'పొరపాటున అత్యాచారాలు జరుగుతున్నాయి'
మహిళలపై అత్యాచారాలు పొరపాటుగానే జరుగుతున్నాయని తాజాగా ఛత్తీస్‌గఢ్ హోం శాఖ మంత్రి రామ్ సేవక్ పైక్రా తాజాగా సెలవిచ్చారు. ఎవరికి అత్యాచారం చేయాలనే అనుకోరని... ఒక్కోసారి పొరపాటుగా అవి జరుగుతాయని తెలిపారు. శనివారం ఛత్తీస్గడ్ రాజధాని రాయ్‌పూర్‌లో రామ్ సేవక్ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్బంగా ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న అత్యాచార సంఘటనలపై స్పందించాలని ఆయన్ని విలేకర్లు కోరారు. దాంతో ఆయన పై విధంగా స్పందించారు. అయితే రాష్ట్రంలో మహిళలపై ఎక్కడ ఎప్పడు ఎటువంటి దాడులు జరిగిన వెంటనే స్పందించాలని పోలీసు శాఖను ఆదేశించినట్లు చెప్పారు.
అయితే రామ్ సేవక్ వ్యాఖ్యలపై ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూపేష్ బాగల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హోం మంత్రి స్థానంలో ఉండి అత్యాచార ఘటనలపై రామ్ సేవక్ స్పందించిన తీరు సరిగాలేదని భూపేష్ విమర్శించారు. మహిళలను కించపరిచేలా ఆయన మాట్లాడారని ఆరోపించారు. మహిళలకు క్షమాపణలు చెప్పాలని భూపేష్ ఈ సందర్బంగా హోం మంత్రి రామ్ సేవక్‌ను డిమాండ్ చేశారు.