సీఎం సిద్ధరామయ్య
రైల్వే కోచ్ పరిశ్రమ నిర్మాణ పనులకు సిద్ధు శంకుస్థాపన
ప్రతి ఏటా 500 బోగీల ఉత్పత్తి లక్ష్యం
ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు
నాలుగేళ్లలో ఉత్పత్తి ప్రారంభం
కోలారు, న్యూస్‌లైన్ : రైల్వే కోచ్ తయారీ పరిశ్రమకు భూములిచ్చిన ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీనిచ్చారు. శ్రీనివాసపురం తాలూకా యదరూరు వద్ద 1,118 ఎకరాల విస్తీర్ణంలో రూ.1460 కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పరిశ్రమకు ఆయన బుధవారం శంకుస్థాపన చేసి, ప్రసంగించారు. పరిశ్రమ ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోయిన ప్రతి రైతు కుటుంబానికి ఉద్యోగం కల్పిస్తామని అన్నారు.
పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన స్థలంలో ఇప్టికే 568 ఎకరాలను రైల్వే శాఖకు అందించినట్లు వివరించారు. మిగిలిన భూమిని రైతుల నుంచి స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా 500 బోగీల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించనున్న ఈ ఫ్యాక్టరీలో ఐదు వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల వల్ల భవిష్యత్తులో కోలారు జిల్లా ఎంతగానో అభివృద్ధి చెందుతుందన్నారు.
ముళబాగిలులో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిచ్చిందని, దీనికి 12వేల ఎకరాల స్థలం అవసరమవుతుందని తెలిపారు. తద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయన్నారు. శిఢ్లఘట్టలో 100 ఎకరాలలో జౌళి పార్కు, చింతామణిలో 50 ఎకరాల స్థలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తదితరాలను ప్రారంభించడం ద్వారా ఈ ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.
రైల్వే బోగీలకు డిమాండ్
హుబ్లీ రైల్వే జోనల్ మేనేజర్ పీకే సక్సేనా మాట్లాడుతూ పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైల్వే బోగీలకు డిమాండ్ అధికంగా ఉందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ఈ కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు చెప్పారు. నాలుగేళ్లలో బోగీల ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సూక్ష్మ, చిన్న తరహా మంత్రి కేహెచ్. మునియప్ప, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి రోషన్ బేగ్, వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి యూటీ.
ఖాదర్, ఎమ్మెల్యేలు రమేష్‌కుమార్, కొత్తూరు మంజునాథ్, నారాయణ స్వామి, వై రామక్క, ఎమ్మెల్సీలు నజీర్ అహ్మద్, వైఎ. నారాయణస్వామి, జడ్‌పీ. అధ్యక్షుడు తూపల్లి నారాయణస్వామి, తాలూకా పంచాయతీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్, రైల్వే సలహా మండలి సభ్యుడు స్వామి నాథన్, కలెక్టర్ డీకే. రవి తదితరులు పాల్గొన్నారు.
నిర్వాసితులను ఆదుకుంటాం
Published Thu, Mar 6 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 4:23 AM
Advertisement
Advertisement