల వల్ల భవిష్యత్తులో కోలారు జిల్లా ఎంతగానో అభివృద్ధి చెందుతుందన్నారు. ముళబాగిలులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిచ్చిందని, దీనికి 12వేల ఎకరాల స్థలం అవసరమవుతుందని తెలిపారు. తద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయన్నారు. శిఢ్లఘట్టలో 100 ఎకరాలలో జౌళి పార్కు, చింతామణిలో 50 ఎకరాల స్థలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తదితరాలను ప్రారంభించడం ద్వారా ఈ ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. రైల్వే బోగీలకు డిమాండ్ హుబ్లీ రైల్వే జోనల్ మేనేజర్ పీకే సక్సేనా మాట్లాడుతూ పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైల్వే బోగీలకు డిమాండ్ అధికంగా ఉందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ఈ కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు చెప్పారు. నాలుగేళ్లలో బోగీల ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సూక్ష్మ, చిన్న తరహా మంత్రి కేహెచ్. మునియప్ప, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి రోషన్ బేగ్, వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి యూటీ. ఖాదర్, ఎమ్మెల్యేలు రమేష్‌కుమార్, కొత్తూరు మంజునాథ్, నారాయణ స్వామి, వై రామక్క, ఎమ్మెల్సీలు నజీర్ అహ్మద్, వైఎ. నారాయణస్వామి, జడ్పీ. అధ్యక్షుడు తూపల్లి నారాయణస్వామి, తాలూకా పంచాయతీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్, రైల్వే సలహా మండలి సభ్యుడు స్వామి నాథన్, కలెక్టర్ డీకే. రవి తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఒప్పంద పత్రాలపై సంతకాలు
కోలారు, న్యూస్‌లైన్ : జిల్లాలోని శ్రీనివాసపురం తాలూకాలో కేంద్ర ప్రభుత్వం స్థాపించనున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఒప్పంద పత్రాలపై రాష్ట్ర ప్రభుత్వం గురువారం సంతకాలు చేసింది. బెంగళూరులోని విధానసౌధలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ర్ట ప్రభుత్వం తరుఫున ప్రిన్సిపల్ సెక్రటరీ వందితాశర్మ, కేంద్ర రైల్వే శాఖ తరుఫున రైల్వే బోర్డు సభ్యుడు (మెకానికల్, ఇంజినీరింగ్ బోర్డు) కె.స్వామినాథన్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేంద్ర మంత్రి కె.హెచ్.మునియప్ప, జిల్లా ఇన్చార్జి మంత్రి యు.టి.ఖాదర్ పాల్గొన్నారు. కాగా, రూ. 1460 కోట్ల వ్యయంతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకు గాను 1100 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేసింది. -
భూ సర్వే కోసం రూ. 900 కోట్లు రిజర్వు
= 1800 మంది సర్వేయర్ల నియామకం = రాష్ట్ర రెవెన్యూ మంత్రి శ్రీనివాసప్రసాద్ కోలారు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో భూ సర్వే చేయడానికి రూ. 900 కోట్లు రిజర్వు చేశామని, ఇందులో రూ. 90 కోట్లు ఇప్పటికే విడుదల చేశామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి వి శ్రీనివాసప్రసాద్ అన్నారు. బుధవారం శ్రీనివాసపురం పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన వివిధ పథకాలకు సంబంధించిన లబ్దిదారులకు ప్రమాణ పత్రాలు అందజేసి మాట్లాడారు. రెవెన్యూలో పలు సమస్యలు ఉన్నాయని, సర్వేయర్ల కొరత వల్ల సమస్యలు ఎక్కువ అవుతున్నాయని, ఈ నేపథ్యంలో సీఅండ్‌ఆర్ (క్యాడర్ అండ్ రిక్రూట్మెంట్ రూల్స్) ద్వారా 1800 మంది సర్వేయర్ల నియమించి శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రాష్ట్ర భూ ప్రదేశాన్ని సర్వే చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనికి సర్వేయర్ల కొరత ఏర్పడితే లెసైన్సు కలిగిన ప్రైవేటు సర్వేయర్లను ఎంపిక చేసుకుని సర్వే పనులకు వినియోగించుకుంటామన్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ అదాలత్‌లను నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ సౌకర్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా శ్రీనివాసపురం పట్టణంలో మిని విధానసౌధ నిర్మాణానికి రూ. 5 కోట్లు విడుదల చేశామన్నారు. కేంద్రమంత్రి కేహెచ్ మునియప్ప మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పలు సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. బయలు సీమ జిల్లాలో ఏర్పడిన నీటి సమస్య నివారణకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య సిద్దరామయ్య చొరవ చూపాలన్నారు. శ్రీనివాసపురంలో త్వరలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ప్రారంభమవుతందని, దీనికి రూ. 1500 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రమేష్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్, జెడ్పీ అధ్యక్షుడు తూపల్లి నారాయణస్వామి, కలెక్టర్ డీకే రవి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రమేష్‌కుమార్ ఆక్రోశం ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ స్పీకర్, ఎమ్మెల్యే రమేశ్ కుమార్ తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు. మంత్రలందరూ గౌరవనీయులంటే తాను ఒప్పుకొనేది లేదన్నారు. నేటి రాజకీయాలు కలుషితమవుతున్నాయని, పైరవీలు చేసే వాళ్లు, ధనవంతులకే అవకా శాలు వస్తున్నాయన్నారు. ఇదిలా ఉంటే తనకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంతోనే రమేశ్ కుమార్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.