ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఉద్యమించాలి
జోనల్ వ్యవస్థ రద్దుకు నిపుణుల కమిటీని వేయాలి
ప్రైవేట్ లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలి
కరీంనగర్ : ప్రజాస్వామిక తెలంగాణ సాధన ఉద్యమానికి అందరూ ఉద్యమించాలని తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి అన్నారు. ప్రెస్భవన్లో శుక్రవారం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం అన్నివర్గాల ప్రజలు ఉద్యమించారని, ఇందులో ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ పాత్ర మరువలేనిదని గుర్తు చేశారు. అనేక ఆకాంక్షలతో ఏర్పడిన రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాలు గడిచినా ఎలాంటి కొత్తదనం లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. నిధులు, నీళ్లు, ఉద్యోగాలు, వనరులను కాపాడుకునేందుకే ఉద్యమం మొదలైందని, స్వరాష్ట్ర సాధనలో ఆయా రంగాలకు తీరని ద్రోహమే జరుగుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ లెక్చరర్ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నాన్చివేత ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రైవేట్ లెక్చరర్లకు 12 మాసాల జీతభత్యాలు, ఉద్యోగభద్రత, ఆరోగ్యభద్రత, తదితర సౌకర్యాలను ప్రభుత్వ జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. జోనల్ వ్యవస్థ రద్దుకు ముందు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర అధ్యయనం చేయాలని కోరారు. యూనివర్సిటీల్లో ఉపకులపతుల నియామకాలను యూజీసీ గైడ్లైన్స్ కు అనుకూలంగా జరిపి యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడాలన్నారు. తెలంగాణ సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన అధ్యాపక ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు. సమావేశంలో టీఎల్ఎఫ్ అనుబంధ సంఘాల చైర్మన్ బండి చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షుడు గుర్రం అంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సత్యనారాయణరెడ్డి, ఎ.రవికుమార్, ఎ.దినేష్ తదితరులు పాల్గొన్నారు.