భూ సర్వే కోసం రూ. 900 కోట్లు రిజర్వు | For a survey of the land. 900 crore reserved | Sakshi
Sakshi News home page

భూ సర్వే కోసం రూ. 900 కోట్లు రిజర్వు

Published Thu, Jan 9 2014 5:07 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

For a survey of the land. 900 crore reserved

= 1800 మంది సర్వేయర్ల నియామకం           
 =  రాష్ట్ర రెవెన్యూ మంత్రి శ్రీనివాసప్రసాద్

 
కోలారు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో భూ సర్వే చేయడానికి రూ. 900 కోట్లు రిజర్వు చేశామని, ఇందులో రూ. 90 కోట్లు ఇప్పటికే విడుదల చేశామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి వి శ్రీనివాసప్రసాద్ అన్నారు. బుధవారం శ్రీనివాసపురం పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన వివిధ పథకాలకు సంబంధించిన లబ్దిదారులకు ప్రమాణ పత్రాలు అందజేసి మాట్లాడారు. రెవెన్యూలో పలు సమస్యలు ఉన్నాయని, సర్వేయర్ల కొరత వల్ల సమస్యలు ఎక్కువ అవుతున్నాయని, ఈ నేపథ్యంలో సీఅండ్‌ఆర్ (క్యాడర్ అండ్ రిక్రూట్‌మెంట్ రూల్స్) ద్వారా 1800 మంది సర్వేయర్ల నియమించి శిక్షణనిస్తున్నట్లు తెలిపారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రాష్ట్ర భూ ప్రదేశాన్ని సర్వే చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనికి సర్వేయర్ల కొరత  ఏర్పడితే లెసైన్సు కలిగిన ప్రైవేటు సర్వేయర్లను ఎంపిక చేసుకుని సర్వే పనులకు వినియోగించుకుంటామన్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ అదాలత్‌లను నిర్వహించి అర్హులైన  లబ్ధిదారులకు పింఛన్ సౌకర్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా శ్రీనివాసపురం పట్టణంలో మిని విధానసౌధ నిర్మాణానికి రూ. 5 కోట్లు విడుదల చేశామన్నారు.

కేంద్రమంత్రి కేహెచ్ మునియప్ప మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పలు సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. బయలు సీమ జిల్లాలో ఏర్పడిన నీటి సమస్య నివారణకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య సిద్దరామయ్య చొరవ చూపాలన్నారు. శ్రీనివాసపురంలో త్వరలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ప్రారంభమవుతందని, దీనికి రూ. 1500 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రమేష్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్, జెడ్పీ అధ్యక్షుడు తూపల్లి నారాయణస్వామి, కలెక్టర్ డీకే రవి తదితరులు పాల్గొన్నారు.
 
ఎమ్మెల్యే రమేష్‌కుమార్ ఆక్రోశం
 
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ స్పీకర్, ఎమ్మెల్యే రమేశ్ కుమార్ తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు. మంత్రలందరూ గౌరవనీయులంటే తాను ఒప్పుకొనేది లేదన్నారు. నేటి రాజకీయాలు కలుషితమవుతున్నాయని, పైరవీలు చేసే వాళ్లు, ధనవంతులకే అవకా శాలు వస్తున్నాయన్నారు. ఇదిలా ఉంటే తనకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంతోనే రమేశ్ కుమార్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement