ఆంధ్ర పాలకుల తొత్తు రేవంత్రెడ్డి
టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కరుణం పురుషోత్తంరావు
తాండూరు: బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పై కోడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి చేసిన విమర్శలను రాష్ట్ర టీఆర్ఎస్ కార్యదర్శి కరుణం పురుషోత్తంరావు, యాలాల ఎంపీపీ సాయిల్గౌడ్, తాండూరు జెడ్పీటీసీ సభ్యుడు రవిగౌడ్, నాయకులు సురేందర్రెడ్డిలు శనివారం ఒక సంయుక్త ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మద్దతు పలకుండా ఆంధ్ర పాలకులకు తొత్తుగా వ్యవహారిస్తున్న రేవంత్రెడ్డి కేసీఆర్పై చౌకబారు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.
తెలంగాణలో విద్యుత్ సమస్యకు టీడీపీ, కాంగ్రెస్ పాలకులే కారణమని విషయాన్ని రేవంత్రెడ్డి మరిచిపోయి కేసీఆర్పై విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు. రైతులకు రుణమాఫీ కింద 25శాతం బ్యాంకుల్లో జమ చేయడం జరిగిందన్నారు. ఆంధ్రలో ఏపీ ప్రభుత్వం ఇంతవరకు రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. బంగారు తెలంగాణ కోసమే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. తాండూరులో చెక్డ్యాంతోపాటు వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ కోసం జిల్లా మంత్రి మహేందర్రెడ్డి కృషి చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో ఆంధ్రపార్టీ టీడీపీ పని అయిపోయిందని పేర్కొన్నారు.