నారాయణగిరిలో వైభవంగా ఛత్రస్థాపనోత్సవం
తిరుమల: తిరుమలలోని నారాయణగిరిలో ఉన్న శ్రీవారి పాదాల వద్ద మంగళవారం ఉదయం వైభవంగా ఛత్రస్థాపన మహోత్సవం జరిగింది. శ్రీనివాసుడు భూలోకానికి వచ్చినప్పుడు తొలిసారిగా పాదాలు మోపిన దివ్య స్థలంగా ప్రసిద్ధిగాంచిన నారాయణగిరిలో ఉన్న పాదాల చెంత ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా అక్కడ అర్చకులు శాస్త్రోకంతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నూతన ఛత్రాన్ని అక్కడ ప్రతిష్టించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
కాగా, తిరుమల శ్రీవారిని కంచికామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. మరోవైపు భక్తుల రద్దీ తక్కువగా ఉంది. సర్వదర్శనం భక్తులకు 4 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.